ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ నటీనటులు నటించిన సినిమాలు విడుదలవడమే చాలా కష్టంగా మారిపోయింది. ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు, నానా తంటాలూ పడి సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది. భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధమేఘాలే అందుకు కారణం. పాకిస్తాన్ సరిహద్దుల్లో మారణహోమం సృష్టిస్తుండడంతో, పాక్ నటీనటులు నటించిన సినిమాలు చూడొద్దంటూ ఎంఎన్ఎస్ సహా పలు పార్టీలు, సంస్థలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి.
నిర్మాతలకు సంబంధించిన కొన్ని యూనియన్లు కూడా పాకిస్తానీ నటీ నటులపై బ్యాన్ విధించడం, దాన్ని కొందరు సినీ ప్రముఖులు ఖండించడం తెల్సిన విషయాలే. 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించడంతో, ఆ సినిమా విడుదలకు ముందు చాలా వివాదాలు ఎదుర్కొంది. ఇప్పుడు తాజాగా ఈ సమస్య 'రయీస్' సినిమాకి తలెత్తే అవకాశముంది. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ఎంఎన్ఎస్ (మహారాష్ట్ర నవనిర్మాణ సేన) చీఫ్ రాజ్ థాక్రేని కలిసిన షారుక్‌ఖాన్, తమ సినిమాకి 'అనుమతి' తెచ్చుకున్నాడు కూడా. ఎందుకంటే, ఎంఎన్ఎస్ – పాకిస్తానీ నటీనటులపై చాలా సీరియస్‌గానే గుస్సా అవుతోంది మరి.
ఇదిలా వుంటే, 'రయీస్'లో షారుక్ సరసన నటించిన పాకిస్తానీ నటి మహీరా ఖాన్ని సినిమా ప్రమోషన్ కోసం ముంబైకి తీసుకొస్తున్నారు. ఒక్క ముంబైలోనే కాకుండా, దేశంలోని పలు ప్రధాన నగరాల్లో మహీరా ఖాన్‌తో 'రయీస్'ని ప్రమోట్ చేయించాలనే ఆలోచన షారుక్దేనట. తాజాగా, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు జమ్మూకాశ్మీర్‌లో ముగ్గురు సైనికుల్ని బలిగొన్న ఘటన తర్వాత సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తానీ నటి మహీరాఖాన్ ఇండియాకి తీసుకొస్తున్నారన్న వార్త కలకలం రేపుతోంది. అదే నిజమైతే, షారుక్ కొరివితో తలగోక్కున్నట్లే. 'రయీస్' నిర్మాతల్లో ఒకరైన షారుక్, ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నట్లో.! బహుశా వివాదంతో పండగ చేసుకుందామనుకుంటున్నట్టున్నాడు.