ఘనత వహించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతోంది. ఈ విషయంలో అడుగులు వేగంగానే ముందుకు పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాటి విషయమేంటి అన్న దాని మీద మదింపు కోసం ఒక కమిటీని కేంద్రం తాజాగా నియమించడంతో ప్లాంట్ కధ కొత్త మలుపు తిరిగింది.
ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులను లెక్క కట్టడానికి కేంద్రం ఆ మధ్యన టెండర్లు పిలిచారు. దానిలో పది మంది పాల్గొన్నారు, ఇక వారిలో ముగ్గురిని అంగీకరించి, చివరకు జిఎఎ సంస్థకు ఖరారు చేశారు. అంటే ప్లాంట్ ఆస్తులు లెక్క తేలబోతోంది అన్న మాట. ప్లాంట్ ని వంద శాతం వ్యూహాత్మక అమ్మకానికి పెడతామని గత ఏడాది కేంద్రం ప్రకటించిన నేపధ్యంలో ఈ ఆస్తుల మదింపు అత్యంత కీలకంగా మారుతోంది.
ఇక ఇప్పటికే ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలను చేసి వారితో ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలను కేంద్రం చేస్తోంది. ఇక వీటితోపాటు నేడు ఆస్తుల మదింపు ప్రక్రియను కూడా కేంద్రం ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ మీద వేటు ప్రక్రియ దూకుడుగా సాగుతోందని ఉక్కు కార్మికులు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృత్రం చేస్తామని వారు ప్రకటించారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయకుండా ఆపుతామని అంటున్నారు. విశాఖ ఉనికిగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తే ఇక ఈ నగరానికి గర్వం ఏముంటుంది అని కార్మిక సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
ముఖ్యమంత్రి రెండు సార్లు కేంద్రానికి లేఖలు రాసినా అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రానికి పట్టకపోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.