ఎమ్బీయస్‌: ధీరవనిత జయలలిత

జయలలిత వెళ్లిపోయారు. విలక్షణ వ్యక్తిత్వంతో ఎప్పుడూ వార్తల్లో వుంటూ వచ్చినామె అంతిమఘట్టం కూడా సంచలనాత్మకంగానే నడిచింది. ఆమె సహజమరణాన్ని కూడా జీర్ణించుకోలేని తమిళ ప్రజలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడతారో అన్న భయం తమిళనాడులోనే…

జయలలిత వెళ్లిపోయారు. విలక్షణ వ్యక్తిత్వంతో ఎప్పుడూ వార్తల్లో వుంటూ వచ్చినామె అంతిమఘట్టం కూడా సంచలనాత్మకంగానే నడిచింది. ఆమె సహజమరణాన్ని కూడా జీర్ణించుకోలేని తమిళ ప్రజలు ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడతారో అన్న భయం తమిళనాడులోనే కాదు, దేశంలోనే ఆసక్తి రగిలించింది. పూర్తిగా కోలుకుని యింటికి వెళ్లిపోతుందను కుంటూండగానే ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. సోమవారం ఉదయం 11 గం||లకే మరణించినా మరణవార్తను మరో పన్నెండు గంటల పాటు తొక్కి వుంచారని అభిజ్ఞవర్గాల భోగట్టా. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సైన్యాన్ని దింపి, సకలవిధాల ఏర్పాట్లు చేసుకుని, అప్పుడు అర్ధరాత్రి ప్రకటించడం తెలివైన పనే. 

సత్యసంధతకు కట్టుబడ్డామని అనుకునే తమిళ మీడియాలో ఒక భాగం ఆమె మరణవార్తను ప్రసారం చేసేసి, కాస్త కల్లోలం సృష్టించింది. అప్పుడు ప్రభుత్వం వారు అపోలో ఆసుపత్రి వాళ్ల చేత అబ్బే, అది అబద్ధం అనిపించి, అందరూ యిళ్లకు క్షేమంగా చేరాక అప్పుడు బయటపెట్టి జనాల్ని, దుకాణాల్ని కాపాడారు. అయినా అపోలో ఆసుపత్రిపై దాడులు జరిగాయి. జయలలిత ఆసుపత్రిలో సెప్టెంబరులో చేరిన దగ్గర్నుంచి ఎందుకైనా మంచిదని వాళ్లు తమిళనాడులో అపోలో బ్రాండ్‌తో వున్న ఆసుపత్రులే కాదు, క్లినిక్కులే కాదు, ఫార్మసీలు కూడా యిన్సూర్‌ చేసి పెట్టుకున్నారట. గతంలో ఎమ్జీయార్‌ కూడా సహజమరణం పొందినా అల్లర్లు జరిగాయి. ఇక రాజీవ్‌ హత్య జరిగినప్పుడైతే చెప్పనే అక్కరలేదు. డిఎంకె ఆఫీసులను తగలబెట్టారు. జయలలిత అధికారంలో వుండగా పోయింది కాబట్టి సరిపోయింది కాబట్టి కానీ కరుణానిధి పదవిలో వుండగా పోయి వుంటే అపోలో వాళ్లచేత విషప్రయోగం చేయించాడనే పుకార్లు పుట్టించేది తమిళ మీడియా. 

తనపై ఎంత అవినీతి ముద్ర వున్నా, అనారోగ్యంతోనే గత ఎన్నికలలో పోటీ చేసి, పెద్దగా ప్రచారం చేయకుండానే జయలలిత నెగ్గింది. ఆమె సంక్షేమ పథకాలే ఆమెకు ప్రచారం చేసిపెట్టాయి. విపక్షాల అనైక్యత కలిసి వచ్చింది. తన అనారోగ్యం బయటపడితే పార్టీలో అధికారం కోసం కుమ్ములాటలు జరుగుతాయని, తనపై తిరుగుబాటు చెలరేగుతుందనే భయంతో రోగాన్ని దాచుకుని ముప్పు తెచ్చుకుందని వైద్యులన్నారు. ఇప్పుడు ఆ భయాలు నిజమవుతాయని అందరి అంచనా. జయలలిత మరణానంతర పరిణామాల గురించి వూహించే ముందుగా ఆమె గురించి కాస్త గుర్తు చేసుకోవడం భావ్యం. ఆమెలో జీవితం రెండు భాగాలుగా చూడాలి. నటీమణిగా – రాజకీయనాయకురాలిగా. ఆమె రాజకీయాల గురించి చర్చించడానికి చాలా వుంటుంది కానీ నటన గురించి వ్యాఖ్యానించడానికి పెద్దగా లేదు. 

ఆమె మంచి నటీమణి. అన్ని రకాల పాత్రలను అనాయాసంగా నటించింది. చిన్ననాటే సినీరంగంలోకి ప్రవేశించి, అతి త్వరగా ముందువరుసకు వెళ్లిపోయి, తమిళ, తెలుగు రంగాలలో అగ్రనటులందరి పక్కనా కథానాయికగా నటించి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రల్లో యిమిడిపోయింది. ఏ పాత్ర వేసినా గ్లామరస్‌గా కనబడింది. సాటి నటీనటులతో, టెక్నీషియన్లతో – ఎవరితో వివాదాల్లో చిక్కుకోలేదు. ఎవరితో పోటీ పడలేదు. చిత్రనిర్మాణం అంటూ, దర్శకత్వం అంటూ కాంప్లికేషన్స్‌ తెచ్చుకోలేదు. తక్కిన భాషల్లో కూడా వేసినా, ప్రధానంగా తమిళ, తెలుగులలో రాణించింది. తెరపై పోకిరి పాత్రలు వేసినా షూటింగు సమయంలో మాత్రం అతి హుందాగా, ప్రొఫెషనల్‌గా వుండేది. విరామాల్లో ఉబుసుపోక కబుర్లు చెప్పకుండా పుస్తకాలు చదువుకుంటూ, ఒక మేధావి యిమేజి మేన్‌టేన్‌ చేసింది. ఆమె జోలికి ఎవరూ వెళ్లేవారు కారు. ఆమె కూడా కువ్యాఖ్యలు చేసిన సందర్భాలు కనబడవు. చాలా త్వరగా కెరియర్‌ ప్రారంభించినందు వలన కాబోలు, 30 సం||ల వయసు వచ్చేసరికే కెరియర్‌ ముగిసిపోయింది. తను వేయవలసిన పాత్రలు కనబడలేదు. తల్లి పాత్రలు వేయడానికి వయసు చాలదు, వదిన పాత్రలు వేయడానికి మనసు రాలేదు.

ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆమె చేసిన పోరాటం అందరి దృష్టినీ ఆకర్షించింది. పోరాటంలో గెలిచాక ఆమె ప్రవర్తన అందర్నీ విస్మయపరచింది. దాంతో ఆమె బాల్యం ఎటువంటిది, ఎటువంటి పరిస్థితుల్లో ఆమె సినిమాల్లోకి నెట్టబడింది, ఎమ్జీయార్‌ ఆమె పాలిట రక్షకుడిగాను, తక్షకుడిగాను ఎలా తయారయ్యాడు, ఈమె మూడ్‌ స్వింగ్స్‌ ఎలా వుండేవి, అహంభావం, తిరగబడే స్వభావం, పోరాటపటిమ, తనను అణచివేసిన సమాజం పట్ల ప్రతీకారేచ్ఛ యివన్నీ చర్చకు వచ్చాయి. ఆమె బాల్యాన్ని తరచితరచి పరామర్శించి, ఆమె మనస్తత్వాన్ని విశ్లేషించడానికి ప్రయత్నించారు. ''తమిళ రాజకీయాలు''లో నేను యివన్నీ విపులంగా రాశాను కాబట్టి యిక్కడ మళ్లీ రాయడం అనవసరం. 

రెండు ముక్కల్లో చెప్పాలంటే – సమాజం ఆమె పట్ల అన్యాయంగా ప్రవర్తించింది, అవమానించింది, అవహేళన చేసింది, అణచి వేసింది. ఆమె పగబట్టిన పడుచుగా మారి అంతకంత కసి తీర్చుకుంది. కక్ష సాధించే క్రమంలో ఆమె మేధస్సు, బహుభాషా ప్రావీణ్యం, వాగ్ధోరణి, ఏకసంధాగ్రాహత్వం అన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రజలను ఆకర్షించింది, మంత్రముగ్ధులను చేసింది. అధికారంలోకి వచ్చాక అధికారగణాన్ని మెప్పించింది. ఆమె ధోరణులను నిరసించేవారు సైతం ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని మెచ్చుకోక తప్పదు. అయితే ఆమె అంతటితో ఆగలేదు. తన యిమేజిని పెంచుకోవడానికి రాష్ట్రాదయంతో నిర్మాణాత్మకమైన పనులు చేపట్టే బదులు లెక్కకు మిక్కిలిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది. ఇది సరికాదని హితవు చెప్పిన శ్రేయోభిలాషులను దూరంగా పెట్టింది. మీడియాపై కక్ష కట్టి కేసులు పెట్టి సతాయించింది. 'నాతో ఏకీభవించకపోతే నువ్వు నా శత్రువువే' అనే భావం ఏర్పరచుకుని, తటస్థులను దూరం చేసుకుని, వందిమాగధులనే తన చుట్టూ ఏర్పరచుకుంది. అందరూ సాగిలపడి సాష్టాంగ నమస్కారాలు చేసేట్లా చేసి తన అహం చల్లార్చుకుంది.

ఆమె ఏం చేసినా చెల్లింది. చెల్లనప్పుడు బాధలు పడింది, సహించింది, తల వంచుకుని పారిపోలేదు. నిల్చి పోరాడింది. ప్రజలు తన పక్షాన వుండేట్లు చూసుకుంది. ఆ మేరకు వారి నాడి పట్టుకుంది. ఆమెకు ఎమ్జీయార్‌ వారసత్వం వచ్చి ఒళ్లో పడలేదు. తనంతట తనే సాధించింది. తన వారసత్వాన్ని కూడా ఎవరికీ అప్పగించకుండా పోయింది. తన పార్టీ సభ్యుల్లో ఎవరు బలవంతులో వారే నిలుస్తారు, లేకపోతే పడిపోతారు అనుకుంది. ఆమెకు నా అన్నవారంటూ ఎవరూ లేరు, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి తేలేదు. అందువలన వారికి వారసత్వం అప్పగించాలన్న తపన, వారికి అడ్డువచ్చేవారిని తొలగించాలనే తహతహ లేవు. తన తర్వాత పార్టీ నాశనమైనా చింత లేదు. 

ఒకసారి ఎన్టీయార్‌ అన్నారు – 'టిడిపి నాతో పుట్టింది, నాతోనే పోతుంది' అని. కానీ ఆయనతో పోలేదు. ఆయన వుండగానే పార్టీని అల్లుడు లాగేసుకున్నాడు. ప్రతిఘటిస్తూనే ఎన్టీయార్‌ వెళ్లిపోయారు. దాంతో ఆయన వర్గం అధికారవర్గంలో కలిసిపోయింది. ఆ మార్పును ప్రజలు ఆమోదించారు. టిడిపి అంటే చంద్రబాబే అంటున్నారు. ఇప్పుడు ఆయన వారసుడెవరంటే లోకేశ్‌ అంటున్నారు. నందమూరి వారసత్వం నారా వారసత్వంగా మారిపోతోంది. ఇందిర వారసత్వ రాజకీయాలను విమర్శిస్తూ ప్రభవించిన ప్రాంతీయపార్టీలన్నీ యీ బాటలోనే నడిచాయి. తమిళనాడులో డిఎంకెది అదే పంథా. అయితే జయలలిత ఎమ్జీయార్‌కు బంధువు కాదు. వారసత్వం ఆటోమెటిక్‌గా రాలేదు. ఇప్పుడు జయలలిత వారసత్వం పన్నీరు శెల్వానికి కాని, శశికళకు కాని తనంతట తానే రాదు. ప్రస్తుతానికి పాలనను పన్నీరు శెల్వం, పార్టీని శశికళ చూసుకోవచ్చు. ఇద్దరూ కలిసి జయలలిత విగ్రహాలను అడుగడుగునా ప్రతిష్ఠాపించవచ్చు. అంత మాత్రం చేత జనాలు నమ్మేయరు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. అన్నా డిఎంకెలో జయలలిత వంటి కరిజ్మా వున్న వ్యక్తి ప్రస్తుతానికి లేరు. ఇకపై ఎవరైనా ఉద్భవిస్తారేమో తెలియదు.

అప్పటిదాకా ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని కూచుంటాయా? కూచోవు. ఏదో ఒకటి చేస్తాయి. పన్నీరు శెల్వం నాయకత్వం సహించని ఎమ్మెల్యేలలో ఓ 20 మందిని డిఎంకె ప్రలోభపెట్టగలిగితే చాలు. 135 మందిలో 20 మంది దొరక్కపోరు. వాళ్లు ఎడిఎంకె (జయలలిత) పేరుతో వేరే కుంపటి పెట్టి, ప్రభుత్వాన్ని కూలదోయవచ్చు. ఆ తర్వాత స్టాలిన్‌ గవర్నరు వద్దకు మహజరు పట్టుకుని తయారవుతాడు. ఈ చీలిక గ్రూపు అతనికి మద్దతు యిస్తుంది. కొన్నాళ్లకు ఆ పార్టీలో కలిసిపోతుంది. అధికారాన్ని పోగొట్టుకున్న పక్షం వూరికే కూర్చోదు. కేంద్రంలో వున్న బిజెపిని ఆశ్రయించి యీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, గవర్నరు పాలన విధించి, మళ్లీ ఎన్నికలు పెట్టమంటాయి. 

చివరకు ఏది ఎలా అవుతుందో ఎవరూ యిప్పుడే చెప్పలేరు. ఒకటి మాత్రం వాస్తవం. తమిళనాడులో యిప్పుడు బలమైన నాయకుడు స్టాలిన్‌. రాజకీయాల్లో, పార్టీ నిర్వహణలో, పాలనాసామర్థ్యంలో అందె వేసిన చేయి. తండ్రిలాగ, జయలలిత లాగ మరీ కక్షపూరిత రాజకీయాలు నడపడు కాబట్టి మీడియా కూడా అతని పట్ల ఆదరంగానే వుంటోంది. కరుణానిధి బతికి వుండగానే అతని ప్రత్యర్థులిద్దరు – ఎంజీఆర్‌, జయలలిత రాలిపోయారు. మళ్లీ అధికారంలోకి వచ్చి జయలలితను జైల్లో పెట్టాలన్న లక్ష్యం నెరవేరలేదు. తనపై వున్న అవినీతి కేసు సుప్రీం కోర్టులో పెండింగులో వుండగానే జయలలిత లోకం విడిచి వెళ్లిపోయింది. కరుణానిధికి యిప్పుడేదైనా లక్ష్యం మిగిలి వుందంటే అన్నాడిఎంకెను ఖండఖండాలుగా చీల్చి, మొత్తాన్ని డిఎంకెగా చేసి స్టాలిన్‌ చేతిలో పెట్టడమొకటే. కానీ విడిపోయిన 40 ఏళ్లకు మళ్లీ కలవడం సుదూరస్వప్నం. ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరు ఎడిఎంకెను సజీవంగా వుంచుతారు. ఎమ్జీయార్‌, జయలలితల పేర్లు జపిస్తూ వుంటారు. ప్రజల్లో మనసుల్లో వాళ్లు పాతుకుపోయారు కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుందామని చూసేవారు తప్పక వుంటారు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2016)

[email protected]