చూస్తే ‘ధ్రువ’ చూడండి.. లేకపోతే ఏదీ చూడొద్దు!

ఇదేంది? పేరుకు ప్రజాస్వామ్యమే కానీ.. ఇక్కడ అణగదొక్కే శక్తి ఉన్న వాడిదే రాజ్యం. ఆధిపత్యం చెలాయించేవాడిదే పై చేయి! ఆఖరికి జనాలకు మరో సినిమా ఛాయిస్ ను కూడా ఇవ్వకుంటే ఎలా స్వామీ! అన్ని…

ఇదేంది? పేరుకు ప్రజాస్వామ్యమే కానీ.. ఇక్కడ అణగదొక్కే శక్తి ఉన్న వాడిదే రాజ్యం. ఆధిపత్యం చెలాయించేవాడిదే పై చేయి! ఆఖరికి జనాలకు మరో సినిమా ఛాయిస్ ను కూడా ఇవ్వకుంటే ఎలా స్వామీ! అన్ని థియేటర్లలోనూ ఒకే సినిమా ఉంటుందట.. చూస్తే జనాలు అదే సినిమా చూడాలి! లేకపోతే.. మరే సినిమానూ చూడకూడదు!

మిగతా వాళ్లు కూడా నిస్సిగ్గుగా.. ప్రకటించేసుకుంటున్నారు. ఫలానా సినిమా కోసం మా సినిమాను వాయిదా వేశాం అని! ఏదో ఘనకార్యం చేసినట్టుగా. ఎంత మెగాస్టార్ తనయుడు అయితే మాత్రం, అల్లు అరవింద్ మేనల్లుడు అయితే మాత్రం ఇలా .. మిగతా సినిమాలను వాయిదా వేయించడం ఏమిటో! 

వాయిదా వేయించిన వాళ్లకు శక్తి ఉంది, వాయిదా వేసుకునే వాళ్లకు ఓపిక ఉంది.. కానీ జనాలకు ఈ ఖర్మ ఎందుకు? ఇది కేవలం ‘ధ్రువ’ విషయంలో మాత్రమే జరిగింది కూడా కాదనే చెప్పాలి. ఇది వరకూ కూడా కేవలం తమ ఒక్క సినిమానే స్ట్రీమ్ లో ఉండాలని.. మిగతా సినిమాలను వాయిదా వేయించిన సందర్భాలున్నాయి. 

ఇప్పుడు ‘ధ్రువ’ కోసం సింగం వాయిదాపడింది, మరో కన్నడ సినిమాను కూడా వాయిదా వేయించారు.. అంటే, ఇందులో కొంత నియంతృత్వ ధోరణి, మరికొంత అభద్రతా భావం కనిపిస్తోంది. 

ఇంతజేసి ఈ ధ్రువ అనే సినిమా స్ట్రైట్ పిక్చర్ కాదాయె.. మరీ వంద కోట్లు పెట్టి తీసిన సినిమానూ కాదాయె! వైవిధ్య భరితమైన.. ప్రయోగవంతమైన సినిమా చేశాం, మాకు పోటీగా ఎవరూ రావొద్దు.. అంటే అదో లెక్క. ఒక రీమేక్ సినిమా! ఆల్రెడీ  వచ్చిన సినిమాను మళ్లీ తీశారు. ఈ మాత్రం దానికే.. జనాలపై మరీ ఇంతలా రుద్దడమా! సినిమా చూడాలనిపిస్తే.. ఏ థియేటర్ వైపు వెళ్లినా ఇదే సినిమా ఉండాలి.. అప్పుడు చచ్చినట్టు ఈ సినిమాను చూస్తారు! ఇదా.. సినిమాను హిట్ చేసుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతి!