గురుమూర్తిని త‌ప్పించేందుకు జ‌గ‌న్ అంగీక‌రిస్తారా?

తిరుప‌తి ఎంపీ సీటుపై చాలా మంది క‌ళ్లు ప‌డ్డాయి. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన తిరుప‌తి నుంచి వైసీపీ త‌ర‌పున డాక్ట‌ర్ గురుమూర్తి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. డాక్ట‌ర్ గురుమూర్తి సాధార‌ణ దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి…

తిరుప‌తి ఎంపీ సీటుపై చాలా మంది క‌ళ్లు ప‌డ్డాయి. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన తిరుప‌తి నుంచి వైసీపీ త‌ర‌పున డాక్ట‌ర్ గురుమూర్తి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. డాక్ట‌ర్ గురుమూర్తి సాధార‌ణ దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వ్య‌క్తి. ఇప్ప‌టికీ అత‌ను తిరుప‌తిలో సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో నివాసం వుంటున్నారంటే, ఎంత సాధార‌ణ జీవితం గ‌డుపుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన త‌న‌ను దేశంలోనే అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌కు పంపిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు మంచి పేరు తీసుకురావాల‌ని ఆయ‌న త‌ప‌న ప‌డుతుంటారు.

ఉప ఎన్నిక‌లో గెలుపొందిన‌ప్ప‌టి నుంచి త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏదో ఒక అభివృద్ధి కార్య‌క్ర‌మం కోసం కేంద్ర మంత్రులు, ఉన్న‌తాధికారుల చుట్టూ తిరుగుతుండ‌డం విశేషం. తిరుమ‌ల‌లో క‌లియుగ దైవం కొలువై వుండ‌డం వ‌ల్ల తిరుప‌తికి విశేష ప్రాధాన్యం వుంది. తిరుప‌తి నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హించ‌డం అరుదైన గౌర‌వంగా భావిస్తుంటారు. ముఖ్యంగా తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానం నుంచి స్థానికేత‌రులు పోటీ చేయ‌డం తెలిసిందే.

గ‌త ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ పోటీ చేశారు. ఆ త‌ర్వాత ఆమె ఏమ‌య్యారో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. అస‌లు ఆమె బీజేపీలో కొన‌సాగుతున్నారా? లేదా? అనేది కూడా తెలియ‌ని ప‌రిస్థితి. అలాగే 2014లో తిరుప‌తి నుంచి వైసీపీ త‌ర‌పున స్థానికేత‌రుడైన వ‌ర‌ప్ర‌సాద్ గెలుపొందారు. 2019కు వ‌చ్చే స‌రికి ముఖ్యంగా వైసీపీ నాయ‌కులే ఆయ‌న్ను భ‌రించ‌లేక‌పోయారు. దీంతో గూడూరుకు ఆయ‌న్ను పంపి, బ‌ల్లి దుర్గాప్ర‌సాద్‌ను అప్ప‌టిక‌ప్పుడు వైసీపీలో చేర్చుకుని చ‌ట్ట‌స‌భ‌కు పంపారు. బ‌ల్లి అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డంతో తెర‌పైకి అనూహ్యంగా డాక్ట‌ర్ గురుమూర్తి వ‌చ్చారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న పెట్టిన బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌డంలో గురుమూర్తి స‌క్సెస్ అయ్యారు. దీంతో గురుమూర్తిపై జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం కుదిరింది. ఈ నియోజ‌క వ‌ర్గం నుంచి ఒక అధికారిని నిలిపేందుకు జ‌గ‌న్‌కు స‌న్నిహిత‌మ‌ని చెప్పుకునే తిరుప‌తి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కొంత కాలం క్రితం ప్ర‌య‌త్నించారు. స‌ద‌రు రెవెన్యూ అధికారిని నేరుగా సీఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లి తిరుప‌తి లోక్‌స‌భ సీటును అడిగిన‌ట్టు స‌మాచారం. అయితే గురుమూర్తి సీటు కాకుండా, మ‌రేదైనా వుంటే చెప్పాల‌ని సీఎం సూచించిన‌ట్టు తెలిసింది. దీంతో మరో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఆ అధికారిని సూచించిన‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఐఏఎస్ అధికారి క‌రికాల వ‌ల‌వ‌న్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆగ‌స్టులో ఈయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. తిరుప‌తి లోక్‌స‌భ స్థానం నుంచి ఈయ‌న్ను బ‌రిలో నిల‌పాల‌ని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో వైసీపీ రాజ‌కీయాలను శాసించే ఒక నాయ‌కుడు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిసింది. అయితే గురుమూర్తిని మార్చ‌డానికి జ‌గ‌న్‌కు ఏమ‌ని చెబుతార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మిళ‌నాడుకు చెందిన క‌రికాల వ‌ల‌వ‌న్‌ను తిరుప‌తి ప్ర‌జ‌ల‌పై రుద్ద‌డానికి జ‌గ‌న్ అంగీక‌రిస్తారా? అనేది ప్ర‌శ్న‌.

క‌రికాల వ‌ల‌వ‌న్ బాగా డ‌బ్బున్న అధికారిగా ప్ర‌చారం వుంది. కేవ‌లం ఆ ఒక్క కార‌ణంతో క‌నీసం తెలుగు వాడు కూడా కాని ఆయ‌న్ను తిరుప‌తి బ‌రిలో నిల‌ప‌డానికి జ‌గ‌న్ సాహసిస్తారా? అనే చ‌ర్చ పెద్ద ఎత్తున న‌డుస్తోంది. త‌న ప్ర‌భుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చేలా ప‌ని చేసే ప్ర‌జాప్ర‌తినిధి కావాలా? లేక డ‌బ్బున్న ఉన్న‌తాధికారి కావాలా? అనేది జ‌గ‌న్ రానున్న రోజుల్లో తేల్చుకోవాల్సి వుంటుంది.