అదిగో ఇంటర్వూ అంటే ఇదిగో సెన్సేషన్ అన్నట్లు తయారైంది వ్యవహారం. ఎప్పుడో మరోవారం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీభార్య రేణుదేశాయ్ ఇంటర్వూ నెట్ లోకి రాబోతోంది అంటే, ఇప్పటి నుంచే ఊహాగానాలు ప్రారంభమైపోయాయి. పవన్ తో తన సంబంధాలు, అనుబంధాలు గురించి ఏం చెబుతుందా? అని. రేణుదేశాయ్ ఇంటర్వ్యూ అంటే ఆసక్తి కరమే. ఎందుకంటే ఆమె గత ఇంటర్వ్యూలు బాగానే ఆసక్తి రేకెత్తించాయి. అనేక రకాల భావోద్వేగాలు పండించి, పలికించి, రేణు బాగానే రక్తి కట్టించారు ఆ ఇంటర్వూలను. కాస్త కంటతడి కూడా పెట్టారు వాటిల్లో.
అయితే ఈ ఇంటర్వూలో అంతకు మించి ఆమె సెన్సేషన్ విషయాలు వెల్లడిస్తారని అనుకోవడానికి అంతగా ఆస్కారం లేదేమో? ఎందుకంటే పవన్ కు దూరమైనా, పూర్తిగా మొహాలు చూడనంత దూరానికి పోవాలని రేణు అనుకోవడం లేదన్న సంగతి అందిరికీ తెలిసిందే. పైగా సామాజిక సైట్లలోనే పవన్ ను ఎవరూ పల్లెత్తు మాట అన్నా ఆమె ఊరుకోరు. తనను టార్గెట్ చేసినా భరిస్తారేమో కానీ, పవన్ ను ఇప్పటికీ వెనకేసుకునే వస్తారు.
అదీకాక, ఇప్పుడు కాకున్నా కొన్నాళ్లకయినా కొడుకును తెలుగులో హీరో చేయాలన్నది రేణు ఆశ, ఆశయంగా వినికిడి. అలాంటపుడు పవన్ అండ, దండ ఆమెకు దండిగా అవసరం. అందువల్ల ఇఫ్పుడు అక్కర్లేని సంచలనాలకు పోయి, పవన్ కు కోపం తెప్పించే పని ఆమె ఎందుకు చేస్తారు? కావాలంటే ఇద్దరికీనో, లేదా తనకో మరి కాస్త ప్లస్ అయ్యే విధంగానే మాట్లాడతారు అనుకోవాలి.
పైగా రేణు మంచి తెలివైన, భావ వ్యక్తీకరణలో, భాష వినియోగంలో బాగా చతురత కలిగిన మహిళ. అందువల్ల ఆమె ఇంటర్వ్యూ ఆసక్తి కరంగా వుంటుందేమో కానీ, సంచలనాలు నమోదు కాకపోవచ్చు.