ఎన్టీఆర్ బయోపిక్ పై కాస్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమా తెరకు ఎక్కుతుందా? ఎక్కదా? అన్న సంగతి పక్కన పెడితే, స్క్రిప్ట్ లైన్ మాత్రం రెడీ అని తెలుస్తోంది. సిసిఎల్ నిర్వహించే విష్ణు నిర్మాతగా వుంటారని వినికిడి. ప్రస్థానం లాంటి మంచి సినిమాలు నిర్మించిన దేవాకట్టా దర్శకుడిగా వుండే అవకాశం వుందంటున్నారు.
నిమ్మకూరులో పాలు ఇంటింటికి అందించే పని నుంచి ప్రారంభించి చెన్నయ్ చేరి, టాలీవుడ్ అగ్ర హీరోగా ఎదిగి, పార్టీ పెట్టి, కాంగ్రెస్ ను రాష్ట్రంలో, కేంద్రంలో గద్దె దించి, ఢిల్లీలో తెలుగువాడి సత్తా చాటడంతో ఎన్టీఆర్ బయోపిక్ ముగుస్తుంది.
అక్కడితోటే ఆపడం వల్ల చాలా సమస్యలు అధిగమించవచ్చని ఇలా డిసైడ్ అయ్యారు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం, నాదెండ్ల వ్యవహారం, లక్ష్మీ పార్వతి, ఆగస్టు సంక్షోభం ఇవన్నీ తప్పుతాయి. అయితే అసలు బయోపిక్ తెరకు ఎక్కకపోవచ్చనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ స్క్రిప్ట్ విషయంలో దేవా కట్టా చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.