అనుకోకుండా బాహుబలి ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు కరణ్ జోహార్. సినిమాకు బాలీవుడ్ లో హైప్ తీసుకురావడం కోసం స్వయంగా బాహుబలి నిర్మాతలే కరణ్ జోహార్ ను ఆశ్రయించారు. తర్వాత అది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం, బాలీవుడ్ లోనే నంబర్ వన్ మూవీగా అవతరించడం చకచకా జరిగిపోయాయి.
బాహుబలి సక్సెస్ తో ఇప్పుడు కరణ్ జోహార్ తెలుగు సినిమాల వెంట పడుతున్నాడు. కుదిరితే మరిన్ని టాలీవుడ్ ఫిలిమ్స్ ను బాలీవుడ్ లో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా మహేష్ బాబు సినిమాపై ఈ దర్శక-నిర్మాత కన్నుపడింది.
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా టీజర్ కు ఇప్పటికే ఇండియా వైడ్ మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు మహేష్. ఇంత హైప్ వచ్చిన మూవీని హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తే బాగుంటుందని కరణ్ జోహార్ ఫీలింగ్. ప్రస్తుతం ఈ దిశగానే చర్చలు సాగుతున్నాయి.
స్పైడర్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే సైమల్టేనియస్ గా విడుదల చేయాలనుకున్నారు. తర్వాత మలయాళం, హిందీ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేయాలనేది ప్లాన్. కరణ్ జోహార్ తో డీల్ కనుక సెట్ అయితే, హిందీలోకి కూడా సినిమాను డబ్ చేసి ఒకేసారి విడుదల చేయాల్సి ఉంటుంది.
మురుగదాస్ కు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు కరణ్ జోహార్ మార్కెటింగ్ కూడా యాడ్ అయితే స్పైడర్ సినిమాకు కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది.