చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా తీయబోతున్నానని ప్రకటించి పరిశ్రమలో భారీ సెన్సేషన్ క్రియేట్ చేశారు ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి. ఈ మెగా మల్టీస్టారర్ కు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని కూడా ప్రకటించారు. దీంతో వరుసగా 2 రోజుల పాటు ఇదే న్యూస్ ట్రెండింగ్ అయింది. అంతే.. ఆ తర్వాత దీని గురించి అంతా మరిచిపోయారు.
ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మెగా మల్టీస్టారర్ పై చిరంజీవిని కొందరు వాకబు చేశారు. దానికి చిరు చూద్దాంలేం అన్నట్టు మాత్రమే స్పందించారు. ప్రస్తుతం చిరంజీవి తన 151వ సినిమాపై ఫోకస్ పెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి డైరక్షన్ లో సినిమా చేస్తారు. సో.. చిరంజీవి యాంగిల్ లో ఆలోచిస్తే కనీసం మరో ఏడాదిన్నర పాటు ఈ మల్టీస్టారర్ పై చర్చ అనవసరం.
అటు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పరిస్థితి కూడా దాదాపు అంతే. ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. తర్వాత నేసన్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. దాంతో పాటు వీలైతే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కూడా ఓ సినిమా చేసే ఆలోచనలో పవన్ ఉన్నాడు. ఇటు త్రివిక్రమ్ కూడా పవన్ తో సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్, మహేష్ తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
సో.. వీళ్లంతా ఇంత బిజీగా ఉంటే చిరు-పవన్ కాంబినేషన్ లో మెగా మల్టీస్టారర్ కు దారి దొరుకుతుందా చెప్పండి. ఇవన్నీ పక్కనపెడితే, అసలీ మల్టీస్టారర్ సినిమాకు త్రివిక్రమ్ ఇప్పటివరకు ఎలాంటి స్టోరీలైన్ అనుకోలేదు. అందరూ ఇంత లైట్ తీసుకున్నారు కాబట్టే, ఇప్పటికే అనుకున్న ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లా ఈ మెగా మల్టీస్టారర్ కూడా మెల్లమెల్లగా సైడైపోతోంది.