రివ్యూ: బాబు బాగా బిజీ
రేటింగ్: 1.5/5
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
తారాగణం: శ్రీనివాస్ అవసరాల, మిస్తి చక్రవర్తి, సుప్రియ, తేజస్వి, ప్రియదర్శి, రవి ప్రకాష్, తనికెళ్ల భరణి, సుధ తదితరులు
కూర్పు: ఉద్ధవ్ ఎస్.బి.
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: సురేష్ భార్గవ
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: నవీన్ మేడారం
విడుదల తేదీ: మే 5, 2017
అడల్ట్ కామెడీలు తెలుగు సినిమాకి కొత్త కాదు కానీ అవసరాల శ్రీనివాస్‌లాంటి క్లీన్ ఇమేజ్ వున్న నటుడు సెక్స్ అడిక్ట్‌గా నటించడం ఒకింత ఆసక్తి కలిగించింది. ట్రెయిలర్స్ చూస్తే ఎలాంటి అరమరికలు, మొహమాటాలు లేకుండా పరిపూర్ణ సెక్స్ కామెడీగా తీర్చిదిద్దారనే భావన కలిగింది. అయితే నీట్‌గా కట్ చేసిన ఆ రెండున్నర నిమిషాల ట్రెయిలర్లో చూసినది తప్ప ఈ రెండు గంటల సినిమాలో ఎక్కువేమీ లేదు. 'హంటర్' అనే బాలీవుడ్ చిత్రానికి రీమేక్ అయిన 'బాబు బాగా బిజీ' చాలా విషయాల్లో రాంగ్ స్టెప్ వేసింది. ముందుగా లీడ్ రోల్‌కి అవసరాల ఎంపిక కరక్ట్ అనిపించదు. ఆ పాత్రకి తగ్గ యంగ్ లుక్స్ కానీ, కన్నింగ్ ఫీచర్స్ కానీ అతనిలో లేవు. ఓపెనింగ్ సీన్ నుంచే మిస్ కాస్ట్ అనిపిస్తాడు. ఇక కాలేజ్ స్టూడెంట్ అనేసరికి అసలు సెట్ అవలేదు.
ఒరిజినల్లో ఎలాంటి ఇమేజ్ లేని యాక్టర్ లీడ్ క్యారెక్టర్ చేయడంతో ఆ సెటప్ నేచురల్‌గా అనిపిస్తుంది. కానీ అవసరాల శ్రీనివాస్‌కి నటుడిగా, దర్శకుడిగా వున్న ఇమేజ్ వల్ల ఇదంతా ఆర్టిఫిషియల్‌గా తయారైంది. ఏ దశలోను అతను 'ప్లేయర్'లా అనిపించడు. కథలో సరిపడా మేటర్ లేకపోవడం వల్ల మొదలైన కాసేపటికే విసిగిస్తుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ టెక్నిక్‌తో నడిపిన స్క్రీన్‌ప్లే వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. హీరో టీనేజ్ ఎపిసోడ్‌ని అవసరానికి మించి పొడిగించినట్టుంటుంది. తేజస్వితో ఎపిసోడ్ వల్ల కథాగమనానికి జరిగిన ప్రయోజనం ఏమీ వుండదు. పక్కింటి ఆంటీ సుప్రియతో అవనరాల నడిపే అఫైరే టార్గెట్ ఆడియన్స్‌ని కాస్తయినా ఆకట్టుకునేది. మిస్తి చక్రవర్తితో పరిచయం, ప్రేమ, నిశ్చితార్ధం వగైరా అన్నీ స్లోగా, అనాసక్తికరంగా నడుస్తూ బాగా విసిగిస్తాయి.
హీరోని అచ్చమైన ప్లేబాయ్‌గా చూపించేదంతా ఒక పాటకే పరిమితం చేసారు. మిగతా సమయం అతను తన బలహీనత గురించి మిస్తితో చెప్పాలా వద్దా అనే తటపటాయింపుతోనే సరిపెట్టారు. ఫైనల్‌గా రివీల్ చేసినపుడు కూడా కన్వీనియంట్ రూట్ తీసుకున్నారే తప్ప కన్విన్సింగ్ ఎండింగ్ కోసం ట్రై చేయలేదు. పోసాని ఎపిసోడ్లో పేలిన పంచ్‌లు, 'పెళ్లిచూపులు' ఫేమ్ ప్రియదర్శి మార్కు డైలాగులు మినహా ఇందులో చెప్పుకోతగిన విషయం లేదు. బాలీవుడ్ వెర్షన్ మాదిరిగా సదరు శృంగార సన్నివేశాల్లో ధైర్యం చేయలేకపోవడంతో ఎవరినైతే టార్గెట్ చేసారో వారి నుంచి కూడా పెదవి విరుపులు తప్పవు.
అల్ట్రా లో బడ్జెట్లో తీయడం వల్ల ప్రొడక్షన్ వేల్యూస్ చీప్‌గా అనిపిస్తాయి. సినిమాలా కాకుండా చాలా చోట్ల షార్ట్ ఫిలింని బిగ్ స్క్రీన్‌పై చూస్తోన్న భావననిస్తుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ ఏమాత్రం ఆకట్టుకోవు. ఒరిజినల్ వెర్షన్‌ని కథ, కథనాల పరంగా మార్చడానికి దర్శకుడు నవీన్ ప్రయత్నించలేదు. తెలుగు నేటివిటీకి, ఇక్కడి వారి సెన్సిబులిటీస్‌కి అనుగుణంగా చేసిన మార్పులేమీ లేవు. అడల్ట్ కంటెంట్ టోన్ డౌన్ చేయడం మినహా అతను ఒరిజినల్ని మక్కీకి మక్కీ ఫాలో అయిపోయాడు. అయితే కాస్టింగ్ దగ్గరే రాంగ్ స్టెప్ వేసిన ఈ బాబు ఆద్యంతం తడబడుతూనే సాగాడు.
కామెడీకి కూడా క్లాస్ టచ్ జోడించే అవసరాల శ్రీనివాస్ ఇందులోని 'ప్లేయర్' క్యారెక్టర్ని జస్టిఫై చేయలేకపోయాడు. ఆ క్యారెక్టర్‌కి అవసరమైన 'రోగ్' లుక్ అతనిలో మచ్చుకైనా కనిపించలేదు. కాలేజ్ స్టూడెంట్‌లా కాకుండా లెక్చరర్లా అనిపించాడు. ఏ హీరోయిన్‌తోను అతనికి కెమిస్ట్రీ కూడా కుదర్లేదు. మిస్తి పర్ఫార్మెన్స్ చాలా వీక్. తేజస్వి గురించి చెప్పడానికేం లేదు. వీరిద్దరి కంటే ఒకటే సీన్ చేసిన శ్రీముఖి ఎఫెక్టివ్‌గా అనిపించింది. ఆంటీ పాత్రలో సుప్రియ మెప్పించింది. ప్రియదర్శి నటన సహజంగా వుంది. పోసాని ఒక్క సీన్లో కనిపించినా కానీ తనదైన శైలిలో నవ్వించాడు.
ముందే చెప్పినట్టు ట్రెయిలర్ చూసినట్టయితే 'బాబు బాగా బిజీ' అంతకుమించి ఆఫర్ చేసేదేమీ లేదు. ట్రెయిలర్ చూసి చాలా బోల్డ్‌గా వుంటుందని, అడల్ట్ స్టఫ్ ఎక్కువ వుంటుందని ఆశిస్తే నిరాశ తప్పదు. కొన్ని ద్వందార్ధ సంభాషణలు, ఒకట్రెండు హాట్ సన్నివేశాలు తప్ప మిగిలిన వ్యవహారమంతా సుదీర్ఘమైన నిట్టూర్పుల నీరసమే తప్ప ఆహ్లాదం కలిగించే సరదా సరసాలేం లేవు.
బాటమ్ లైన్: బ్యాడ్ 'ప్లేయర్'!
– గణేష్ రావూరి