కమల్‌ చెప్పేది నమ్మేద్దామా.!

'విశ్వరూపం' సినిమా విషయంలో కమల్‌హాసన్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అఫ్‌కోర్స్‌ ఆ సినిమా రిలీజ్‌కి ఎదురైన ఇబ్బందులూ అన్నీ ఇన్నీ కావనుకోండి.. అది వేరే విషయం. కమల్‌హాసన్‌ అనుకున్నట్టుగా సినిమా విడుదలయి…

'విశ్వరూపం' సినిమా విషయంలో కమల్‌హాసన్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అఫ్‌కోర్స్‌ ఆ సినిమా రిలీజ్‌కి ఎదురైన ఇబ్బందులూ అన్నీ ఇన్నీ కావనుకోండి.. అది వేరే విషయం. కమల్‌హాసన్‌ అనుకున్నట్టుగా సినిమా విడుదలయి వుంటే, ఆ సినిమా ఆశించిన విజయం సాధించి వుంటే.. కాసుల పంట పండేదే. కానీ, డ్యామిట్‌.. కథ అడ్డం తిరిగేసింది. అయినాసరే, 'విశ్వరూపం' బాగానే దండుకుంది బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ళ పరంగా. 

భారీగా ఆశించేసి, ఓ మోస్తరుగా సరిపెట్టుకున్న కమల్‌హాసన్‌, ఇప్పుడు తీరిగ్గా ఆ సినిమా కారణంగా ఏర్పడ్డ నష్టాల గురించి ఏకరువు పెట్టాడు. ఏకంగా 60 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట 'విశ్వరూపం' సినిమా పుణ్యమా అని. ఆ సినిమా మీద అప్పట్లో జయలలిత కన్నెర్రజేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందట. ఇప్పుడు జయలలిత లేరు, కమల్‌ వ్యాఖ్యల్ని జయలలిత తరఫున ఖండించేంత తీరికా ఎవరికీ లేదు. కాబట్టి, కమల్‌హాసన్‌ చెప్పిందే నిజమనుకోవాలి. 

అన్నట్టు, 'విశ్వరూపం-2' సినిమా పనుల్లో బిజీగా వున్న కమల్‌, ఆ సినిమాపై సింపతీ కోసం 'విశ్వరూపం' నష్టాల్ని తెరపైకి తెచ్చాడనే వాదన ఒకటుంది. ఒక్కటి మాత్రం నిజం, 'విశ్వరూపం' సినిమా టైమ్‌లో కమల్‌ చాలా వివాదాలు ఎదుర్కొన్నాడు. ఒకానొక సందర్భంలో ఓ పౌరుడిగా తన భావప్రకటనా స్వేచ్ఛను కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయంటూ నానా రచ్చా చేశాడు. ఇంటిని అమ్మేసుకున్నానన్నాడు.. ఇంకేవేవో చేసేశాడు. ఇవన్నీ 'విశ్వరూపం' సినిమాకి ఎక్కడ లేని హైప్‌ని తీసుకొచ్చాయి. ఫలితంగా వసూళ్ళూ బాగానే వచ్చాయి. కానీ, కమల్‌ తనకు ఆ సినిమా నష్టాల్ని మిగిల్చిందంటున్నాడు. నమ్మేదెలా.?