అనేక ప్రేమకథల్లో రెండు జమీందారీ కుటుంబాలుంటాయి. వాళ్ల మధ్య తరతరాలుగా వైరం వుంటుంది – ఒకరింటి మీది కాకి మరో యింటిపై వాలకూడనంత! అయితే ఎలా కుదిరిందో కానీ ఆ కుటుంబాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ కుదిరింది. పెద్ద తరం వాళ్లు ఠఠ్ కుదరదంటారు. తమ ప్రేమ నిజమైనదని నిరూపించుకుని వాళ్లను ఎలాగైనా ఒప్పిద్దామని ప్రేమికులు తంటాలు పడుతూ వుంటారు. కానీ మధ్యలో ఒక విలన్ వుంటాడు, రెండు కుటుంబాల మధ్య ద్వేషాగ్ని ఆరకుండా చూస్తూ వుంటాడు. అలాటి కథ యిప్పుడు నడుస్తోంది.
విపులంగా చెప్పబోయే ముందు విలన్ పరిచయం. మన దేశంలో ప్రధాని వెనుక కొందరు సలహాదారులుండి దేశాన్ని పరోక్షంగా పాలిస్తూ వుంటే వాళ్లని కోటరీ అంటూ వుంటారు. ఇందిర హయాంలో కిచెన్ కాబినెట్ అనేవారు. వీళ్లు కొందరు వ్యక్తుల సమూహం. అదే కనక కొన్ని శక్తుల సమూహం ప్రభుత్వవిధానాలను శాసిస్తూ వుంటే దాన్ని డీప్ స్టేట్‌గా వ్యవహరిస్తున్నారు. అంటే యిది ప్రభుత్వంలో అంతర్గతంగా వుండే అసలైన అధికారపీఠం అన్నమాట. బయటకు కనబడకుండానే తమకు కావలసిన విధంగా వ్యవహారాలు నడపగల సత్తా వున్న కూటమి అన్నమాట. అమెరికాకు సంబంధించి యీ డీప్ స్టేట్‌లో మిలటరీ ఆయుధాలు తయారుచేసే పరిశ్రమల వర్గం, దేశ గూఢచారి వ్యవస్థ, విధానాలు నిర్ణయించే అధికారగణం, వాల్ స్ట్రీట్ వున్నాయంటారు. మరి కొందరు పరిశీలకులు ఆయిలు కంపెనీలను, సిలికాన్ వ్యాలీ దిగ్గజాలను కూడా చేరుస్తున్నారు. అమెరికన్ మీడియా యీ పదాన్ని తరచుగా వుపయోగిస్తోంది కాబట్టి మనమూ వాడదాం.
రష్యా కమ్యూనిస్టు దేశంగా ఆవిర్భవించిన దగ్గర్నుంచి అమెరికా, రష్యాల మధ్య అగ్గి రగులుతూనే వుంది. ఆధిపత్యం కోసం రెండు దేశాలూ పోటీ పడి ప్రపంచాన్ని యుద్ధరంగంగా మార్చాయి. కొన్ని దేశాలు అమెరికాకు సన్నిహితంగా వుంటే, మరి కొన్ని దేశాలు రష్యాకు అనుకూలంగా వుండేవి. రెండు అగ్రదేశాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొన్ని దశాబ్దాల పాటు సాగింది.
రష్యాకు బలమైన గూఢచారి వ్యవస్థ వుండేది. వారి సామ్యవాద సిద్ధాంతాలు సామ్రాజ్యవాద దేశాలలోని గూఢచారులను కూడా ఆకర్షించేవి. దాంతో వాళ్లు డబుల్ ఏజంట్లుగా పనిచేస్తూ రష్యాకు రహస్య సమాచారం అందచేసేవారు. రష్యను గూఢచారులు వివిధ దేశాల్లో తీగల్లా అల్లుకుపోతూ తమ వలను విస్తరింపచేసేవారు. ఇదంతా వినడానికి చాలా ఉత్తేజదాయకంగా వుండేది. అందువలన అమెరికా మాత్రమే కాదు, యూరోప్ దేశాలన్నిటిలో రష్యాను విలన్‌గా చూపుతూ అనేక గూఢచారి రచనలు, సినిమాలు వెలువడ్డాయి. పొలిటికల్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు అన్నిటిలోను రష్యన్లే విలన్లు. ఇలా కొన్ని తరాల పాటు నడిచింది. అయితే 1991లో రష్యా కుప్పకూలింది. రష్యన్ విలన్ మరీ అంత భయంకరంగా అనిపించడం మానేశాడు. కానీ సాధారణ అమెరికన్లకు, యూరోపియన్లకు రష్యా అంటే అసహ్యం పోలేదు. పూర్తిగా పతనమై పోయిన రష్యా సమాఖ్య నుంచి పోయిన దేశాలు పోగా, వున్న వాటితో పుతిన్ కాస్త కాస్త పుంజుకుంటున్నాడు. ప్రపంచ వ్యవహారాల్లో తగుపాటి స్థాయిలో కలగచేసుకుంటున్నాడు. అందువలన మళ్లీ రష్యా అంటే అమెరికాలో అపనమ్మకం పెరగసాగింది.
ఇక చైనా గురించి చెప్పాలంటే – రష్యా సహాయంతో చైనా కమ్యూనిస్టు రాజ్యంగా మారింది. అయితే స్టాలిన్ అనంతరం పోనుపోను మావోకు, రష్యన్ నాయకులకు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రపంచంలో రష్యన్ బ్రాండ్ కమ్యూనిజానికి ప్రతిగా చైనీస్ బ్రాండ్ కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయసాగింది. ఈ వరస చూసి 1970లలో నిక్సన్ వాళ్లిద్దరినీ విడగొట్టడానికి చైనాకు స్నేహహస్తం చాపాడు. అమెరికా, చైనా దోస్తీ పెరుగుతూ పోయిన కొద్దీ చైనా ఆర్థికంగా బలపడసాగింది. ఆసియాలోనే బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా అవతరించింది. గత కొద్దికాలంగా అమెరికా మార్కెట్‌ను, ఉద్యోగాలను, వ్యాపారాలను శాసించే స్థితికి చేరింది. అమెరికా మార్కెట్లో ఎక్కడ చూసినా చైనా సరుకులే. దాంతో అమెరికన్ ఫ్యాక్టరీలలో యంత్రాలు తుప్పుపట్టిపోయాయి. విద్యతో సహా అనేక వ్యాపారాలు చైనీయుల చేతుల్లోనే వున్నాయి. అయినా అమెరికా పాలకులు మేలుకోలేదు. చైనాను మచ్చిక చేసుకుంటూ, రష్యాతో వైరం కొనసాగిస్తూనే వున్నారు. అమెరికాలో మీడియా కానీ, డీప్ స్టేట్ కానీ, ప్రజల్లో చాలామంది కానీ దీన్నే ఆమోదిస్తున్నారు.
అయితే ట్రంప్ భిన్నంగా ఆలోచించాడు. చైనాతో స్నేహం వలన అమెరికా కోల్పోతున్నది ఎక్కువని గ్రహించాడు. మేక్ ఇన్ అమెరికా బలపడాలంటే చైనా వస్తువులు అమెరికాకు రాకుండా నియంత్రించాలని, అప్పుడే అమెరికన్ పరిశ్రమలు వర్ధిల్లుతాయని, అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయని లెక్క వేశాడు. చైనా తన ఆర్థిక, సాంకేతిక శక్తితో ఆసియాలో తన పక్కనున్న దేశాలను శాసిస్తూ, నియంత్రిస్తూ పెద్ద రాజకీయ శక్తిగా తయారవుతోందని, ఒకప్పటి జపాన్ స్థానాన్ని చేరడానికి ఎంతో కాలం పట్టదని అర్థం చేసుకున్నాడు. అది కనక రష్యాతో చేతులు కలిపితే తమకు గడ్డు పరిస్థితనుకున్నాడు. ఎందుకంటే చైనాకు దక్షిణంగా వున్న అనేక దేశాల్లో అమెరికాకు మిలటరీ స్థావరాలున్నాయి. రష్యాకు, చైనాకు యిటీవలి కాలంలో కొన్ని విషయాల్లో సఖ్యత కుదురుతోంది. వాణిజ్యరంగంలో, ఐక్యరాజ్య సమితిలో గొంతు కలపడంలో స్నేహం చిగిరిస్తోంది.
చైనా జోరుకి కళ్లెం వేయాలంటే దానికి పొరుగున వున్న రష్యాను దువ్వి యిద్దరి మధ్య దూరం పెంచాలి. ప్రస్తుతం అమెరికా, రష్యా మధ్య తగవుల వలన ఆ రెండు దేశాల మధ్య సిరియా, టర్కీ వంటి అనేక దేశాలు నలుగుతున్నాయి, అవి బలహీనపడడంతో తాలిబన్, ఐసిస్ వంటి ఇస్లాం ఉగ్రవాద శక్తులు బలపడుతున్నాయి. నిజానికి రష్యా అప్పటి రష్యా కాదు. అందువలన ప్రధాన శత్రువు పోస్టులో రష్యాను తీసేసి చైనాను కూర్చోబెడితే మంచిదనుకున్నాడు ట్రంప్.
రష్యాను మచ్చిక చేసే ప్రయత్నాలు తన ప్రచార సమయంలోనే మొదలుపెట్టాడు. అమెరికా ప్రధానంగా క్రైస్తవ-యూదు సమాజం. రష్యాలో క్రైస్తవ ఆర్థోడాక్స్ చర్చ్ బలంగా వుండేది. కమ్యూనిజం వర్ధిల్లిన రోజుల్లో చప్పబడినా ఆ తర్వాత పుంజుకుంది. 'మనం-మనం క్రైస్తవులం, మనం కలహించుకోవడం వలన మధ్యలో ఇస్లామిక్ జిహాదిజం బలపడుతోంది' అనే ధోరణిలో ట్రంప్ తన టెర్రరిజం వ్యతిరేకతకు మతం రంగు పులిమాడు. పుతిన్‌ను మెచ్చుకోసాగాడు. పుతిన్ కూడా హిల్లరీపై ద్వేషంతో ట్రంప్ గెలుపుకు తన వంతు సాయం చేశాడు. హిల్లరీ తాలూకు ఈ మెయిళ్లు సరైన సమయంలో బయటపెట్టి ఆమెపై ప్రజల విశ్వసనీయతకు దెబ్బ కొట్టాడు. అధ్యక్ష పదవిని చేపడుతూనే ట్రంప్ రష్యాను మెప్పించి, వారితో చేతులు కలిపి టెర్రరిజం వ్యాప్తిని నిరోధించడానికి సర్వసన్నాహాలు చేసుకోసాగాడు. రష్యాకు అనుకూలురైన వారిని తన సలహాదారులుగా వేసుకున్నాడు.
ఈ పేరడైమ్ షిఫ్ట్ (మౌలిక సిద్ధాంత పరివర్తన) డీప్ స్టేట్‌కు నచ్చలేదు. వారు యథాతథ స్థితి కొనసాగాలనే చూస్తున్నారు. రష్యాతో చెలిమి వలన లాభాలుంటాయని వారు నమ్మటం లేదు. వారిలో డెమోక్రాటిక్ పార్టీ అభిమానులు ఎక్కువ. రష్యా బయటపెట్టిన ఈ మెయిళ్ల కారణంగానే తాము ఓడిపోయామని వాళ్లకు ఉక్రోషం. తమ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే స్థాయికి రష్యా చేరడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
నిజానికి 2009లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఒబామా రష్యాను కట్టడి చేద్దామని చూస్తూనే వున్నాడు. కానీ యీ ఎనిమిదేళ్లలో రష్యా మరింత బలపడింది. దాని ప్రభావం తూర్పు యూరోప్, మధ్య ఆసియా నుండి విస్తరించి, సిరియా, ఇరాన్, అఫ్గనిస్తాన్‌లకు చేరుకుంది. ఇవన్నీ అమెరికాకు ముఖ్యమైనవే. సిరియాలో ఐసిస్‌ను తుదముట్టించాలి, ఇరాన్‌ను నియంత్రించాలి, అఫ్గనిస్తాన్‌లో పదిహేనేళ్లగా సాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలి. ఇవి చేయాలంటే రష్యాతో కలిసి అడుగులు వేయాలి. అంటే కాస్త దిగి వచ్చి రాజీ పడాలి. ఇది డీప్ స్టేట్‌కు సుతరామూ యిష్టం లేదు. ట్రంప్ రష్యా వైపుకి మొగ్గకుండా శతవిధాల చూస్తున్నారు.
నవంబరు 8 న ఫలితాలు వెలువడినంతనే అమెరికన్ మీడియాలో అమెరికన్ ఎన్నికలలో రష్యా పాత్ర గురించి కథనాలు వచ్చాయి. రష్యన్ హేకర్లు హిల్లరీకి వ్యతిరేకంగా ఉపయోగపడే ఈమెయిళ్లను హ్యేక్ చేసి వికీలీక్స్‌కి యిచ్చి ఆమె ఓటమికి దోహదపడ్డారని సిఐఏకు ఆధారాలు దొరికాయని వారు రాశారు. పదవీకాలం దాదాపు ముగిసి, యింటికి వెళ్లిపోవలసిన ఒబామా ఇంటెలిజెన్సు రిపోర్టులను ఆధారం చేసుకుని డిసెంబరు 29న రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించాడు. 35 మంది రష్యన్ డిప్లోమాట్స్‌ను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ తర్వాత ఇంటెలిజెన్సు అధికారులు ఒక లీక్ వదిలారు – ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం రష్యా వద్ద వుందని, దాని ఆధారంగా అది ట్రంప్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని! మీడియా దానికి విపరీతమైన ప్రచారం కల్పించింది. ఆ తర్వాత డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేసిన స్ట్రోబ్ టాల్బోట్, సిఐఏకు తాత్కాలిక డైరక్టరుగా పనిచేసిన మైకేల్ మోరెల్ ట్రంప్ క్రెమ్లిన్‌కు తొత్తు (స్టూజ్) అని, పుతిన్ చేత నియమించినబడిన వాడని ఆరోపించారు.
ఈ ఆరోపణల మధ్యే ట్రంప్ అధికారపీఠం ఆరోహించాడు. అతను సీటులో కుదురుకోకుండానే అతను అధ్యక్షపదవికి తగడని, మేం అతన్ని అధినేతగా ఒప్పుకోమని అంటూ ప్రజాస్వామ్యం పేరులోనే గల డెమోక్రాటిక్ పార్టీ దేశమంతా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. మీడియా కూడా దానికి వత్తాసు పలికింది. ఆన్‌లైన్ సర్వేలు నిర్వహిస్తూ అధికాంశం ప్రజలు ట్రంప్‌ను, అతని విధానాలను అసహ్యించుకుంటున్నారని ప్రచారం చేస్తూ వచ్చింది. తన ప్రమాణస్వీకారానికి వచ్చిన జనాల సంఖ్యను తక్కువ చేసి చూపడం దగ్గర్నుంచి అన్ని రకాలుగా మీడియా తప్పుడు రిపోర్టులు యిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ మీడియాతో తగవులాడుతున్నాడు. ఇది యిలా సాగుతూండగానే డీప్ స్టేట్ ట్రంప్ కవచంలో బీటల కోసం వెతికింది. ఒకటి దొరికింది.
అతని పేరు మైక్ (మైకేల్) ఫ్లిన్. మిలటరీలో పనిచేశాడు. చాలాకాలం డెమోక్రాట్‌గా వున్నాడు. ఒబామా హయాంలో డిఫెన్స్ ఇంటెలిజెన్సు ఏజన్సీకి డైరక్టరుగా వున్నాడు. అయితే అతను చెప్పిన మాట వినేరకం కాదని 2014 లో ఒబామా తీసేశాడు. ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడిన దగ్గర్నుంచి అతనికి మద్దతు యిస్తూ వచ్చాడు. తన ఎన్నిక ఫలితం తెలిశాక ట్రంప్ అతనికి నేషనల్ సెక్యూరిటీ ఎడ్వయిజర్‌గా పదవి యిచ్చాడు. అతను ట్రంప్‌తో బాటు 2017 జనవరి 20న పదవిలోకి వచ్చాడు. ఈ మధ్యకాలంలో అతను ఆస్ట్రియాలో ఒకప్పటి నాజీలు స్థాపించిన ఫార్-రైట్ పార్టీ ఐన ఫ్రీడమ్ పార్టీ నాయకుడు హెంజ్ స్ట్రాష్‌ను కలిశాడు. ఈ స్ట్రాష్ పుతిన్ యొక్క యునైటెడ్ రష్యా పార్టీతో యిటీవల ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫ్లిన్ సమావేశానికి రష్యా కనక్షన్ వుందా అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తారు కానీ ట్రంప్ క్యాంప్ ఏ వ్యాఖ్యానమూ చేయలేదు. ఇంతలో ఫ్లిన్ డిసెంబరు 29న ఒబామా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన రోజున రష్యన్ రాయబారి సెర్జీ కిస్లాయక్‌తో చాలా సార్లు ఫోన్‌లో మాట్లాడాడని డీప్ స్టేట్ లీక్ చేసింది. డేవిడ్ ఇగ్నాషియస్ అనే జర్నలిస్టు ఆ కథనాన్ని జనవరి 12 న ప్రచురించాడు. రాబోయే ప్రభుత్వం మాదే కాబట్టి ఆంక్షలు ఎత్తివేస్తామనో, మరోటో ట్రంప్ తరఫున బేరం కుదుర్చుకుని వుంటాడని వూహించాడతను. మర్నాడే ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా నియమితుడైన సియాన్ స్పైసర్ 'ఫ్లిన్ మాట్లాడినది డిసెంబరు 28న, అందుచేత ఆంక్షల ప్రస్తావనే వచ్చి వుండదు' అని వాదించబోయాడు కానీ మాట్లాడినది డిసెంబరు 29నే అని తేలడంతో వూరుకున్నాడు.
విషయం అక్కడితో ఆగలేదు. జనవరి 20 న ఫ్లిన్ పదవిలోకి వచ్చాక రెండు రోజులకు వాషింగ్టన్ పోస్టు జర్నల్ ఫ్లిన్‌పై యుఎస్ కౌంటర్ యింటెలిజెన్సు విభాగం నిఘా వేసిందని రిపోర్టు చేసింది. ఫిబ్రవరి 8 న ఫ్లిన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ 'పదవిలో నియమించబడ్డాక, పదవి చేపట్టేముందు నేను 30 దేశాల రాయబార్లతో మాట్లాడాను, దానిలో వింతేముంది?' అంటూ కొట్టి పారేశాడు. 'అలాక్కాదు, ఆ సంభాషణల్లో ఒబామా విధించిన ఆంక్షల గురించి మాట్లాడాడు' అని మరో లీక్ వచ్చింది. నిజమా? అని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అడిగితే ఫ్లిన్ కాదు అని జవాబిచ్చాడు. పెన్స్ అదే విషయాన్ని ఫిబ్రవరి 12 న టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అయితే ఇంటెలిజెన్సు వర్గాలు రష్యన్ రాయబారి ఫోన్‌ను ట్యాప్ చేసి దానిపై జరిగిన సంభాషణలను రికార్డు చేసి వున్నాయి. 'ఫ్లిన్ రష్యన్ రాయబారితో ఆంక్షల గురించి మాట్లాడాడు, కావలిస్తే రుజువు యిదిగో' అంటూ ఆ టేపును లీక్ చేశాయి. ఇక దానితో ఫ్లిన్‌కు పచ్చి వెలక్కాయ గొంతులో పడింది. ''నేనేం మాట్లాడానో నాకు గుర్తు లేదు. అతను ఆంక్షల విషయం ప్రస్తావించలేదని గట్టిగా చెప్పలేను'' అన్నాడు.
అమెరికాలో 18 వ శతాబ్దం నాటి లోగాన్ చట్టం ప్రకారం ఒక సాధారణ పౌరుడు అమెరికాతో వైరం సాగుతున్న దేశాల ప్రతినిథులతో యిలాటి చర్చలు జరపడం నేరం. ఫ్లిన్ డిసెంబరు 29 నాటికి పదవి చేపట్టలేదు కాబట్టి సాధారణ పౌరుడు. అందువలన అతను నేరం చేసినట్లే. ఎఫ్‌బిఐ విచారణకు తోడు ద న్యూయార్క్ టైమ్స్ యిద్దరు డిఫెన్సు అధికారులు చెప్పారంటూ ఒక కథనాన్ని వేసింది. దాని ప్రకారం ఫ్లిన్ 2015లో మాస్కో వెళ్లినపుడు అక్కడ ప్రసంగం యిచ్చినందుకు రష్యన్ ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకున్నాడన్న ఆరోపణపై అమెరికన్ ఆర్మీ విచారణ జరుపుతోంది. తన రష్యా పర్యటన గురించి ఫ్లిన్ ఎక్కడా రికార్డు చేయలేదట. రష్యా టుడే టీవీ ఛానెల్ 2015లో డిన్నర్ యిచ్చినపుడు అక్కడికి పుతిన్ విశిష్ట అతిథిగా వచ్చాడు. ఆ డిన్నరుకు ఫ్లిన్ వెళ్లాడు. ఇక యివన్నీ చర్చకు రావడంతో ఫ్లిన్ ఫిబ్రవరి 13 న రాజీనామా చేశాడు.
''అనేక సంఘటనలు వరుసగా జరుగుతూండడంతో, పనుల ఒత్తిడిలో పడి దేశ ఉపాధ్యక్షుడికి అరకొర సమాచారం యిచ్చాను. దానికై అధ్యక్షుడికి, ఉపాధ్యక్షుడికి క్షమాపణ చెప్పాను. వారు అంగీకరించారు.'' అని చెప్పుకున్నాడు. నేషనల్ సెక్యూరిటీ ఎడ్వయిజర్ పదవి పెట్టి ఆరు దశాబ్దాలైంది. ఆ పదవిలో కేవలం 24 రోజులు మాత్రమే పనిచేసిన రికార్డు ఫ్లిన్‌దే!
వాషింగ్టన్ పోస్టు ప్రకారం ఎటార్నీ జనరల్‌గా కొంతకాలం వున్న శాలీ ఏట్స్ 'ఫ్లిన్ తన రష్యా సంబంధాల గురించి మీ దగ్గర దాస్తున్నాడని, అతన్ని రష్యా బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం వుంద'ని జనవరి నెలాఖరులో ట్రంప్ ఆఫీసుని హెచ్చరించిందట. అయితే ఏడు ముస్లిము దేశాలనుంచి యాత్రికుల విషయంలో తనతో విభేదించినందుకు ట్రంప్ ఆమెను పదవినుంచి తొలగించడంతో యీ విషయం మరుగున పడి వుండవచ్చు. నేషనల్ పబ్లిక్ రేడియో రిపోర్టు ప్రకారం ఫ్లిన్ ఆంక్షల గురించి మాట్లాడాడు కానీ వాటిని ఎత్తివేస్తామని వాగ్దానం ఏమీ చేయలేదట. మేం అధికారంలోకి వచ్చాక దాని సంగతి చూస్తాం అని మాత్రం అన్నాడట. దానిలో ఆశాభావం కనబడిందేమో పుతిన్ ప్రతిచర్య చేపట్టలేదు. ఒబామా 35 మంది రష్యన్ దౌత్యాధికారులను బహిష్కరించినపుడు రివాజుగా రష్యా కూడా తమ దేశం నుంచి అమెరికన్ దౌత్యాధికారులను బహిష్కరించి వుండాలి. కానీ పుతిన్ అలా చేయలేదు. అతని నిగ్రహాన్ని మెచ్చుకుంటూ 'పుతిన్ చాలా స్మార్ట్' అంటూ ట్రంప్ డిసెంబరు 30న ట్వీట్ చేశాడు. ఫ్లిన్ రాజీనామా తర్వాత ట్రంప్ ప్రెస్ సెక్రటరీ స్పైసర్ మాట్లాడుతూ ''ఇది న్యాయపరమైన అంశం కాదు, విశ్వసనీయతకు సంబంధించిన అంశం. తన ఫోన్ సంభాషణ గురించి ఫ్లిన్ ఉపాధ్యక్షుడికి తప్పుడు సమాచారం యిచ్చాడు. అది మతిమరుపు వలన కావచ్చు, మరో దాని వలన కావచ్చు. కానీ యీ పరిస్థితిని అంగీకరించలేం. అందుకే అధ్యక్షుడు అతని చేత రాజీనామా చేయించారు.'' అన్నాడు. ఫ్లిన్ రాజీనామా ట్రంప్ యిమేజికి దెబ్బే. అతను కావాలంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరు ద్వారా ఒబామా విధించిన ఆర్థిక ఆంక్షలు తొలగించగలడు. కానీ యిప్పుడీ పరిణామం తర్వాత అతనా సాహసం చేయలేడు. రష్యాతో మైత్రి పెంచుకునే ప్రక్రియలో ఆలస్యం తప్పదు. అదే విధంగా నాటోనుంచి తప్పుకోవడమూ ఆలస్యం కావచ్చు. ఆ విధంగా యీ రౌండులో, యిప్పటివరకు డీప్ స్టేట్ విజయం సాధించిందని చెప్పక తప్పదు.
దీనిపై ట్రంప్ రుసరుసలాడుతున్నాడు. ''అమెరికన్ గూఢచారి వర్గాలు మీడియాకు అతి సున్నితమైన దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నాయి. ఇది చట్టవిరుద్ధం.'' అని ఆరోపించాడు. మీడియాలో వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్, సిఎన్‌ఎన్, ఎంఎస్-ఎన్‌బిసిలను పేరు పెట్టి నిందించాడు. అవి ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్నాయన్నాడు. మీడియా ట్రంప్‌పై కత్తి కట్టిన మాట వాస్తవం. వాషింగ్టన్ పోస్టు ''ట్రంప్ అతని సహాయకులు 2016లో తమ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీనియర్ రష్యన్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ వచ్చారని యిద్దరు రిటైర్డ్ యింటెలిజెన్సు అధికారులు చెప్పారు'' అని ప్రచురించింది.
నిజానికి ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గర్నుంచి ట్రంప్‌పై క్రేజీ వార్తలు వేస్తూ రావడం వలన పత్రికల ఆన్‌లైన్ చందాదారులు పెరుగుతున్నారు. న్యూయార్క్ టైమ్స్‌కు 2016 సెప్టెంబరు-డిసెంబరు మధ్య కొత్తగా 2.76 లక్షల మంది డిజిటల్ సబ్‌స్క్రైబర్స్ పెరిగారు. వాళ్ల ఆదాయం 10-15% పెరిగింది. వాల్ స్ట్రీట్ జర్నల్ యిదే సమయంలో 1.13 లక్షల మంది చందాదారులను సంపాదించుకుంది. అంటే 12% వృద్ధి అన్నమాట. ఫైనాన్షియల్ టైమ్స్ 6% వృద్ధితో 6.46 లక్షలకు చేరుకుంది. ఇవన్నీ జనవరి-మార్చి క్వార్టరులో యింకా పెంచుకుందామని చూస్తున్నాయి. పాఠకులు పెరిగారు సరే, చదివినవాళ్లందరూ వీళ్లు రాసినది చదువుతారా అనే సందేహం రావడం సహజం. ఎడెల్‌మన్ అనే సంస్థ 28 దేశాల్లో సర్వే చేసి తేల్చినదేమిటంటే – పత్రికల విశ్వసనీయత గతంలో కంటె బాగా తగ్గి ప్రస్తుతం 35%కి దిగిందట.
ఎందుకిలా అంటే మన దేశంలో చూస్తున్నాం – మీడియా అంతా కార్పోరేట్ల చేతిలో వుంది. వాళ్లు ఎలా రాయించదలచుకుంటే అలా రాయిస్తారు. అమెరికాలోనూ యించుమించు అంతేట. మొన్ననే చదివాను 'ఇల్యూజన్ ఆఫ్ ఛాయిస్' అని. అక్కడ 1500 వార్తాపత్రికలున్నాయి, 1100 మ్యాగజైన్లున్నాయి, 9 వేల రేడియో స్టేషన్లున్నాయి. 1500 టీవీ స్టేషన్లున్నాయి, 2400 మంది పబ్లిషర్లున్నారు. ఇంత వైవిధ్యం వుంది కాబట్టి కొందరైనా భిన్నంగా రాస్తారని, వాస్తవాలు రాస్తారని ఆశించడం సహజం. అయితే వీటన్నిటినీ నిర్వహించేది – ఆరు కార్పోరేట్లు, 272 మంది ఎగ్జిక్యూటివ్‌లు. అంటే దాదాపు 28 కోట్ల మంది అమెరికన్లలో 90% మంది ఏం చదవాలో, ఏం వినాలో, ఏం చూడాలో కూడా నిర్ణయించేది ఆరు కార్పోరేట్లన్నమాట. వాళ్లు కనక డీప్ స్టేట్‌లో భాగమైతే ఎలా రాయిస్తారో సులభంగా వూహించుకోవచ్చు. ట్రంప్‌ను వ్యతిరేకించడమే, వెక్కిరించడమే పనిగా పెట్టుకున్నాయి తప్ప అతను లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపటం లేదు. ట్రంప్, డీప్ స్టేట్ మధ్య జరిగే పోరాటం ముందుముందు ఎలా సాగుతుందో గమనిస్తూ వుండాలి.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2017)