వికిలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజేపై పాశ్చాత్య దేశాలన్నీ పగబెట్టాయి. వింత కేసు ఏదో పెట్టిన స్వీడన్ అతన్ని ఎలాగైనా బందీ చేయాలని చూస్తోంది. లాటిన్ అమెరికాలోని ఈక్వడార్ దేశాన్ని పాలించే సోషలిస్టు అధ్యక్షుడు రాఫెల్ కారియా అతనికి లండన్‌లోని తమ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం కల్పించాడు. కారియా పదేళ్ల పాలన ముగిసి, ఎన్నికలు ప్రకటించారు. కారియా వద్ద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన లెనిన్ మొరెనో, రైటిస్టు భావాలు కల గిలిరెమో లాసో అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అనేక అంశాలతో బాటు అసాంజే అంశం కూడా ఎన్నికలలో చర్చకు వచ్చింది. తను నెగ్గితే అసాంజేను లండన్‌లోని తమ ఎంబసీ నుంచి తరిమివేస్తానన్నాడు లాసో. కొనసాగిస్తానన్నాడు మొరెనో. ఒకప్పుడు వామపక్షాల నాదరించిన లాటిన్ అమెరికాలో కమ్యూనిస్టు, సోషలిస్టు ప్రభుత్వాలు అవినీతి, అసమర్థతలలో మునిగి పోవడంతో, పైగా ఆర్థికమాంద్యం ఏర్పడడంతో విసిగిన ప్రజలు గత పదేళ్లగా వెనెజులా, పెరు, అర్జంటీనా, బొలీవియాలలో రైటిస్టు పార్టీలను గెలిపించసాగారు. బ్రెజిల్ అధ్యక్షురాలు సోషలిస్టు దిల్మాను అభిశంసించి దింపేశారు. ఈక్వడార్ కూడా ఆ దారి పడితే అసాంజే వీధిన పడాలి. అందువలన కోటీ అరవై లక్షల మంది ఓటర్లు పాల్గొనే ఈక్వడార్ ఎన్నికల ఫలితాలు అతనికి కీలకమయ్యాయి.
పోటీ పడిన యిద్దరు అభ్యర్థులలో మొరెనో కారియాకు అనుచరుడు. కారియా చాలా తీవ్రభావాలున్న సోషలిస్టు. అతనికి ముందు దేశాన్ని ఏలిన అధ్యక్షుడు జమీల్ మహువాద్ హయాంలో బ్యాంకింగ్ సంక్షోభం సంభవించింది. జమీల్ దేశాన్ని అమెరికన్ డాలర్ వైపు నడిపించి దేశపు కరెన్సీని నాశనం చేశాడు. దీని వలన 15 లక్షల మంది దేశాన్ని విడిచి వలస పోవలసి వచ్చింది. దేశం విదేశాలకు ఋణగ్రస్తురాలై పోయింది. ఆ దశలో అధికారానికి వచ్చిన కారియా ఈ విదేశీ అప్పును అనైతికంగా ప్రకటించి ఎగ్గొట్టేసినట్లు ప్రకటించాడు. ''సిటిజన్స్ రివల్యూషన్'' పేర ప్రభుత్వరంగానికి పెద్ద పీట వేశాడు. ప్రభుత్వధనాన్ని పేదల విద్య, గృహవసతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మళ్లించాడు. కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధంగా దేశాన్ని పేదరికం నుంచి బయటకు లాగాడు.
అయితే యీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో అవినీతి జరిగినట్లు కూడా ఆరోపణలున్నాయి. పెట్రోలు ధరలు తగ్గడంతో ఆర్థికంగా ఒత్తిడి పడసాగింది. కొన్ని కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. తనపై విమర్శలు వచ్చినపుడు కారియా తీవ్రంగా స్పందిస్తాడు. ఎత్తి చూపిన జర్నలిస్టులపై కేసులు పెడతాడు. అతని వద్ద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మొరెనో తన గురువు కారియాలా మొరటువాడు కాదు. సాత్వికుడు. సరదా మనిషి. 1990లో ఒక దోపిడీలో అతను గాయపడడం వలన చక్రాలకుర్చీలో తిరుగుతాడు. కారియా తలపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రధాన పాత్ర వహించాడు. తను ఎన్నికైతే కారియా విధానాలను ముందుకు తీసుకుని వెళతానని వాగ్దానం చేస్తున్నాడు.
అతనికి ప్రత్యర్థిగా నిలిచిన లాసో ఒక బ్యాంకర్. జమీల్ హయాంలో బ్యాంకింగ్ శాఖ చూశాడు. ఆనాటి బ్యాంకింగ్ సంక్షోభానికి కారకుడిగా అతన్ని విమర్శిస్తారు. 2013లో కారియాతో పోటీ పడి పెద్ద మార్జిన్‌తో ఓడిపోయాడు. ఇటీవల ఒక అర్జంటీనా పత్రిక అతను ఆ సంక్షోభ సమయంలో విపరీతంగా డబ్బు సంపాదించి విదేశాల్లో దాచుకున్నాడని ఆరోపించింది. లాసో ఆ ఆరోపణను తిరస్కరించాడు. అతనివి రైటిస్ఠు భావాలు. తను ఎన్నికైతే ప్రభుత్వరంగంలోని ఉద్యోగాలను, సంక్షేమ పథకాలను తగ్గించేస్తాను, అంతేకాదు వ్యాపారస్తులకు, ధనికులకు పన్నులు తగ్గిస్తాను అన్నాడు. అయినా అతనికీ ప్రజాదరణ లభించింది. ఫిబ్రవరిలో ఫస్ట్ రౌండ్ ఓటులో మొరెనోకు 39% రాగా లాసోకు 28% వచ్చాయి. మార్చి ఎగ్జిట్ పోల్స్‌లో యిద్దరు అభ్యర్థులకూ దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయి. నాదే గెలుపు అంటే నాదే గెలుపు అని యిద్దరూ చెప్పుకున్నారు. కానీ జిల్లాలలో కౌంటింగ్ జరిగాక నేషనల్ ఎలెక్టొరల్ కౌన్సిల్ '97% కౌంటింగ్ పూర్తయింది. ఇప్పటివరకు మొరెనోకు 51.12%, లాసోకు 48.88% ఓట్లు వచ్చాయి.' అని ప్రకటించింది. అంటే మొరెనో నెగ్గినట్లే అన్నమాట.
ఈ ఫలితాలను నేను ఒప్పుకోను అన్నాడు లాసో. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అతని అనుచరులు అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అవి అలా జరుగుతూండగానే మొరెనో విజయోత్సవం జరిపేసుకున్నాడు. దానిలో పాటలు పాడాడు కూడా. నిష్పక్షపాతానికి పేరుబడిన ఒక స్వతంత్ర సంస్థ ఎన్నికల వాచ్‌డాగ్‌గా పనిచేసి యిద్దరు అభ్యర్థుల మధ్య 0.6% ఓట్ల తేడా వుంది అంది. ఎవరికి ఎక్కువో మాత్రం చెప్పనంది. పెట్రోలు ధరలు తగ్గి ఆదాయం దెబ్బతిని, యీ ఏడాది ఆర్థిక వ్యవస్థ 2.7% కుంచించుకుపోతుందని అంచనాలున్న యీ తరుణంలో మొరెనో ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేర్చగలడో తెలియదు కానీ అసాంజే మాత్రం మహా ఖుషీగా వున్నాడు – అతను గూడు చెక్కు చెదరలేదు కాబట్టి! ఫలితాలు రాగానే ''లాసో ఈక్వడార్ను 30 రోజుల్లో వదిలి వెళ్లాలని కోరుతున్నాను. వెళ్లేటప్పుడు అతని విదేశీ నిధులను వెంటపెట్టుకుని వెళతాడో లేదో అతని యిష్టం.'' అని వెక్కిరిస్తూ ట్వీట్ చేశాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]