ఏదేమైనా దక్షిణాది ప్రేక్షకుల, ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి బోలెడంత వ్యత్యాసం ఉంది. సినిమా విషయంలో అయినా, బుల్లితెర విషయంలో అయినా ప్రేక్షకుల అభిరుచిలో బోలెడంత తేడా ఉంది. అరువు తెచ్చుకున్న విదేశీ తరహా ఎంటర్‌టైన్ మెంట్‌ను ఆదరించడంలో హిందీ ప్రేక్షకులు కొంత ముందున్నారు. మనోళ్లు మాత్రం ఇంకా ఆ తరహా ఎంటర్‌టైన్ మెంట్ రుచిని ఇష్టపడటం లేదు. వెగటు పుట్టినట్టుగానేచూస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో 'బిగ్ బాస్' కొత్త ఎత్తుగడతో వస్తోంది. అటు తమిళంలో కమల్ హాసన్‌ను, ఇటు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌ను నమ్ముకుని వస్తోంది. ఈ స్టార్ల సహకారంతో దక్షిణాదిన సక్సెస్‌ను సొంతం చేసుకోవచ్చనే ఆశలతో బిగ్‌బాస్ మన ముందుకు వస్తోంది. దక్షిణాదిన ఒకవైపు బూతు షోలు ఒక ఊపు ఊపుతున్న క్రమంలో ఇలాంటి షోలకు మరింత ముదురు అయిన బిగ్‌బాస్ షో వస్తోంది. అయితే సక్సెస్ అవుతుందా? అనేది కొశ్చన్ మార్కే!
ఎందుకంటే.. 'బిగ్‌బాస్' తరహా కాన్సెప్టులు మనోళ్లకు ఎక్కేటట్టు అయితే సల్మాన్‌ఖాన్ హోస్టుగా హిందీలో చాలా సంవత్సరాలుగా సాగుతున్న 'బిగ్ బాస్'కే బోలెడంత ఆదరణలభించి ఉండాల్సింది. హిందీ టెలివిజన్ షోలు దక్షిణాదిన ఆదరణను చూరగొనడం కొత్తేమీకాదు కదా. టీవీ మహాభారతంతో మొదలుపెడితే, అమితాబ్ 'కౌన్‌బనేగా కరోడ్ పతి' వంటి కార్యక్రమాల వరకూ బోలెడన్ని హిందీ టెలివిజన్ షోలు దక్షిణాదిన కూడా ఆకట్టుకున్నాయి.
అయితే సల్మాన్‌ఖాన్ ఆధ్వర్యంలోని షో మాత్రం తెలుగు వాళ్ల తలుపు తట్టలేకపోయింది! సల్మాన్ బిగ్‌బాస్ అనేక రకాల సంచలనాలతో వార్తల్లోకి వచ్చినా.. దానికి దక్షిణాదిన వీక్షకాదరణ ఏ మాత్రమూ లభించలేదు. బిగ్‌బాస్‌తో పాపులర్ అయిన సన్నీలియోన్‌ను మనోళ్లు ఆదరించారు కానీ… బిగ్‌బాస్‌ను మాత్రం ఆదరించలేదు.
అదీ తేడా. ఒకవేళ సన్నీతో పాటు బిగ్‌బాస్ కూడా పాపులర్ అయి ఉండుంటే.. ఆ కాన్సెప్ట్ మనోళ్లకు ఎక్కిందని చెప్పడానికి అవకాశం ఉండేది. అయితే.. అది జరగలేదు. కానీ బిగ్‌బాస్ హిందీలో ఆరంభం అయిన రోజులకూ, ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పటికీ ఇప్పటికీ మనోళ్ల రుచి కూడా బాగా మారింది. జబర్ధస్త్‌లు, పటాస్‌లు పేలుతున్నాయిక్కడ.
ఈ సమయంలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఇద్దరు దక్షిణాది స్టార్లను పట్టేశారు. తమ ప్రోగ్రామ్ జనాల్లోకి ఎక్కాలంటే సినీ సెలబ్రిటీలే ఆయుధాలు అనేది బిగ్‌బాస్ బాగా ఎరిగిన వ్యూహం. దీనికి పూర్వానుభవాలు కూడా ఉన్నాయి. వెనుకటికి హిందీ బిగ్‌బాస్‌కు అర్షాద్ వర్సీ హోస్టుగా వ్యవహరించేవాడు. ఆ తర్వాత సల్లూ రంగంలోకి వచ్చాడు. దీంతో ఆ కార్యక్రమానికి ఆదరణ పెరిగింది. సల్లూకి ఉన్న మాస్ ఇమేజ్ బిగ్‌బాస్‌కు బోలెడంత ఆదరణను తెచ్చి పెట్టింది. అదే వ్యూహంతో దక్షిణాదిన దిగింది బిగ్‌బాస్.
ముందుగా వీళ్లు కన్నడ మీద కాన్సన్ ట్రేట్ చేశారు. అక్కడ సుదీప్‌ను హోస్టుగా పెట్టారు. కొన్ని ఎడిషన్లుగా రన్ చేస్తున్నారు. కన్నడలో బాగానే గిట్టుబాటు అయినట్టుగా ఉంది. అదే ఉత్సాహంతో తెలుగు, తమిళాల మీద కన్నేశారు. తమిళంలో కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు. తెలుగులో ఎన్టీఆర్ సెట్ అయ్యా డు. మరి ఇక్కడి వరకూ బాగానే ఉంది కథ.
స్కాండల్ హౌస్‌కి లోకల్ ఫ్లేవర్ దట్టిస్తే..
'బిగ్ బాస్' కార్యక్రమాన్ని మరో రకంగా చెప్పాలంటే అదొక స్కాండల్ హౌస్. చెత్త పనులతో, వివాదాలతో, చీదరింపులను ఎదుర్కొని వార్తల్లో నిలిచిన వారు కొంతమందిని సమీకరించి.. వారందరినీ కొన్ని నెలలపాటు దూరంగా తీసుకెళ్లి.. వారిలో దాగున్న జంతువులను నిద్రలేపడం ఈ కార్యక్రమం పని. వారిలో వారు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ప్రేమించుకోవాలి, ఏమైనా చేసుకోవాలి.. వారందరినీ వారానికి ఒకసారి హోస్టు పలకరిస్తూ ఉంటాడు. కార్యక్రమంలో ఆకట్టుకోలేకపోయిన వివాదాస్పద వ్యక్తి ఎలిమినేట్ అవుతూ వస్తుంటాడు.
అలా ఎలిమినేట్ కాకూడదు అంటే.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అతడు ఏదో ఒకటి చేసుకొంటూ రావాలి. అలా ఆకట్టుకోవడానికి ఎవరి దారులు వారివి! నవ్వులు, ఏడుపులు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు… ఏదైనా అతి చేసేయాలంతే. వెనుకటికి శిల్పాషెట్టి అమెరికన్ బిగ్‌బాస్ పార్టిసిపేట్‌గా వెళ్లి.. జాతి వివక్ష మాటలను ఎదుర్కొని.. తన ఏడ్పుతో అంతర్జాతీయంగా ఫేమస్ అయ్యింది. ఆ దెబ్బతో బిగ్ బాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ విధంగా స్కాండల్స్‌తో ప్రచారాన్ని పొందుతున్న షో ఇది. జాతివివక్ష తిట్లను ఎదుర్కొన్న శిల్ప ఆ ఏడాది బిగ్‌బాస్ విజేతగా నిలిచింది. కోట్లరూపాయల ప్రైజ్ మనీని పొందింది. మరి తిట్లు తినడం కూడా ఈ షోలో ప్లస్ పాయింట్లు కావొచ్చు!
తెలుగునాట ప్రస్తుత టెలివిజన్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. బూతు షోలు రాజ్యం ఏలుతున్నాయి. వాటికి పోటీగా బిగ్‌బాస్ రాబోతున్నట్టుంది. బూతు షోల్లో నటించడం.. బిగ్‌బాస్‌లో జీవించేయడం! జనాలు దాన్ని తట్టుకోగలరా? లేదా? అనేది తేల్చేయలేం. చాలామంది ఏవగించుకునే జబర్ధస్త్ షో టీవీ రేటింగ్స్‌లో టాప్‌లో ఉంది. రేపు అంతకంటే ముదురిన బిగ్‌బాస్ మరింత హైట్స్‌కు వెళ్లవచ్చు కదా!
వివాదాస్పద వ్యక్తులను ఎక్కడ నుంచి తెస్తారు?
ఈ విషయంలో బిగ్‌బాస్‌కి దక్షిణాదిన కొన్ని కష్టాలున్నాయి. హిందీ బిగ్‌బాస్‌కు చాలా వైడ్ సర్కిల్ ఉంది. దేశంలో వివాదాస్పద రీతిలో పాపులర్ అయ్యే ఎవరినైనా తెచ్చుకునే అవకాశం అక్కడ ఉంటుంది. సదరు వివాదాస్పద వ్యక్తుల చేత హిందీ, ఇంగ్లిష్‌లలో మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుందక్కడ. మరి మనదగ్గర అలాంటి అవకాశం అయితే లేదు. దక్షిణాదిన వివాదా స్పద వ్యక్తులు తక్కువ అని అనడానికి లేదుకానీ, హిందీలో అయితే రాఖీ సావంత్ దగ్గర నుంచి రాహుల్ మహాజన్ వరకూ జెన్ గూడీ దగ్గర నుంచి సన్నీలియోన్ వరకూ ఛాయిస్‌లు ఉంటాయి.
అయితే దక్షిణాదిన క్రైమ్ కేసుల్లో ఇరుక్కొ న్న వారికి, స్కాండల్స్‌తో ఫేమస్ అయిన వారి నెక్కువమంది పట్టుకురావడం కష్టమేనేమో. అయినా అదంత పెద్దలోటు కాదు. ఆ లోటును బిగ్‌బాస్ పూడ్చడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. నిన్నా మొన్న వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచిన చలపతిరావు, యాంకర్ రవి వంటి వాళ్లను.. కొంతమంది హీరోలు, దర్శకులు మమ్మల్ని పడుకొమ్మన్నారు అని కామెంట్లు చేసిన కస్తూరి, రాయ్‌లక్ష్మీ వంటి వాళ్లను, నిత్యా నంద, రంజిత వంటి స్వాములోరిని.. శ్వేతబసు ప్రసాద్‌లా వార్తల్లో నిలిచిన వారిని.. ఈ తర హాలో దక్షిణాదిన బాగా గుర్తింపుకు నోచుకున్న వారిని ఇక్కడ పార్టిసిపెంట్స్ చేసుకోవాల్సి ఉం టుంది.
శృంగార తార షకీలా… వంటి వాళ్లను పిలిపించి.. అందరితో పాటూ కూర్చోబెట్టి ఎదుర్కొన్న అనుభవాలను చెప్పింది కన్నీళ్లు కార్పిస్తే.. బిగ్‌బాస్ దక్షిణాదిన కూడా సెన్షేషనల్ హిట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఫస్ట్ స్టెప్పులో సక్సెస్సే..!
తమిళ వెర్షన్‌కి కమల్ హాసన్, తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్.. ఈ రకంగా చూస్తే హోస్టులుగా స్టార్లను పట్టడంలో బిగ్‌బాస్ సూపర్ సక్సెస్ అయ్యింది. వీరు వ్యక్తిగత చాతుర్యంతో షోని రక్తి గట్టించగల సమర్థులే. ఇక రెండో స్టెప్పు పార్టిసిపెంట్స్.. ఖాళీగా ఉన్న హీరోయిన్లు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాళ్లు, మర్డర్ మిస్టరీలతో సంబంధాలు కలిగిన వాళ్లను వెదికి పట్టుకోవడమే ఇక.
ఇప్పటి వరకూ బూతే భవిష్యత్తు అన్నట్టుగా బూతు దారిలో పయనించిన తెలుగు టెలివిజన్ రంగం ఇప్పుడు మరో సూపర్ లేటివ్ డిగ్రీతో ముందుకు వెళ్లబోతోంది. స్కాండల్ హౌస్‌గా రూపాంతరం చెందుతోంది. దీనికి స్టార్‌కాస్ట్ కూడా తోడవుతోంది. మరి ఇందులోని చమక్కులు ఎలా ఉంటాయో, దీనిపై ఎన్ని విమర్శలు వస్తాయో లెట్ వెయిట్ అండ్ సీ!