బాలీవుడ్ నటి బిపాసాబసుపై ఫైర్ అవుతున్నారు… లండన్ కు చెందిన ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ నిర్వాహకులు. కొన్నాళ్ల కిందట ఆమె తమను తీవ్రంగా మోసం చేసిందని వారు ఆరోపిస్తున్నారు. బిపాసాను అంత తేలికగా వదలమని.. ఈ విషయంలో కడదాకా పోరాడతామని, తమ సొమ్ములను వెనక్కు రాబడతామని కూడా వారు అంటున్నారు.
ఆసక్తికరంగా ఉన్న ఈ వ్యవహారం కథాకమామిషును మీడియాకు వివరించారు మీడియా సంస్థ ప్రతినిధులు. కొన్నాళ్ల కిందట తాము లండన్ లో ఒక ఫ్యాషన్ షో నిర్వహించామని, ఇండో- పాక్ కు సంబంధించిన ఆ షోలో ర్యాంప్ వాక్ కు బిపాసాతో ఒప్పందం చేసుకున్నామన్నారు. షో కోసమే బిపాసాను తామే లండన్ కు తీసుకెళ్లామని, టికెట్లూ గట్రా తామే బుక్ చేశామని, అక్కడ హోటల్ లో అన్ని ఏర్పాట్లు చేశామని, దాని కోసం కూడా భారీగా ఖర్చుపెట్టామని.. తీరా, అసలు సమయం వచ్చాకా బిపాసా హ్యాండిచ్చిందని.. ఫ్యాషన్ షోకు హాజరుకాలేదని, దీంతో తమకు ఆర్థికంగా నష్టంతో పాటు రెప్యుటేషన్ కూడా దెబ్బతిందని ఈవెంట్ మేనేజర్లు మొత్తుకున్నారు.
తాము బిపాసాను లండన్ కు తీసుకెళ్తే.. తీరా అక్కడికి వెళ్లాకా.. ఆమె భర్తతో విహరించడానికి వెళ్లిందని, ఈ విధంగా తమ సొమ్ముతో ఆమె హనీమూన్ చేసుకుందని కూడా నిర్వాహకులు వ్యాఖ్యానించారు. దీనిపై తాము చట్టబద్ధంగా పోరాడతామని వారు అంటున్నారు.
ఈ ఆరోపణలపై బిపాసా టక్కున స్పందించింది. ఎవరో కొందరు తనకు నీతులు చెబుతున్నారని.. అయితే.. తను పదిహేనేళ్లు ఇలాంటి ఫీల్డులో ఉన్నానని.. ఎక్కడా, ఎవ్వరికీ ట్రబులివ్వలేదని, వర్క్ ఎథిక్స్ గురించి ఎవరో చెబితే నేర్చుకునే స్థితిలో లేనని బిపాసా వాదిస్తోంది. మరి ఎవరి వాదనలు వారికున్నాయి.. అసలు కథేంటో!