ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రితమే కథ ఓ కొలిక్కి వచ్చేసింది. అదే 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'. ఇది ఇప్పటి మాట కాదు, చాలాకాలం క్రిందటి మాట. చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా ఇది. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా మీద చాలా కసరత్తులే చేసేశారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానికి ముందే ఈ కథ తెరపైకొచ్చినా, రాజకీయాల్లోకి వెళ్ళాక, సినిమాల్ని చిరంజీవి పక్కన పెట్టేయడంతో ఆ కథ అలా అటకెక్కేసింది.
ఇదిగో, ఇప్పుడు మళ్ళీ 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' కథపై మళ్ళీ కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈసారి కసరత్తులు చేస్తున్నది సురేందర్‌రెడ్డి. రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి అతి త్వరలో 'అధికారిక ప్రకటన' రానుందనే ప్రచారం జరుగుతున్నా, అదెప్పుడన్నదానిపై క్లారిటీ లేదు.
మరోపక్క, 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాపై చిరంజీవిలో అనుమానాలింకా అలానే వున్నాయట. చారిత్రక కథాంశం కావడంతో, దాని చుట్టూ కమర్షియల్ హంగులు అద్దడం ఎలా.? అన్నది చిరంజీవి టెన్షన్. 'ఖైదీ నెంబర్ 150' సినిమా విషయంలోనే చిరంజీవి కిందా మీదా పడాల్సి వచ్చింది. నానా రకాల కసరత్తులూ చేసి, చివరికి చిరంజీవి తాను అనుకున్నట్లుగా ఆ సినిమాని 'షేప్' చేయగలిగారు. ‘ఉయ్యాలవాడ’ మేటర్ చాలా ప్రత్యేకం. కమర్షియల్ హంగుల పేరుతో కెలికితే, వ్యవహారం చెడిపోతుంది. కాబట్టి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిందే. మరి, 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'కి సంబంధించి చిరు – సూరి వర్కవుట్స్ ఎలా మెటీరియలైజ్ అవుతాయో వేచి చూడాల్సిందే.