మహేష్ బాబు-మురగదాస్ సినిమా టీజర్, ట్రయిలర్ రెడీ అవుతున్నాయి. సినిమాను చకచకా రెడీ చేస్తూనే ఇక ప్రమోషన్ వ్యవహారాలపై కూడా దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా జూలై ఒకటిన టీజర్, ఆగస్టు 9న ట్రయిలర్ ఆన్ లైన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాకు వస్తున్న హైప్ ను వీలయినంత పెంచేలా వీటిని తయారుచేస్తున్నారు. ట్రయిలర్ లో రెండే డైలాగులు వుంటాయని తెలుస్తోంది. 167 ఫ్రేమ్ లతో, టోటల్ ట్రయిలర్ రేసింగ్ స్పీడ్ తో, విజువల్ వండర్ గా వుండేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే స్పైడర్ సినిమాను బాలీవుడ్ లో మార్కెట్ చేసే విషయమై నిర్మాత కరణ్ జోహార్ తో డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిటింగ్ లు జరుగుతున్నట్లు వినికిడి.
సాధారణంగా కరణ్ జోహార్ మంచి తెలుగు సినిమాలను 20 పర్సంట్ కమిషన్ మీద బాలీవుడ్ లో మార్కెట్ చేస్తారు. అయితే దానికి ఆయన బ్యానర్ వాల్యూను జోడిస్తారు. ఘాజీ సినిమాను ఇలాగే మార్కెట్ చేసారు.
మరి స్పైడర్ సినిమాను అలాగే మార్కెట్ చేయబోతున్నారో? అవుట్ రేట్ కు తీసుకుంటున్నారో అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. వీలయినంత వరకు మార్కెట్ చేయడానికి కరణ్ జోహార్ మొగ్గుచూపుతారని టాలీవుడ్ టాక్. మరి సురేష్ మూవీస్ టైపులో అన్నమాట.
మొత్తం మీద స్పైడర్ సినిమా షూటింగ్ మాత్రమే కాదు, మిగిలిన పనులు కూడా క్లయిమాక్స్ కు చేరుకుంటున్నాయి.