మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు గుంటూరులో ప్రీ సక్సెస్ మీట్ చేసారు. ఇప్పుడు సినిమా విడుదల, బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా మరో విజయోత్సవాన్ని జరపాలని డిసైడ్ అయ్యారు. ఈ విజయోత్సవాన్ని విశాఖలో చేయాలా? హైదరాబాద్ లో చేయాలా? అన్నది ఇంకా డిస్కషన్ లో వుంది.
గతంలో మెగా సినిమాలు కొన్నింటికి విశాఖలో విజయోత్సవ సభలు జరిపారు. ఇప్పుడు మళ్లీ అలాగే అక్కడే విజయోత్సవ సభ జరపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా శిబిరానికి ఆప్తుడయిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ వున్నారు. ఆయనే ఈ విషయంలో ప్రోత్సహిస్తున్నట్లు బోగట్టా. గుంటూరు సభకు గంటా రాలేదు. అప్పట్లో సభకు అనుమతి ఇవ్వకపోవడం, వంటి వ్యవహారాలు వుండడంతో గంటా దూరంగా వున్నారు.
ఇప్పుడు విశాఖలో సభ అంటే గంటా పాల్గొనడంలో అనౌచిత్యం ఏమీ వుండదు. ఎందుకంటే ఆయన అక్కడ మంత్రి, ఎమ్మెల్యేగా వున్నారు కాబట్టి. అదీ కాక విశాఖలో కొత్త రికార్డులు సృష్టించే దిశగా ఖైదీ పయనిస్తోంది. ఇప్పటికి ఎనిమిది కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇప్పుడు అక్కడ సభ జరిపితే, మరింత ముందుకు సాగి, పది కోట్ల మార్కును దాటే అవకాశం వుంది. ఇది ఉత్తరాంధ్ర కే కొత్త రికార్డు అవుతుంది. అందుకే విశాఖలోనే సభ జరిపే అవకాశం వుంది.