రివ్యూ: ఖైదీ నంబర్ 150
రేటింగ్: 3/5
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ
తారాగణం: చిరంజీవి (ద్విపాత్రాభినయం), కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, అలీ, బ్రహ్మానందం, రఘుబాబు, నాజర్ తదితరులు
రచన: పరుచూరి బ్రదర్స్
కథ: మురుగదాస్
మాటలు: బుర్రా సాయిమాధవ్, వేమారెడ్డి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాత: రామ్ చరణ్
కథనం, దర్శకత్వం: వి.వి. వినాయక్
విడుదల తేదీ: జనవరి 11, 2017
తెలుగు సినీ సామ్రాజ్యాన్ని రెండు దశాబ్ధాలకి పైగా మకుటం లేని చక్రవర్తిగా ఏలిన చిరంజీవి సినిమాలనుంచి విరమణ తీసుకుని రాజకీయాల్లోకి వెళ్లిపోయి దశాబ్ధం కావస్తోంది. సినీ రంగంలోకి పునఃప్రవేశించాలని ఆయన నిర్ణయించుకున్నపుడు ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. చిరంజీవికి మళ్లీ ఆనాటి వైభవం తిరిగి వస్తుందా? పదేళ్ల పాటు ఫీల్డుకి దూరంగా ఉన్నారు కనుక ఇప్పటి తరానికి ఆయన నటన నచ్చుతుందా? అన్నిటికీ మించి పదేళ్లు వయసు పెరిగింది కనుక మునుపటిలా ఆయనలో చురుకు ఉంటుందా? డాన్సుల్లో అప్పటి మెరుపులు ఉంటాయా? నిజమే… ఇవన్నీ మామూలు వాళ్లకి కష్టమైన, ఆచరణ అసాధ్యమైన విషయాలే కానీ మెగాస్టార్‌కి కాదని ఆయన 'ఖైదీ నంబర్ 150'తో నిరూపించారు.
కృషి వుంటే కొణిదెల శివశంకర వరప్రసాద్ ఒక మెగాస్టార్ చిరంజీవి కాగలడని నిరూపించిన ఆయనే, కసి వుంటే ఆరు పదులు నిండిన వయసులో అన్ని అవరోధాలని, అనుమానాలనీ, అపోహలనీ అధిగమించవచ్చునని, పదేళ్ల తర్వాత మళ్లీ వచ్చి, వదిలి వెళ్లిన స్థానంలోనే తిరిగి నిలబడవచ్చునని ఈ చిత్రంతో సుస్పష్టం చేసారు. చిరంజీవి హాస్యంలో టైమింగ్ ఏమాత్రం తగ్గలేదు, ఎమోషన్స్‌లో ఎలాంటి నాటకీయత వచ్చి చేరలేదు, భావ ప్రకటనలో టైమ్ గ్యాప్ వెతికినా కనిపించలేదు, డాన్సుల్లో ఆ రిథమ్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఏజ్‌ని కప్పిపుచ్చే లుక్స్‌తో, ఎనర్జీతో మెగాస్టార్ 'బాస్ ఈజ్ బ్యాక్' అని అభిమానుల్తోనే కాదు, సగటు సినీ ప్రియులతోను అనిపించేసారు.
'ఖైదీ నంబర్ 150'ని ఒక రెగ్యులర్ సినిమాగా కంటే చిరంజీవి పునరాగమన చిత్రంగా చూసే వాళ్లే ఎక్కువ. ఫోకస్ మొత్తం ఆయన మీదే ఉంటుంది… ఎలా నటించారు, ఎలా నర్తించారు? అంటూ. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి ఈ సంగతి తనకి ముందే తెలుసునన్నట్టు అన్ని అంశాలున్న ఒక కమర్షియల్ సబ్జెక్ట్‌తో ముందుకొచ్చారు. తన మీద ఉండే ఫోకస్‌కి తగ్గ అవుట్‌పుట్ ఇచ్చి, 'హోమ్ గ్రౌండ్'లో తనెందుకు బాస్ అనేది చూపించారు.
కథగా చెప్పుకుంటే, తమిళ 'కత్తి' చిత్రానికి రీమేక్ అయిన ఖైదీ నంబర్ 150లో ఏమంత కొత్తదనం లేదు. తమిళంలో విజయ్ మాస్ ఫాలోయింగ్, మురుగదాస్ కాంబినేషన్ క్రేజ్‌కి తగ్గట్టుగా కమర్షియల్ ప్యాకేజింగ్‌తో కూడిన చిత్రమిది. కాస్త వినోదం, కాస్త యాక్షన్, ఒక సోషల్ మెసేజ్ ప్లస్ అన్ని కమర్షియల్ మసాలాలున్న రొటీన్ స్క్రిప్ట్. జైలు నుంచి పారిపోయి వచ్చిన కత్తి శీను (చిరంజీవి) ఎలాగైనా విదేశాలకి వెళ్లిపోవాలని చూస్తున్న సమయంలో అచ్చం తనలానే వున్న శంకర్‌కి (చిరంజీవి) తన కళ్లముందే యాక్సిడెంట్ అవుతుంది. పోలీసులు తనని వెతుకుతున్నారు కనుక శంకర్‌ని తన స్థానంలో వుంచి పోలీసులని మోసం చేస్తాడు. శంకర్‌కి, అతడిని నమ్ముకున్న పేద రైతులకి పాతిక లక్షలు రాబోతున్నాయని తెలుసుకుని, వాటిని కొట్టేసి విదేశాలకి పారిపోదామని అనుకుంటాడు. కానీ శంకర్ కథ తెలుసుకుని ఆ రైతులకి తానే అండగా నిలబడాలని డిసైడవుతాడు. ఇంతకీ శంకర్ కథేంటి, ఆ రైతులకి ఉన్న కష్టమేంటి, వారి వెతలు తీర్చడానికి కత్తి శీను చేసేదేంటి?
మురుగదాస్ 'రమణ' చిత్రాన్ని 'ఠాగూర్'గా రీమేక్ చేసినపుడు వినాయక్ దానిని పూర్తి కమర్షియల్ చిత్రంగా మలిచాడు. అయితే ఈసారి ఒరిజినల్‌లో మురుగదాసే మొత్తం అన్ని కమర్షియల్ అంశాలుండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో వినాయక్‌కి ఎక్స్‌ట్రా పని పడలేదు. చిరంజీవికి తగ్గట్టుగా కామెడీ సీన్లు కాస్త మార్చి, బ్రహ్మానందం పాత్రని చేర్చడం మినహా ఒరిజినల్‌ని యథాతథంగా ఫాలో అయిపోయారు. వినోదం పండించడంలో, విసుగు పుట్టించకుండా కథనం ముందుకు సాగడంలో వినాయక్ సక్సెస్ అయ్యాడు. అలాగే రైతుల కష్టాలకి సంబంధించిన సన్నివేశాలన్నీ ఎమోషనల్‌గా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకున్నాడు. ఎలాంటి కొత్తదనం, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్, వావ్ ఫ్యాక్టర్ లేని కథని వినాయక్ కమర్షియల్ ప్యాకేజింగ్‌తో జాగ్రత్తగా రెడీ చేస్తే ఇక దానిని సేల్ చేసే బాధ్యతని మెగాస్టార్ తీసుకున్నారు.
సాంగ్స్, కామెడీ, మాస్ మొమెంట్స్‌తో చిరంజీవి ఈ చిత్రానికి సర్వం తానయ్యారు. కాజల్‌తో రొమాన్స్ సీన్స్‌లో మాత్రమే కాస్త ఆడ్ అనిపించినా, ఆ సీన్లు ఎక్కువ లేకుండా చూసుకుని వినాయక్ మంచి పని చేసాడు. చిరంజీవి రాజకీయ జీవితాన్ని, చేదు అనుభవాల్ని గుర్తు చేసే డైలాగులు, వాటికి చిరు సమాధానాలు కూడా తెలివిగా కథలోకి చొప్పించారు. 'అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు తెలీదు సర్', 'నవ్విన వాళ్లకి చెప్పు… ఏడ్చే రోజు త్వరలోనే వస్తుందని' అంటూ అభిమానులకి విజిల్ వర్తీ డైలాగ్స్ ఇచ్చారు. చిరు డాన్సుల్లో మునుపటి వేగం మందగించి ఉండవచ్చు కానీ తను గ్రేస్‌ఫుల్ డాన్సర్ కావడం వల్ల చిన్న స్టెప్స్‌నే ఎఫెక్టివ్‌గా చేసి ఫాన్స్‌కి కిక్ ఇచ్చారు. చిరుతో చరణ్ డాన్స్ బిట్ ఫాన్స్‌కి అడిషనల్ ఫీస్ట్. కాజల్ చేయడానికేం లేదు, అందంగా కనిపించడం తప్ప. ఆమె వంతు చేయాల్సింది చేసింది. విలన్‌గా తరుణ్ అరోరా ఫ్రెష్‌గా అనిపించాడు. అలీ, బ్రహ్మానందం, రఘుబాబు కామెడీ సోసోగా వుంది.
నిర్మాతగా రామ్ చరణ్ ఈ చిత్రానికి బెస్ట్ టెక్నీషియన్స్‌ని సైన్ అప్ చేసుకున్నాడు. రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో తన బ్యానర్‌ని ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసాడు. రత్నవేలు, దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి పెద్ద బలమయ్యారు. దేవిశ్రీప్రసాద్ పాటలు ఇప్పటికే సూపర్ పాపులర్. వాటికి చిరు డాన్సులతో మరింత అందం వచ్చింది. నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. చిరంజీవిని ఇంత గ్లామరస్‌గా చూపించడంలో, చిత్రం మొత్తం రిచ్‌గా కనిపించడంలో రత్నవేలు సినిమాటోగ్రఫీ పెద్ద ఎస్సెట్ అయింది. మాటల రచయితలు బుర్రా సాయిమాధవ్, వేమారెడ్డి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రైతుల కష్టాల గురించిన సంభాషణలు అద్భుతంగా పండాయి.
కథాపరంగా బలహీనతలున్నాయి, కథనంలో హెచ్చు తగ్గులున్నాయి. అలాగే హీరోయిజం ఎలివేట్ చేసే మంచి సీన్లున్నాయి, ఎమోషనల్‌గా కదిలించే సందర్భాలున్నాయి. అన్ని రకాల ఎలిమెంట్స్ కలబోత అయిన ఈ కమర్షియల్ సినిమా కాంటెంట్ పరంగా యావరేజ్ అనిపిస్తుంది. దానికి కమర్షియల్‌గా మెగా రేంజ్ ఇవ్వడంలో చిరంజీవి ఫ్యాక్టర్ పెద్ద ప్లస్ అవుతుంది. ఆరు పదుల వయసులో ఏం చేయగలరులే అనుకున్న వారికి ఆన్సర్ ఇవ్వడమే కాదు, ఈ ఏజ్‌లో వచ్చి యంగ్ ఏజ్‌లో ఉన్న హీరోలనీ అలర్ట్ చేశారు. యస్… బాస్ ఈజ్ బ్యాక్.
బాటమ్ లైన్: మెగాస్టార్ కొత్త అధ్యాయం షురూ!
గణేష్ రావూరి