సినిమా ఫీల్డ్ అంటే నే సెంటిమెంట్లు. ఫలానావాళ్లు స్విచాన్ చేసినా, క్లాప్ కొట్టినా పనికి వస్తుందంటే వాళ్లను పదే పదే పిలుస్తుంటారు. తేడావస్తే పిలవడానికి జంకుతారు.కానీ హీరో ఎన్టీఆర్ వైఖరి డిఫరెంట్ గా వుంది. తనకు తానే సెంటిమెంట్ ఫీలయిపోతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక వైనం ఇలా వుంది.
రానా నటించిన ఘాజీ సినిమా హిందీ వెర్షన్ కు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ చెప్పారు. ఇక్కడ ఎవరు? అనుకున్నపుడు చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్ల పేర్లు ఆలోచనకు వచ్చాయి. ఎన్టీఆర్ బేస్ వాయిస్ సూపర్ గా వుంటుంది. అదే విషయమై వార్తలు కూడా వినవచ్చాయి. కానీ ఇప్పుడు అసలు సీన్ వేరుగా వుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఘాజీ విడుదలవుతోంది.
దీని వెనుక ఎన్టీఆర్ సెంటిమెంట్ దాగి వుందని తెలుస్తోంది. వాయిస్ ఓవర్ చెప్పమన్న రిక్వెస్ట్ ను ఎన్టీఆర్ సున్నితంగా నిరాకరించినట్లు వినికిడి. తను వాయిస్ ఓవర్ చెప్పిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదని, అందువల్ల తనకు ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. తన వల్ల ఒకరికి మంచి జరగాలన్నదే తన అభిమతమని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అదేం లేదని అలాంటి సెంటిమెంట్లు పెట్టుకోవద్దని యూనిట్ చెప్పినా, ఎన్టీఆర్ సున్నితంగా నో అన్నట్లు తెలుస్తోంది.