అనేకమంది రాజపుత్ర రాజులు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించినా మేవాడ్ రాజు రాణా ప్రతాప్ సింగ్ మాత్రం అంగీకరించక ఎదిరించాడని, మామూలు యుద్ధాల్లో ఓడిపోయినా అడవులకు పారిపోయి గెరిల్లా యుద్ధాలు చేసి అక్బరు సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడని, చివరకు తన రాజ్యంలో కొన్ని ప్రాంతాలను జయించినా రాజధాని చిత్తోర్‌గఢ్ జయించాలన్న కోరిక తీరకుండానే 1597లో ఒక ప్రమాదంలో మరణించాడని చరిత్రలో చదువుకున్నాము. అతను చేసిన యుద్ధాల్లో ఒకటి 1576 జూన్ 18న జరిగిన హల్దీఘాటీ యుద్ధం. ఇది నాలుగు గంటలపాటు సాగింది. ఎగుడుదిగుడు నేల కావడంతో మొఘల్ సైన్యాలు తమ ఆయుధాలను తేలేకపోయాయి. అశ్వదళాలు, గజసైన్యం, పదాతి దళాలతో సాంప్రదాయకమైన పద్ధతుల్లో యుద్ధం సాగింది. దీనిలో రాణా సైన్యాలు మొఘల్ సైన్యాలను కుడి నుంచి, ఎడమ నుంచి దాడి చేసుకుంటూ వచ్చి మధ్యలో వున్న దళాలపై ఒత్తిడి పెంచాయి. ఇంతలో అక్బరే యుద్ధభూమికి వస్తున్నాడనే పుకారు పుట్టడంతో రాణా సైన్యాలు భయంతో వెనుకంజ వేశాయి. రాణా యుద్ధభూమి వదలి వెళ్లిపోయాడు.
మొఘల్ సైన్యాలు గెలుపు సాధించాయి. ఇది జరిగిన మూడు రోజులకు అక్బరు సైన్యాలు గోగుండా కూడా జయించాయి. దీని తర్వాత నెల్లాళ్లకు అంటే జులైలో రాణా తను పోగొట్టుకున్న ప్రాంతంలో కొంత భాగాన్ని మళ్లీ గెలుచుకుని కుంభాల్గఢ్ను తన తాత్కాలిక రాజధానిగా చేసుకున్నాడు. శత్రువు బలపడుతున్నాడని గ్రహించిన అక్బర్ యీ సారి స్వయంగా యుద్ధరంగానికి వచ్చాడు. యుద్ధంలో ఓడిపోవడంతో రాణా కుంభాల్గఢ్తో సహా అన్ని ప్రాంతాలూ పోగొట్టుకుని మేవాడ్ దక్షిణ ప్రాంతంలో వున్న పర్వతాల వైపు పారిపోయాడు. 1579 తర్వాత బెంగాల్, బిహార్లలో తిరుగుబాట్లు తలెత్తడంతో అక్బర్ ఆరేళ్లపాటు అక్కడే దృష్టి పెట్టాడు. ఆ తర్వాత పంజాబ్‌లో తిరుగుబాటు రావడంతో 1585 నుంచి పన్నెండేళ్ల పాటు అటే వుండి మేవాడ్‌ను పట్టించుకోలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రాణా ప్రతాప్ కుంభాల్‌గఢ్, ఉదయపూర్, గోగుండా, రంతమ్బోర్ కోటలను గెలుచుకున్నాడు కానీ తన పూర్వరాజధాని చిత్తోర్‌గఢ్‌ను మాత్రం గెలవలేకపోయాడు. రాణా కథను మలుపు తిప్పిన హల్దీఘాటీ యుద్ధ చరిత్రను వేరే రకంగా చిత్రీకరిస్తూ వెలువడిన ఒక పుస్తకాన్ని రాజస్థాన్ యూనివర్శిటీ ఆమోదించింది. దాంతో యీనాటి రాజకీయాల కోసం చరిత్రను మార్చివేస్తున్నారని చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
''రాష్ట్ర రత్న మహారాణా ప్రతాప్'' అనే యీ పుస్తకాన్ని ఉదయపూర్‌లో మీరా కన్యా ప్రభుత్వ మహావిద్యాలయలో టీచరుగా పనిచేసే చంద్రశేఖర్ శర్మ అనే ఆయన రాయగా ఆర్యావర్త్ సంస్కృతి సంస్థాన్ అనే వారు 2007లో ప్రచురించారు. హల్దీఘాటీ యుద్ధం పొద్దుణ్నుంచి సాయంత్రం వరకు సాగిందని, దానిలో రాణా సైన్యాలు గెలిచాయని, హల్దీఘాటీ ప్రాంతపు రికార్డులు పరిశీలించి 1576 జూన్-జులై నెలల్లో రాణా ప్రతాప్ యిచ్చిన ఆదేశాల బట్టి, ఆ ప్రాంతాలు ఆయన అధీనంలో వున్నాయని తను కనుగొన్నట్లు ఆయన చెప్తున్నారు. బిజెపి ఎమ్మెల్యే మోహన్ లాల్ గుప్తా యిప్పటిదాకా హల్దీఘాటీ యుద్ధంలో రాణా ఓడిపోయినట్లు కాలేజీల్లో పాఠాలు చెప్తున్నారని, యీ పుస్తకాన్ని ప్రమాణంగా తీసుకుని వాటిని మార్పించాలని డిమాండ్ చేశారు. మరో ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు – వారిలో మాజీ ఉన్నత విద్యామంత్రి, ప్రస్తుత మధ్యమ విద్యామంత్రి, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వున్నారు – రాజస్థాన్ యూనివర్శిటీ హిస్టరీ డిపార్టుమెంటు తమ పాఠ్యాంశాన్ని మార్చాలని వంత పాడారు. వెంటనే యీ పుస్తకాన్ని అండర్గ్రాజువేట్ విద్యార్థులకు రిఫరెన్సు పుస్తకాల్లో ఒకదానిగా గుర్తిస్తూ యూనివర్శిటీ ఆదేశాలు జారీ చేసింది. చరిత్రకారులు యిది సరి కాదంటున్నారు. అక్బరు-రాణా ప్రతాప్ మధ్య పోరాటాన్ని ముస్లిం-హిందూ కలహంగా చిత్రీకరించి, హిందూ రాజైన రాణా ప్రతాప్‌ను గొప్పగా, విజేతగా చూపించడానికై చరిత్ర మార్చే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నామంటున్నారు. రాణా (రాజా) ప్రతాప్ పేరు కూడా యీ పుస్తకరచయిత మహారాణా (చక్రవర్తి)గా మార్చివేశారని ఎత్తి చూపుతున్నారు.
నిజానికి రాణా, అక్బర్‌ల మధ్య యుద్ధం యిద్దరు పాలకుల మధ్య యుద్ధం. రాణా ప్రతాప్ తండ్రి ఉదయ్ సింగ్ 1568లో అక్బర్ చేతిలో ఓడిపోయి చిత్తోర్‌గఢ్ వదలి ఉదయ్‌పూర్‌కు పారిపోయాడు. తండ్రి మరణం తర్వాత రాజైన ప్రతాప్ చిత్తోర్‌గఢ్ తిరిగి జయించాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. రాణా సైన్యంలోనూ, అక్బర్ సైన్యంలోనూ హిందువులూ వున్నారు, ముస్లిములూ వున్నారు. అక్బరు పక్షాన దాదాపు రాజపుత్రులందరూ వున్నారు. రాణా సైన్యాలపై దాడి నిర్వహించిన అక్బరు సేనాపతి మాన్సింగ్ రాజపుత్రుడే. ఇక రాణా సైన్యంలో అఫ్గన్ సైన్యం కూడా వుంది. అక్బర్ చేతిలో ఓడిపోయిన షెర్షా సూరీ వారసుడు ఇస్లామ్ ఖాన్ సూరీ అక్బరుపై కోపంతో రాణాతో చేతులు కలిపాడు. హల్దీఘాటీ యుద్ధంలో అతని అఫ్గన్ సైన్యం కూడా పాల్గొంది. ఆ యుద్ధంలో ఓటమి తర్వాత రాణా మేవాడ్ దక్షిణ ప్రాంతానికి పారిపోతే మేవాడ్‌కు చుట్టూ వున్న ఇడర్, సిరోహి, బాన్స్వాడా, డూంగర్పూర్ పాలకులైన రాజపుత్రులపై, జలోర్ పాలకుడైన అఫ్గన్ రాజుపై అక్బర్ ఒత్తిడి తెచ్చి తన ఆధిపత్యాన్ని ఆమోదింప చేసుకున్నాడు. బూందీ పాలకుడు సుర్జన్ హాడా, అతని చిన్న కొడుకు భోజ్ మొఘల్‌ల వైపు నిలవగా, అతని పెద్ద కొడుకు దూదా రాణా వైపు నిలిచాడు. చివరకు రాణా ఓడిపోయాడు.
యూరోప్‌లో మధ్యయుగాల్లో మత ప్రాతిపదికన క్రైస్తవుల మధ్య, ముస్లిముల మధ్య యుద్ధాలు జరిగాయి. ఇక్కడ కూడా అలాగే జరిగి వుంటాయనే భావనతో కొందరు యూరోప్ చరిత్రకారులు భారతదేశ చరిత్రను హిందూ యుగంగా, ముస్లిం యుగంగా విభజించి యీ యుద్ధాలను రెండు మతస్తుల మధ్య యుద్ధాలుగా చూపారు. కానీ యిక్కడ అటువంటి విభజన లేదు. శివాజీ విషయంలో కూడా ఔరంగజేబు తరఫున శివాజీపై యుద్ధం చేసినవారు హిందువులే. పురంధర్ యుద్ధంలో శివాజీని ఓడించినది జై సింగే. ఆగ్రా కోటలో ఔరంగజేబు ఆస్థానంలో శివాజీని వెక్కిరించినది జశ్వంత్ సింగ్ రాథోడ్. ఆగ్రాలో అతన్ని బంధించినది జై సింగ్ కొడుకు రామ్ సింగ్ హవేలీలోనే. అక్కణ్నుంచే శివాజీ పారిపోయాడు. శివాజీ సైన్యంలో చూడబోతే ముస్లిములు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు. ముల్లా హైదర్ ఆయన ఆంతరంగిక కార్యదర్శి. ఇబ్రహీం ఖాన్, దౌలత్‌ఖాన్, సిద్దీ మిశ్రీ ఆయన నౌకాదళ కమాండర్లు. శివాజీ రాజకీయంగా అవసరమైనప్పుడు ముస్లిములతో చేతులు కలిపాడు. కుతుబ్ షా సుల్తాన్‌తో పొత్తు కుదుర్చుకుని తన సవతి తమ్ముడైన వెంకోజీ భోంస్లేపై దండెత్తాడు. మొఘలులు, బహమనీ సుల్తానులు యిద్దరూ ముస్లిములే. అయినా నిరంతరం యుద్ధాలు చేస్తూనే వున్నారు. చరిత్రను చరిత్రగానే చూడాలి. ఇప్పుడు చంద్రశేఖర శర్మ కొత్త వివరాలను వెలుగులోకి తెస్తే వాటిని పరిశీలించి, అవసరమైతే చరిత్ర పుస్తకాలను మార్చాలి. రాణా ప్రతాప్ మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా యీ పునఃపరిశీలన జరగాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]