21న మెగా హీరోల సవాల్?

మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇద్దరూ చేరో ఫ్లాప్ చవిచూసిన వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ్ ల తాజా…

మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇద్దరూ చేరో ఫ్లాప్ చవిచూసిన వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ్ ల తాజా సినిమాలు రెండింటినీ 21నే విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వరుణ్ తేజ-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన ఫిదా సినిమా ఈ నెల 21న విడుదలకు రెడీ అవుతోంది. ఈ విషయం ముందుగానే ఫిక్సయింది. 

అయితే గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లోని గౌతమ్ నందా ఈ నెల 14న విడుదల కావాల్సి వుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా రెండు వారాలు వెనక్కు వెళ్తున్నట్లు ఇండస్ట్రీలో పాకిపోయింది. దీంతో మిగిలిన వారు చకచకా తమ సినిమాలు బయటకు తీయడం ప్రారంభించారు.

సాయిధరమ్ తేజ్-సందీప్ కిషన్ కాంబినేషన్లో కృష్ణవంశీ రూపొందించిన నక్షత్రం అలాంటి సినిమాల్లో ఒకటి. దీన్ని 14న విడుదల చేద్దాం అంటే ఓ సమస్య వచ్చింది. అదే రోజు సందీష్ కిషన్ నటించిన శమంతకమణి విడుదలవుతోంది. దీంతో కావాలంటే ఓ వారం గ్యాప్ లో వేసుకోమని సందీప్ కిషన్ సూచించినట్లు తెలుస్తోంది. 

కానీ 21న వరుణ్ తేజ సినిమా వుంది. పోనీ మరోవారం వెనక్కు వెళ్దామంటే 28న గోపీచంద్-సంపత్ నంది ల గౌతమ్ నందా వుంటుంది. అలాంటి పెద్ద సినిమా, పైగా మాస్ సినిమా మీద వేయడం కన్నా, ఫిదా లాంటి క్లాస్ సినిమా మీద వేయడం బెటర్ అని కృష్ణవంశీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అదే డిసైడ్ అవుతున్నట్లు బోగట్టా. అదే కనుక జరిగితే 21న ఒకే రోజు, ఇద్దరు మెగా హీరోల సినిమాలు ఢీకొంటాయి.