టాలీవుడ్ లో చిన్న సినిమాలంటే పాపం ఎప్పుడూ చిన్న చూపే. జాతీయ అవార్డులు ప్రకటించారు. శతమానం భవతి సినిమాను అన్ని విధాలా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసారు. బాగానే వుంది. అదే సమయంలో తొలిసారి తెలుగు సినిమాకు సంభాషణల విభాగంలో అవార్డు వచ్చింది. పెళ్లి చూపులు సినిమా ఆ అవార్డును గెల్చుకుంది. అదే సమయంలో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కూడా ఆ సినిమా అవార్డు తెచ్చుకుంది.
అయితే మొన్నటికి మొన్న అల్లు అకాడమీ అంటూ మెగా క్యాంప్ నిర్మాత దిల్ రాజును అపూర్వంగా సన్మానించేసింది. తప్పులేదు. మంచి సినిమాలు తీస్తున్న నిర్మాత, అకేషన్ కుదిరింది. సన్మానించారు. కానీ పనిలో పనిగా పెళ్లి చూపులు సినిమా నిర్మాతలను మాత్రం ఎందుకు సన్మానించకూడదు. కోటి రూపాయల లోపు ఖర్చుతో మంచి సినిమా తీసి అందించారు. విజయం సాధించారు. అవార్డులు పొందారు. మరి సన్మానానికి అర్హులు కారా?
దిల్ రాజు అంటే అల్లు అరవింద్ తో థియేటర్ల వ్యాపారంలో భాగస్వామి. అలాగే అల్లు అర్జున్ తో సిన్మా తీస్తున్న నిర్మాత. పైగా మెగాస్టార్ చిరంజీవికి 150 వ సినిమా సందర్భంగా అభినందించిన వ్యక్తి. పెళ్లి చూపులు నిర్మాతలు చిన్నవాళ్లు. సినిమాను విడుదల చేసుకోవడానికి గీతాను కాకుండా సురేష్ మూవీస్ ను ఆశ్రయించిన వాళ్లు. అందుకే వారు సన్మానానికి అర్హులు కాలేదేమో అన్నది ఇండస్ట్రీలో గుసగుసల సారాంశం.