ఒక్కోసారి ఈక్వేషన్లు మారుతుంటాయి. వారు వీరవుతుంటారు. వీరు వారవుతుంటారు. పవన్ కళ్యాణ్ విషయంలో వ్యవహారం అలాగే కనిపిస్తోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే, ఏంటీ వర్గాల వ్యతిరేక ప్రచారం కాస్త గట్టిగానే వుంటుంది. మెగా క్యాంప్ హీరోలు అంటే రాష్ట్రంలోని ఓ సామాజిక వర్గానికి అంతగా కిట్టదు. ఇది ఓపెన్ సీక్రెట్. పైగా ఆ వర్గానికి చెందిన హీరోలంటే మెగా ఫ్యాన్స్ కు కిట్టదు.
అందువల్ల వీళ్ల సినిమాలపై వాళ్లు, వాళ్ల సినిమాలపై వీళ్లు వ్యతిరేక ప్రచారం చేయడం అన్నది కామన్. కానీ ఫర్ ఏ ఛేంజ్, ఈసారి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు విషయంలో ఆ సామాజిక వర్గం కాస్త పాజిటివ్ దృక్పథంతో వుండడం విశేషం. దీనికి కారణం మరేమీ కాదు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి పెద్ద మద్దతు దారుగా వున్నారు. పైగా 2019లో ఆపార్టీని ఆయనే కాపు కాయాల్సి వుంది. అందువల్ల పవన చరిష్మాను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశానికి బలమైన మద్దతు ఇచ్చే సామాజిక వర్గంపై పడింది.
అందువల్ల ఆంధ్రలో మార్నింగ్ షో తరువాత ఇటు పవన్ ఫ్యాన్స్, అటు తెలుగుదేశం ఫ్యాన్స్ కలిసి ఒకటే టాక్ వెలువడడం విశేషం. అంతే కాదు, తెలుగుదేశం పార్టీకి అండగా వుంటుందని టాక్ వున్న మీడియా కూడా కాటమరాయుడు సినిమాను తమ భుజాల మీద మోసే ప్రయత్నం చేసింది. ఎవ్వరూ ఇవ్వనంత రేటింగ్ ఇవ్వడం, చానెల్ లో కథనాలు ప్రసారం చేయడం విశేషం.
ఇదిలా వుంటే పవన్ అంటే ఇటీవల సరిపడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైలంట్ అయ్యారు. సినిమాకు చాలా చోట్ల చిరు, బన్నీ ఫ్యాన్స్ దూరంగా వున్నారని వినికిడి. ఫలితం పూర్తిగా తేలేవరకు ఏమీ మాట్లాడకూడదని వారికి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.