రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో టీడీపీ తరపున బరిలో నిలిచేందుకు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పట్టభద్రుల తరపున పోటీ చేసేందుకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
పులివెందుల నియోజకవర్గానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. గతంలో ఆయన జర్నలిస్టుగా కూడా పని చేశారు. సామాజిక, రాజకీయ అంశాలపై లోతైన పరిశీలన, అవగాహన రాంగోపాల్‌రెడ్డికి ఉన్నాయి.
వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో వారికి ఎదురొడ్డి నిలబడడం ఆశ్చర్యమే. అనేక మార్లు ప్రత్యర్థులు దాడులు, బెదిరింపులకు పాల్పడినా రాంగోపాల్ మాత్రం వెనకడుగు వేయకుండా చంద్రబాబు, లోకేశ్‌తో పార్టీ పార్టీ పెద్దల ప్రశంసలు పొందారు. గతంలో పులివెందుల నియోజకవర్గంలో వేల్పుల సొసైటీ ఎన్నికల సందర్భంగా నాటి టీడీపీ ఇన్చార్జ్ ఎస్వీ సతీష్‌రెడ్డి గన్‌మెన్స్ జరిపిన కాల్పుల్లో కాంగ్రెస్ మద్దతుదారులు చనిపోయారు.
ఈ ఘటనకు నిరసనగా పులివెందులలో రాంగోపాల్‌రెడ్డి ఇంటిపై ప్రత్యర్థులు దాడులు జరిపారు. అలాగే అభివృద్ధిపై ఎస్వీ సతీష్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు రాంగోపాల్‌రెడ్డి పార్టీ తరపున ధైర్యంగా నిలిచారు. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుని కడప లోక్‌సభ ఉప ఎన్నికకు వెళ్లారు. 5 లక్షలకు పైగా భారీ మెజార్టీతో కడప ఎంపీగా వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు.
అయితే పులివెందుల నియోజక వర్గంలో రాంగోపాల్‌రెడ్డి స్వగ్రామం కాంబల్లెలో మాత్రం టీడీపీకి మెజార్టీ రావడం విశేషం. తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కడప జిల్లా టీడీపీ కార్యదర్శిగా, అలాగే టీడీపీ శిక్షణా తరగతుల డైరెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం టీడీపీ మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
గతంలో రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ తరపున వెంకటశివారెడ్డి గెలుపొందారు. జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగుల్లో వ్యతిరేకల నెలకున్న కారణంగా పట్టభద్రుల స్థానం నుంచి గెలుపొందుతానని రాంగోపాల్‌రెడ్డి ఆశాభావంతో ఉన్నారు.