ఇటీవల కాలంలో ఓవర్ సీస్ మార్కెట్ తెలుగు సినిమాలకు మాంచి క్రేజ్ గా మారింది. అమెరికాలోని వందలాది థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. టాప్ హీరోల సినిమాలు అయిదు నుంచి ఎనిమిది కోట్లు, టాప్ హీరో టాప్ డైరక్టర్ల సినిమాలు పది కోట్లకు పైన పలుకుతున్నాయి.
బాహుబలి 2 సినిమా అయితే ఓవర్ సీస్ మార్కెట్ ను షేక్ చేసేసింది. కానీ అదే బాహుబలి 2 పుణ్యమా అని ప్రస్తుతం ఓవర్ సీస్ మార్కెట్ స్లంప్ లోకి దిగిపోయిందని అంటున్నారు.
బాహుబలి 2 సినిమా హై స్టేక్ వల్ల, కొన్నవాళ్లు, ఏరియాల వారీ కొన్నవాళ్లు అందరి డబ్బులు బ్లాక్ అయిపోయాయట. లాభాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ లెక్కలు అన్నీ తేలి, ఎవరి డబ్బులు వాళ్ల చేతికి రావడానికి అమెరికాలో కనీసం మూడు నెలలు పడుతుందట. దాంతో కొత్త సినిమాల ఒప్పందాలు, కొనుగోళ్లు కాస్త ఆగిపోయాయి.
దీనికి తోడు బాహుబలి 2 తరువాత అమెరికాలో ఏ తెలుగు సినిమా కూడా లాభం కళ్ల చూసిన పాపాన పోలేదు. ఇక్కడ హిట్ అనిపించుకున్న శతమానం భవతి, నేను లోకల్ కూడా అక్కడ నష్టాలే చవిచూసాయి. ఇక డిజె సినిమా అయితే కనీసం నాలుగు కోట్ల లాస్ వుంటుందని అంచనా. దీంతో కొత్త సినిమాలు భారీ రేట్లకు కొనడానికి జంకుతున్నారు.
పైగా విడుదల కావాల్సిన భారీ సినిమాలు అన్నీ ఇరవై కోట్ల నుంచి 25 కోట్ల రేంజ్ లో చెబుతున్నారు. దీంతో ఓవర్ సీస్ బయ్యర్ల గుండెలు గుభేల్ అంటున్నాయి. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ సినిమా చెప్పడం 25 కోట్ల వరకు చెబుతున్నారు. 20 పర్సంట్ బేరం పోయినా, 18-20 కోట్ల రేంజ్ లో రావాలని ఆశిస్తున్నారు.
ఇప్పటి వరకు ఇటు పవన్ కానీ, అటు త్రివిక్రమ్ కానీ, లేదా వాళ్ల కాంబినేషన్ కానీ పది కోట్లను దాటిన రిటర్న్ ను చూడలేదు. ఓవర్ సీస్ మార్కెట్ లో త్రివిక్రమ్ నే కింగ్ అన్నది ఒప్పుకోవాల్సిన విషయమే. మారుతున్న మార్కెట్, సినిమా రేంజ్ అన్నీ కలిపి 18 కోట్ల మేరకు రావడం సాధ్యమే అని నిర్మాతల వాదన. కానీ తేడావస్తే బయ్యర్లు బకెట్ తన్నేసే పరిస్థితి.
మహేష్ బాబు-మురగదాస్ సినిమాకు కూడా పాతిక కోట్ల రేంజ్ లోనే రేటు చెబుతున్నారు. అదీ ఫైనల్ కాలేదు. ఎన్టీఆర్ జై లవకుశ రేటు 15 నుంచి 18 వరకు వుంది. అదీ ఫైనల్ కావాలి. ఇక బాలయ్య -పూరి సినిమాకు కూడా తక్కువేం చెప్పడం లేదు.
గౌతమీపుత్రశాతకర్ణి సినిమా కలెక్షన్లు చూపించి, ఆరు కోట్ల రేంజ్ కోట్ చేస్తున్నారు. కానీ పూరికి ఓవర్ సీస్ లో అంత సీన్ వుండదు. గౌతమీ అంటే క్రిష్ సినిమా కాబట్టి, సబ్జెక్ట్ వేరు కాబట్టి పలికింది. పైసా వసూల్ లాంటి మాస్ మసాలా సినిమాలకు ఓవర్ సీస్ జనాలు అంతగా స్పందించరు.
మొత్తం మీద ఈ సినిమాలు అన్నింటిలో త్రివిక్రమ్ సినిమాకు తొందర లేదు. ఎందుకంటే విడుదలకు ఇంకా టైమ్ వుంది. కానీ మహేష్, ఎన్టీఆర్, బాలయ్య సినిమా ల డేట్ లు వచ్చేసాయి. అందువల్ల వాటి డీల్స్ ముందు ఫైనల్ చేయాలి. అవి ఫైనల్ కావడం అంటే ఒకేసారి దాదాపు యాభై కోట్ల మేరకు ఓవర్ సీస్ జనాలు పెట్టుబడి పెట్టాలన్నమాట.