అబ్బే.. ఆ నటీమణికి ఎఫైర్స్ లేవన్న మేనేజర్!

నమ్మడం కష్టమే… ఆమెకు యాభై యేళ్లు వచ్చాయంటే! కానీ నిజం. హీరోయిన్ తరహా పాత్రల నుంచి చాలా కాలం కిందటే రిటైరైన మాధురీ వివాహం తర్వాత ఏదో విధంగా మీడియాతో టచ్ లోనే ఉంది.…

నమ్మడం కష్టమే… ఆమెకు యాభై యేళ్లు వచ్చాయంటే! కానీ నిజం. హీరోయిన్ తరహా పాత్రల నుంచి చాలా కాలం కిందటే రిటైరైన మాధురీ వివాహం తర్వాత ఏదో విధంగా మీడియాతో టచ్ లోనే ఉంది. మరి యాభై యేళ్లు వచ్చిన సందర్భంగా ఆమె అందం గురించి అభినందన కార్యక్రమాన్ని పక్కన పెడితే.. ఆమె మాజీ మేనేజర్ ఒక రాసిన కాలమ్ ఆసక్తికరంగా ఉంది.

మాధురీ కెరీర్ లో 28 యేళ్ల పాటు ఒకే వ్యక్తి మేనేజర్ గా వ్యవహరించాడట. ఆమె డేట్లూ గట్రా చూడటం ద్వారా ఆమెకు చాలా నమ్మకస్తుడిగా, చాలా దగ్గరగా మెలిగిన నేపథ్యం ఉన్న ఆ వ్యక్తి పేరు రికేష్ నాథ్. మరి అన్నేళ్ల పాటు ఆమె దగ్గర పని చేశాడంటే.. ఆమె మొత్తం విషయాలన్నీ అతడికి తెలిసే ఉంటాయి కదా. అందుకే అతడి చెప్పే కబుర్లంటే అందరికీ ఆసక్తి.

ఈ నేఫథ్యంలో రికేష్ నాథ్.. మాధురి పై ఒక వ్యాసం రాశాడు. దాని సారాంశం ఏమనగా.. మాధురీ చాలా మంచిది అని! నటిగా, అందం విషయంలోనే కాదు.. వ్యక్తిగతం కూడా ఆమె చాలా మంచి గుణాలున్న మనిషి. అలాంటామె గురించి ప్రచారంలో ఉన్న పుకార్లన్నీ అబద్ధాలే. ఉదాహరణకు.. మాధురీ దీక్షిత్ మంచి ఊపు మీదున్నప్పుడు ఫలానా హీరోతో ఆమెకు ఎఫైర్ అని వార్తలు వచ్చాయే వాటి గురించినే రికేష్ స్పందించాడు.

మిథున్ చక్రవర్తీ, జాకీ ష్రాఫ్, సంజయ్ దత్.. వీళ్లతో మాధురికి ఎఫైర్స్ ఉన్నట్టుగా అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఒక్కోరితో కొంత కాలం.. మాధురికి అనుబంధం అంటూ వార్తలను ప్రచారం చేసింది. ఆ తర్వాత ఆయా బంధాలకు బ్రేకప్ అయినట్టుగానూ మీడియానే చెప్పింది. అయితే అవన్నీ ఉత్తుత్తివే అని రికేష్ నాథ్ తేల్చేశాడు.

అప్పట్లో పుకార్లు రావడం నిజమే కానీ.. మాధురికి ఆ హీరోల్లో ఎవరితోనూ సంబంధాలు లేవని రికేష్ తేల్చి చెప్పాడు.మరి నిప్పులేనిదే పొగ రాదు కదా.. అంటే, అవన్నీ నిర్మాతలు రాయించిన వార్తలని ఆయన అంటున్నాడు. మాధురి, ఆ హీరోల కాంబోలో సినిమాలు వస్తున్నప్పుడు నిర్మాతలు ఎఫైర్స్ వార్తలు మీడియాలో వచ్చేలా చూసే వారని.. దాంతో సదరు సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి పేరిగేదని.. అదంతా నిర్మాతల వ్యూహం అని మాధురి మాజీ మేనేజర్ చెబుతున్నాడు. అన్నేళ్లు మాధురి దగ్గర పని చేసినందుకు ఆమె పై మంచి మాటలే చెబుతున్నాడీయన.