బెంగ‌ళూరులో ఫ్లాట్ రెంట్.. 25 ల‌క్ష‌ల అడ్వాన్స్!

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కు మంగ‌ళం పాడుతున్నాయి కంపెనీలు. పెద్ద న‌గ‌రాల్లోని టెక్ పార్కుల్లోని ఆఫీసుల‌ను నిర్వ‌హిస్తున్న సంస్థ‌లు వారానికి క‌నీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు హాజ‌రు కావాల్సిందేనంటూ ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేస్తున్నాయి.…

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కు మంగ‌ళం పాడుతున్నాయి కంపెనీలు. పెద్ద న‌గ‌రాల్లోని టెక్ పార్కుల్లోని ఆఫీసుల‌ను నిర్వ‌హిస్తున్న సంస్థ‌లు వారానికి క‌నీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు హాజ‌రు కావాల్సిందేనంటూ ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ నెల‌లో ఎనిమిది రోజులు.. మీ వీలును చూసుకుని హాజ‌ర‌వ్వండి అంటూ కొన్ని కంపెనీలు, వారానికి రెండు రోజుల పాటు అంటూ మ‌రి కొన్ని కంపెనీలు ఉద్యోగుల‌ను పిలిచాయి. ఇప్పుడు చాలా కంపెనీలు వారానికి మూడు రోజులు అంటున్నాయి.

వారానికి రెండు రోజులైనా టెక్ పార్కుల్లోకి ఉద్యోగుల‌ను పిల‌వాలంటూ ప్ర‌భుత్వాలే ఒత్తిడి చేసిన‌ట్టుగా అప్పుడు వార్త‌లు వ‌చ్చాయి. ఉద్యోగులు క‌దిలితేనే.. ప్ర‌భుత్వాల‌కు ఆదాయం. దాని కోసం వారానికి క‌నీసం రెండు రోజుల పాటు ఆఫీసుల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వాలు కంపెనీల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చాయి. ఇప్పుడు కంపెనీలు మూడు రోజుల పాట అందుకున్నాయి! 

దీంతో దూర‌ప్రాంతాల్లోని సొంతూళ్ల నుంచి ప‌ని చేస్తూ సిటీలో ఫ్లాట్ల‌ను ఖాళీ చేసి మూడేళ్ల నుంచి రెంట్ బాద‌ర‌బందీల నుంచి త‌ప్పించుకున్న వాళ్ల‌కు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా అయినా సిటీల‌కు మారాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌త్యేకించి జూన్ నుంచినే చాలా మంది తిరిగి సిటీకి షిఫ్ట్ అయిన వారున్నారు. జూన్ లో స్కూళ్ల ప్రారంభం స‌మ‌యంలో.. చాలా మంది న‌గ‌రాల‌కు త‌ప్ప‌నిస‌రిగా షిఫ్ట్ అయ్యారు. ఇంకా మిగిలిన వారు.. ఇక త‌ప్ప‌నిస‌రిగా న‌గ‌రంలో ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.

అద‌లా ఉంటే ఏడాదిన్న‌ర నుంచి హైద‌రాబాద్, బెంగ‌ళూరుల్లో హౌస్ రెంట్స్ ప‌తాక స్థాయికి చేర‌డం కొన‌సాగుతూ ఉంది. క‌రోనా లాక్ డౌన్లు ముగిసిన ద‌గ్గ‌ర నుంచి.. గ‌త ఏడాది జ‌న‌వ‌రి నుంచినే.. రెంట్లు పెర‌గ‌డం ఎక్కువైంది. ఇప్పుడు అది ప‌తాక స్థాయికి చేరింది.

2020 మార్చి నాటికి.. నెల‌కు 14వేల స్థాయిలో రెంట్లు న‌డిచిన ఫ్లాట్ రెంటు ఇప్పుడు 20 వేల స్థాయిలో చెబుతున్నారు! కేవ‌లం మూడేళ్ల వ్య‌వ‌ధిలో ఇలా స‌గ‌టున ఆరేడు వేల రూపాయ‌ల చొప్పున రెంట్లు పెరిగాయి! ఇక ర‌క‌ర‌కాల ఎమినీటీస్ ఉన్న అపార్ట్ మెంట్ల‌లో అయితే.. రెంట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటిల్లో 1200 స్క్వైర్ ఫీట్స్ ఫ్లాట్ రెంట్లు అపార్ట్ మెంట్ రేంజ్ ను బ‌ట్టి.. 25 వేల రూపాయ‌ల నుంచి.. 60 వేల రూపాయ‌ల వ‌ర‌కూ న‌డుస్తున్నాయి! అద్భుత‌మైన ఫెసిలీట‌స్ ఏమీ ఉండ‌వు. కాస్త పెద్ద అపార్ట్ మెంట్ అయి ఉండి, కాస్త గాలీవెలుతురు స‌వ్యంగా ఉన్నా.. రెంటు 25 వేల రూపాయ‌ల పైనే! పాతిక వేల రూపాయ‌లు అనేది ఇప్పుడు క‌నీస రెంట్ రేంజ్ గా మారింది. దీనిపై మెయింటెయినెన్స్ అంటూ మూడు నుంచి ఐదు వేల రూపాయ‌ల వ‌సూలు ఉంటుంది.

బెంగ‌ళూరు నార్త్ లో డ‌బుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ రెంట్లు మూడేళ్ల కింద‌ట 14 నుంచి 20 వేల మ‌ధ్య‌న ఉంటే.. ఇప్పుడు క‌నీసం 22 నుంచి 30 మ‌ధ్య‌కు మారాయి అవ‌న్నీ! ఇక ప్ర‌ధాన న‌గ‌రంలో.. టెక్ పార్క్ ల‌కు కాస్త స‌మీపంలో ఉంటే.. ట్రిపుల్ బెడ్ రూమ్ కావాలంటే 45 నుంచి 60వేల రూపాయ‌ల వ‌ర‌కూ రెంట్ కు సిద్ద‌ప‌డాల్సిందే! ఇక బెంగ‌ళూరులో అడ్వాన్స్ మ‌రో పెద్ద క‌థ‌.

ప‌ది నెల‌ల అడ్వాన్స్ అంటూ అక్క‌డ భారీ మొత్తం చెల్లించుకోవాల్సిందే. నో బ్రోక‌ర్ లో టు లెట్ బోర్డుతో ప్ర‌క‌ట‌న పెట్టిన ఒక హౌస్ ఓన‌ర్.. 25 ల‌క్ష‌ల రూపాయ‌ల మొత్తాన్ని అడ్వాన్స్ అంటూ పేర్కొన‌డం నెట్ లో వైర‌ల్ గామారింది! ఆ ఫ్లాట్ రెట్ 2.5 ల‌క్ష‌లు. ప‌ది నెల‌ల ఫార్ములా కింద 25 ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్! కామెడీ ఏమిటంటే.. ఆ అడ్వాన్స్ కు లోన్ స‌దుపాయాన్ని నో బ్రోక‌ర్ లింక్ చేయ‌డం! మ‌రి నెల‌కు రెండున్న‌ర ల‌క్ష‌ల రెంటు క‌ట్టే స్థోమ‌త ఉన్న వారికి 25 ల‌క్ష‌ల అడ్వాన్స్ ఒక లెక్క కాక‌పోవ‌చ్చు. చాలా మంది ఐటీ ఉద్యోగులు కూడా 25 వేల నుంచి 45 వేల వ‌ర‌కూ కూడా రెంట్ క‌డుతూ న‌గ‌ర వాసాన్ని సాగిస్తున్నారిప్పుడు!