సూపర్ స్టార్ మహేష్ బాబు-మురగదాస్ సినిమాకు భలే బజ్ వున్న సంగతి తెలిసిందే. వందకోట్లకు పైగా బడ్జెట్ తో తయారవుతున్న సినిమా ఇది. ఈ సినిమా ట్రేడ్ స్టార్ట్ అయింది. తొలిగా వెస్ట్ గోదావరి హక్కులు విక్రయించారు. ఎల్వీఆర్ సినిమా సంస్థ 5.04 కోట్ల కు స్పైడర్ పంపిణీ హక్కులు చేజిక్కించుకుంది. ఇక్కడ ఖైదీ నెంబర్ వన్ సినిమాను 4.6 కోట్లకు అమ్మారు. బాహుబలి వన్ ను 4.5 కోట్లకు విక్రయించారు. ఖైదీ నెంబర్ 150 ఆరుకోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఈ లెక్కన స్పైడర్ రీజనబుల్ రేటుకే విక్రయించారు అనుకోవాలి.
విశాఖ హక్కుల బేరసారాలు సాగుతున్నాయి. వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి ఈ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎనిమిది కోట్లకు పైగా కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఖైదీ నెంబర్ 150 8 కోట్ల దగ్గరలో కొన్నారు. 13 కోట్ల వరకు వసూళ్లు సాగించింది. అందువల్ల స్పైడర్ సినిమాను 8 కోట్ల రేంజ్ లో అమ్ముతారా అన్నది అనుమానం. బహుశా పది రేంజ్ లో క్లోజ్ అయ్యే అవకాశం వుందని వినికిడి.
అయితే విశాఖ కానీ, మిగిలిన ఏరియాలు కానీ, బాహుబలి 2 కలెక్షన్లు చూసిన తరువాతే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. స్పైడర్ సినిమా షూట్ ఫైనల్ షెడ్యూలు హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. ఏకధాటిగా సాగి, ప్యాకప్ చేస్తారు. ఆగస్టులో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ శ్రీమంతుడు సినిమా ఆగస్టులోనే విడుదలై సూపర్ హిట్ అయిందన్న సెంటిమెంట్ కూడా వుంది.