రంజాన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకాబోతోంది సల్మాన్ నటించిన ట్యూబ్ లైట్ సినిమా. ఈనెల 23న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో చాలా అంచనాలున్నాయి.
ఓ వైపు దంగల్, మరోవైపు బాహుబలి-2 సినిమాలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటే.. వాటిని క్రాస్ చేసే దమ్ము కేవలం సల్మాన్ కే ఉందనేది బాలీవుడ్ ఫీలింగ్. అది నిజం కూడా.
ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ట్యూబ్ లైట్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్… యష్ రాజ్ ఫిలిమ్స్ తో చేతులు కలిపాడు.
దీనివల్ల రికార్డు స్థాయిలో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. అయితే సల్మాన్ ప్లాన్స్ కు ఆదిలోనే చిక్కొచ్చిపడింది. ఈ సినిమా పాకిస్థాన్ రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రంజాన్ సీజన్ పై పాకిస్థాన్ లోకల్ సినిమాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. అసలే వాళ్ల సినిమా మార్కెట్ చిన్నది. ఉన్నంతలోనే రంజాన్ ను క్యాష్ చేసుకోవాలి. ఇలాంటి టైమ్ లో ట్యూబ్ లైట్ పాకిస్థాన్ లో రిలీజ్ అయితే, అది అక్కడి సినీపరిశ్రమకు దెబ్బే.
రంజాన్ సీజన్ లో పరాయి దేశాల చిత్రాల్ని నిషేధించాలంటూ ఇప్పటికే అక్కడ జోరుగా ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందుతున్నాయి.
మరోవైపు పాకిస్థాన్ బాక్సాఫీస్ లో భారతీయ సినిమాల ప్రభావాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్నామ్నాయ మార్గాలు చూస్తోంది. ఇరాన్, టర్కీ దేశాల సినిమాల్ని బాగా ప్రమోట్ చేస్తోంది.
ఇలాచేస్తూనే భారతీయ సినిమాలపై ఎన్నో పరిమితులు విధిస్తోంది. వీటికి తోడు ట్యూబ్ లైట్ సినిమా భారత్-చైనా యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది.
పాక్-చైనా మధ్య రహస్య ఒప్పందాలు, వాళ్ల తెరవెనక స్నేహాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. సో.. ట్యూబ్ లైట్ సినిమాను పాక్ ప్రభుత్వం అనుమతిస్తుందా అనేది అందర్లో ఉన్న పెద్ద డౌట్.
ఒకవేళ పాక్ లో కనుక ట్యూబ్ లైట్ రిలీజ్ కాకపోతే.. ఆ సినిమాకు 30 నుంచి 35 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని ఓ అంచనా.