ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న తాపత్రయంతో వున్న బిజెపి ముందూవెనకా చూసుకోకుండా రైతు ఋణమాఫీ ప్రకటించేసింది. నిజానికి ఆంధ్ర, తెలంగాణల రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన ఋణమాఫీకి కేంద్రంలో వున్న బిజెపి ఏ మాత్రం సహకరించలేదు. అది దండగమారి వ్యవహారం అన్నట్లు, రైతులకు క్రమశిక్షణారాహిత్యం మప్పుతున్నట్లు ప్రవర్తించింది. ఆర్బిఐ ద్వారా హెచ్చరికలు జారీ చేయించింది. అయితే యుపికి వచ్చేసరికి ఛాన్సు తీసుకోకూడదని ఆ ప్రకటన చేసింది. సింహావలోకనం చేసి చూస్తే ఆ హామీ లేకపోయినా గెలిచేదనిపిస్తుంది.
ఏది ఏమైనా యుపిలో బిజెపి తీసుకున్న ఆ విధానం వలన దేశమంతా అన్ని రాష్ట్రాలలో ఋణమాఫీ డిమాండ్లు తలెత్తే పరిస్థితి వచ్చిపడింది. ప్రస్తుతం మహారాష్ట్ర ఆ ఉచ్చులో పడింది. నోట్ల రద్దు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదిపివేసింది. ఇంకా కోలుకోలేదు. ఇంతలో జిఎస్టి వస్తోంది. దానివలన అత్యధికంగా నష్టపోయే రాష్ట్రం అదే. నష్టాల్లో వున్న మునిసిపాలిటీలకు నిధులు సమకూరుస్తామని యిటీవలే ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ ప్రకటించాడు. ఏడవ పే కమిషన్ తర్వాత ఉద్యోగుల జీతాలు పెరగబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాఫీ అంటే ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు యిష్టం లేదు.
అయితే రైతు ఉద్యమం బలంగా వున్న మహారాష్ట్రలో రైతు సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. జూన్ 5-9 మధ్య రైతులు పాలు, కూరగాయలు రోడ్లపై పారబోశారు. నగరాలకు, పట్టణాలకు పాలు, కూరలు అందకుండా చేశారు. ఇదే అవకాశమని అధికారం పంచుకుంటున్న శివసేనతో బాటు కాంగ్రెసు, ఎన్‌సిపి వంటి ప్రతిపక్షాలు సైతం వారికి మద్దతివ్వసాగాయి. ఫడ్నవీస్‌కు గత్యంతరం లేకపోయింది. ఋణమాఫీ తథ్యమని, అయితే అది ఎలా చేయాలో నిర్ణయించడానికి ఓ కమిటీ వేస్తానని అన్నాడు. రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ అధ్యక్షతన కమిటీ వేశాడు కూడా.
యుపిలో యిచ్చారు కాబట్టి మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వానికి కూడా యివ్వదని గ్రహించిన ఫడ్నవీస్ తెలుగు రాష్ట్రాలలా ఏదో కొంత పరిమితికి లోబడి యిద్దామనుకున్నాడు. కానీ ఆందోళన మార్గంలో వున్న రైతు సంఘాలు, ప్రతిపక్షాలు పరిమితితో సంబంధం లేకుండా అన్ని స్థాయిలలో వున్న 31 లక్షల మంది రైతులకు, అన్ని రకాల ఋణాలు మాఫీ చేయాలని అడుగుతున్నాయి. అలా యిస్తే రూ.1.32 లక్షల కోట్లు కావాలి. రాష్ట్ర బజెటే రూ.1.25 లక్షల కోట్లు. అందువలన యితర ఆదాయం వున్నవారికి, ప్రభుత్వోద్యోగులకు, ఐదెకరాల కంటె ఎక్కువ భూమి వున్నవారికి, లక్షకు మించి అప్పున్నవారికి మాఫీ చేయకూడదని లెక్కలు వేస్తున్నారు. అలా ఫిల్టర్ చేసి తీసేస్తే రూ.30 వేల కోట్లతో సరిపెట్టవచ్చు.
కానీ పైకి అలా చెపితే రైతు సంఘాలు గగ్గోలు పెడతాయి. అందువలన కమిటీ యింకా చర్చలు సాగిస్తోందని జులై 25 నాటికి మాఫీ పథకానికి రూపురేఖలు ఏర్పడతాయని చెప్తున్నారు. నిజానికి మహారాష్ట్ర బిజెపి తన ఎన్నికల మానిఫెస్టోలో దీన్ని పెట్టలేదు. అయినా యుపి కారణంగా మెడకు చుట్టుకుంది. చివరకు ఏదో ఒక రూపంలో దానికి ఔననక తప్పదు. ఇక అప్పణ్నుంచి రైతుల భాగోతాలు బయట పడవచ్చు. తెలుగు రాష్ట్రాలలో చూడండి, పరిమితికి మించి తీసుకున్నారని, ఒకే భూమిపై రెండేసి సార్లు తీసుకున్నారని, డాక్యుమెంట్లు పెట్టకుండా జిరాక్స్‌లు పెట్టారని, ప్రభుత్వం పెట్టిన లక్ష్యాలు చేరడానికి బ్యాంకు అధికారులు రైతులతో కలిసి కుమ్మక్కయి, యివ్వవలసిన దాని కంటె చాలా కేసుల్లో ఎక్కువ యిచ్చారని బయటకు వచ్చేసింది.
దాంతో ప్రభుత్వాలు చాలా కేసుల్లో మాఫీ చేయలేదు. తీసుకున్న ఋణాలకు వడ్డీలు పెరిగిపోయాయి. బ్యాంకులు కొత్త ఋణాలు యివ్వలేదు. రైతులు విపరీతంగా నష్టపోయారు. మహారాష్ట్ర రైతులు మనవాళ్ల కంటె ఎక్కువ నిజాయితీపరులైతే తప్ప యీ కథ అక్కడా పునరావృతం కావడం తథ్యం. ఇక్కడి ప్రభుత్వాలు రైతుల మోసాలను వెల్లడిస్తూనే సెక్యూరిటీ లేకుండా రైతులకు కొత్త అప్పులివ్వాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చాయి. బ్యాంకులు బేఖాతరు చేశాయి. రైతులు వెళ్లి మొరపెట్టుకున్నా మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఋణమాఫీ తేలేలోగా బ్యాంకులు పంటలు వేసుకునే రైతులకు రూ.10 వేలు పంట ఋణం యివ్వాలని ఆదేశాలిచ్చింది. అదేం కుదరదు అని బ్యాంకులు చెప్పేశాయి. రైతులకు అనేక సమస్యలున్నాయని, వాటికి పరిష్కారాలు కూడా వున్నాయనీ తెలిసినా ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులేయవు. ఋణమాఫీ అనే అడ్డదారిలో వాళ్లను ఆకట్టుకుందామని చూస్తున్నాయి. కల్తీ విత్తనాలతో, కల్తీ ఎరువులతో పంటలు నాశనమై, మార్కెటింగు సౌకర్యాల లేమి వలన పండిన దాన్ని అమ్ముకోలేని రైతు వచ్చే ఏడాది కూడా అప్పుల పాలయితే అప్పుడు వీళ్లేం చేస్తారు?
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]