పవన్‌కళ్యాణ్‌ని ‘గట్టిగా’ చూశారా.?

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పరాజయంతో పవన్‌కళ్యాణ్‌ ఆందోళన చెందాడు. అంతకు ముందు వరకు ఏ సినిమా రిజల్ట్‌నీ ఆయన అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే, వాటికి ఆయన నిర్మాత కాదు గనుక. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి తానే…

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పరాజయంతో పవన్‌కళ్యాణ్‌ ఆందోళన చెందాడు. అంతకు ముందు వరకు ఏ సినిమా రిజల్ట్‌నీ ఆయన అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే, వాటికి ఆయన నిర్మాత కాదు గనుక. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి తానే నిర్మాత గనుక, ఆ సినిమా ఫలితం తేడా కొట్టేయడంతో, 'మీరు గట్టిగా చూడలేదు.. నాకు డబ్బులు రాలేదు.. ఈ సారి గట్టిగా చూడండి..' అని మొన్నామధ్యన ఓ పొలిటికల్‌ మీటింగ్‌ సందర్భంగా 'సరదా' స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు పవన్‌కళ్యాణ్‌. సరదా స్టేట్‌మెంటే అయినా, దాని వెనకాల నిగూడార్థం చాలానే వుందని జనానికి కాస్త ఆలస్యంగా అర్థమయ్యింది. 

'కాటమరాయుడు' సినిమా వచ్చింది.. ఇక్కడా ఫలితం తేడా కొట్టేసింది. అభిమానులేమో, తమ అభిమాన హీరోని ఫాలో అయ్యారు. ఆయన మాటల్ని గుర్తు చేసుకున్నారు. 'ఏప్రిల్‌ 9వ తేదీన అభిమానులంతా ఖచ్చితంగా ఈ సినిమాని మరోమారు చూడాలి..' అంటూ ఒట్టేసుకున్నారు. మాటకు నిలబడి కొందరు చూశారు కూడా. అలా, పాపం 'కాటరమాయుడు'కి ఇంకొన్ని డబ్బులిచ్చినట్టున్నారు. ఇదెక్కడి ట్రెండ్‌.? అనడక్కండి.. అదంతే. 

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి అలా, 'కాటమరాయుడు'కి ఇలా, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాకి పవన్‌ నుంచి ఇంకెన్ని జిమ్మిక్కుల్ని ఆశించాలో ఏమో.! అఫ్‌కోర్స్‌, పవన్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై హైప్‌ అలా ఇలా లేదనుకోండి.. అది వేరే విషయం. హైప్‌దేముంది.. వస్తుంది, వెళుతుంది.. సినిమా ఫలితం తేల్చాలి కదా.! 'కాటమరాయుడు'ని అభిమానులు పవన్‌ చెప్పినట్లు 'గట్టి'గా చూడబట్టి ఫలితం ఇలా వుంది, ప్రతి సినిమానీ ఇలాగే 'గట్టిగా' చూడాలంటే ఎలా.? 

సినిమా చేశాడు, దేవుడి మీద భారం వేసేసి వదిలేశాడు. పవన్‌కళ్యాణ్‌ని ఇలా ఎప్పుడన్నా చూశామా.? దైవాధీనం బస్‌ సర్వీస్‌ అన్నట్టు, సినిమాల్లో పవన్‌ కొత్త ట్రెండ్‌కి తెరలేపాడు మరి. రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్‌ నుంచి వచ్చిన అత్యంత కీలకమైన మార్పు ఇది.