మరోసారి కలుస్తున్నారు.. ఈసారి ఏం చేస్తారో..

హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం ఎంత కామనో… ఆ కాంబోపై అంచనాలు పెరగడం కూడా అంతే కామన్. ఈసారి కూడా అలాంటి కొన్ని హిట్ కాంబినేషన్లు కలుస్తున్నాయి. మరి పాత మేజిక్ రిపీట్ అవుతుందా…?…

హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడం ఎంత కామనో… ఆ కాంబోపై అంచనాలు పెరగడం కూడా అంతే కామన్. ఈసారి కూడా అలాంటి కొన్ని హిట్ కాంబినేషన్లు కలుస్తున్నాయి. మరి పాత మేజిక్ రిపీట్ అవుతుందా…? కొత్త చరిత్ర క్రియేట్ అవుతుందా..? టాలీవుడ్ అంతా ఇదే స్పెక్యులేషన్ నడుస్తోంది.

మహేష్-కొరటాల మరోసారి కలిశారు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారు. “భరత్ అనే నేను” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆటోమేటిగ్గా అందరి ఫోకస్ ఈ కాంబినేషన్ పై పడింది. అయితే ఇక్కడే ఓ పాడు సెంటిమెంట్ కూడా వచ్చిపడింది. మహేష్ సెకెండ్ ఛాన్స్ ఇచ్చిన ఏ దర్శకుడూ (పూరి జగన్నాధ్ తప్ప) అతడికి సక్సెస్ అందించలేకపోయాడు. ఇప్పుడు కొరటాల, ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను క్రాస్ చేస్తాడనే ఆశిద్దాం.

హిట్ కాంబో లిస్ట్ లో పవన్-త్రివిక్రమ్ కూడా ఉన్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. రామ్-కిషోర్ తిరుమలది కూడా హిట్ కాంబినేషనే. గతంలో వీళ్లిద్దరూ కలిసి నేను శైలజ సినిమా చేశారు. త్వరలోనే ఇంకో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు. రామ్ ది కూడా మహేష్ సెంటిమెంటే. కెరీర్ లో ఒకేఒక్కసారి దర్శకుడ్ని రిపీట్ చేశాడు. అలా డైరక్టర్ ను రిపీట్ చేస్తూ తీసిన హైపర్ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు కిషోర్ తిరుమలతోనైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

త్వరలోనే కృష్ణగాడి వీరప్రేమగాథ కాంబినేషన్ కూడా రిపీట్ కానుంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న నాని… హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  ప్రస్తుతం “నిన్ను కోరి” అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి సినిమా స్టార్టయ్యే ఛాన్స్ ఉంది. ఇలా కొంతమంది హీరోలు రిపీట్ కాంబినేషన్స్ పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.