మూడు పెద్ద బ్యానర్లు కలిశాయి. అవి కూడా అలాంటిలాంటి ప్రొడక్షన్ కంపెనీలు కావు. మగధీర, సరైనోడు లాంటి భారీ సినిమా తీసిన గీతాఆర్ట్స్, మిర్చి లాంటి సినిమా నిర్మించిన యూవీ క్రియేషన్స్ బ్యానర్, మరోవైపు తమిళ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న స్టుడియో గ్రీన్…. ఇలా 3 పెద్ద సంస్థలు కలిశాయి. వి-4 మూవీస్ పేరుతో ఓ కొత్త సంస్థను ఏర్పాటుచేశాయి. దిగ్గజాల్లాంటి మూడు బ్యానర్లు కలిస్తే ఏమౌతుంది… స్వతహాగానే భారీ బడ్జెట్ సినిమాలొస్తాయి. అంతా అలానే అనుకున్నారు. బాహుబలి రేంజ్ లో బడా బడా సినిమాలొస్తాయని, టాలీవుడ్ రేంజ్ ఇంకాస్త పెరుగుతుందని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్.
అల్లు అరవింద్, ప్రమోద్-వంశీ, జ్ఞానవేల్ రాజా లాంటి నిర్మాతలంతా కలిసి ఇప్పుడో చిన్న సినిమా ప్లాన్ చేశారు. ఆది హీరోగా ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశారు. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఆదితో సినిమా చేయడానికి ముగ్గురు పెద్ద నిర్మాతలు కలవాలా అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి చిన్న సినిమాలే చేయాలనుకుంటే ఇలా మూడు బ్యానర్లు కలవనక్కర్లేదు.
స్మాల్ బడ్జెట్ లో సినిమాలు నిర్మించేందుకు అల్లు అరవంద్ ఇప్పటికే గీతాఆర్ట్స్-2 ను ఏర్పాటుచేశారు. బన్నీ వాసు ఈ వ్యవహారాల్ని చూసుకుంటున్నాడు. అటు యూవీ క్రియేషన్స్ సంస్థ కూడా జీఎ-2 పిక్చర్స్ తో కలిసి భలేభలే మగాడివోయ్ లాంటి సినిమా నిర్మించింది. సో.. ఇప్పుడు వీళ్లిద్దరికీ జ్ఞానవేల్ రాజా తోడయ్యాడన్నమాట. ముగ్గురూ కలిసి తక్కువ బడ్జెట్ లో చిన్నచిన్న సినిమాలు నిర్మించబోతున్నారు.