కాదేదీ అనర్హం ఫ్యాన్స్ యుద్దానికి అన్నట్లు తయారైంది. సోషల్ మీడియా ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంటే, ఫ్యాన్స్ యుద్దాలు ఆయా రంగాలకు స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. వెబ్ సైట్లలో అయిటమ్ ల కింద అభిప్రాయాల వెల్లడి ఇచ్చిన అవకాశంలో, కామెంట్ ల రూపంలో కొట్టుకోవడం, అలాగే యూ ట్యూబ్ లైవ్ లు వస్తుంటే వాదించుకోవడం, వాట్సప్ లో డిజైన్స్ తయారు చేసి షేర్ చేయడం, ఫేస్ బుక్ లో వాదనలు ఇలా ప్రతి ఒక్కటీ అవకాశమే.
యూ ట్యూబ్ లో టీజర్లకు, ఫస్ట్ లుక్ లకు ఎన్ని హిట్ లు వచ్చాయన్నది కూడా రికార్డుగా మారిపోయింది. సినిమా ఎన్ని రోజులు ఆడింది అన్న టైపు రికార్డులు ఎలా లెక్క పెట్టుకునేవారో, ఇప్పుడు ఈ యూ ట్యూబ్ హిట్ లు అది కూడా 24 గంటల్లో ఎంత, టోటల్ గా ఎంత ఇలా లెక్కలు.
ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. టీజర్ కు లైకులెన్ని, డిస్ లైకులు ఎన్ని? కామెంట్ లు ఎన్ని? అని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వుండడం, ఇటీవల జియో కనెక్షన్ తో నెట్ ఫ్రీ కావడంతో యూ ట్యూబ్ ను భయంకరంగా వాడేస్తున్నారు. దాంతో టీజర్లకు ఊ..అంటే మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయి. కానీ అక్కడితో ఆగడం లేదు. నచ్చని హీరోల టీజర్లకు డిస్ లైక్ లు, నచ్చిన వాటికి లైకులు కొట్టడం ప్రారంభమైంది. ఆరంభంలో ఇది సీరియస్ గా తీసుకోలేదు కానీ, డిజె టీజర్ విషయంలో ఇప్పుడు ఇదో లెక్కగా ప్రారంభమైంది.
డిజెకు ఇప్పుటికి 70 వేల వరకు డిజ్ లైక్ లు, 85 వేల వరకు లైక్ లు వచ్చాయి. నాలుగు లక్షలకు పైగా కామెంట్లు..33 లక్షలకు పైగా వ్యూస్.
ఏమిటీ లెక్కలు. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అని కాదు. టోటల్ గా యూ ట్యూబ్ లో సినిమా ఫ్యాన్స్ ఎలా చెలరేగిపోతున్నారనడానికి ఈ ఫిగర్స్ ఓ సాక్ష్యం. వ్యూస్ సరే, పనిలో పనిగా లైక్స్, డిజ్ లైక్స్ సరే, నాలుగు లక్షల కామెంట్ లా? జనం ఎంత లీజర్ గా వున్నారో దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఇప్పుడు ఇక ఇది ఓ ప్రామాణికంగా తీసుకుంటారు. తరువాతి హీరోల సినిమాలకు కూడా లైక్ లు, డిజ్ లైక్ లు, కామెంట్లు లెక్క పెట్టడం ప్రారంభిస్తారు. మొత్తానికి ఈ అభిమాని ఆ అభిమాని అని కాదు..సినిమా అభిమానులు 'నెట్'లో చిక్కుకున్నారు.