మామూలే.. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా ప్రమోషన్ కోసం, సదరు దర్శకుడితో మరో సినిమా చేస్తానని హీరో అనడం, వీళ్ల కాంబోలోనే మరో సినిమా చేస్తానని నిర్మాతలు ప్రకటించడం రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. మనసులో ఏముంటుందో కానీ.. బయటకు అయితే ఇలా చెప్పేస్తూ ఉంటారు. అయితే ఇలా చెప్పే వాళ్లు ఎక్కువై పోవడంతో.. అవన్నీ ఉత్తుత్తి కబుర్లే అని క్లారిటీ క్రమంగా వచ్చేస్తోంది. ఇప్పుడు సురేందర్ రెడ్డి- చిరంజీవి కాంబోలో సినిమా విషయంలో కూడా అదే జరుగుతోందని స్పష్టం అయ్యింది.
‘ధ్రువ’ విడుదలకు సర్వం సిద్ధం అవుతున్న దశలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందుతుందని అన్నారు. స్వయంగా మెగా క్యాంప్ ఈ లీకేజి ఇచ్చింది.
‘ధ్రువ’ కోసం సురేందర్ రెడ్డి చేసిన వర్క్ చిరంజీవికి బాగా నచ్చిందని, ‘ధ్రువ’ చాలా బాగా వచ్చిందని, దీంతో తన తదుపరి సినిమాను సురేందర్ తోనే చేద్దామని అనుకుంటున్నాడని.. అన్నారు. ఓవరాల్ గా మెగా క్యాంప్ దాన్ని బాగా ప్రచారం చేసింది.
అయితే.. ‘ధ్రువ’ ప్రమోషన్ కోసమే అలా చెబుతున్నారనేమో అనుకున్నారంతా. చరణ్ సినిమా బాగా వచ్చింది అని చెప్పడానికి.. చిరుతో సినిమా అనే పాచిక విసిరారనే అనుమానాలు కలిగాయి. అలా అనుకున్నదే నిజమని ఇప్పుడు తెలుస్తోంది.
తన తదుపరి సినిమా కొత్త వాళ్లతో ఉంటుందని సురేందర్ చెప్పాడు. మరి మొన్నటి వరకూ తదుపరి సినిమా చిరంజీవితో అన్నారు కదా.. అంటే, చిరంజీవితో ఉంటుంది కానీ.. ఇప్పుడప్పుడే కాదు అని సురేందర్ అన్నాడు. అది ఎప్పుడు అనేది కూడా తను చెప్పలేను అని కూడా ఈ దర్శకుడు స్పష్టం చేశాడు! అంతే కదా.. ‘ధ్రువ’ విడుదలైపోయింది, ఇక అలాంటి చిరంజీవితో సినిమా అనే ప్రచారం ఎవరికీ అక్కర్లేదు!