ఎన్నికలలో ఎన్నో వాగ్దానాలు చేస్తారు. పదవిలోకి వచ్చాక ఎన్ని గుర్తుంటాయో, ఎన్నిటికి మోక్షమిస్తారో ఎవరికీ తెలియదు. భారతీయులు వీసాల పేరుతో వలస వచ్చి, స్థానికుల ఉద్యోగాలను కాజేయడాన్ని నిరోధిస్తానంటూ ప్రచారం చేసుకుని, భారత ఉద్యోగుల యాసను సైతం వెక్కిరించి నెగ్గిన ట్రంప్ విజయం సాధించగానే గతవారం పుణెలోని తన ట్రంప్ టవర్ భాగస్తులతో సమావేశం కావడంతో ప్లేటు ఫిరాయించాడంటూ విమర్శలు వచ్చాయి. అది చాలనట్లు ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో 150 మిలియన్ డాలర్ల ట్రంప్ ప్రాజెక్టులోని భాగస్వామి ఐన జోస్ ఆంటోనియోను ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అమెరికాకు వాణిజ్య, ఆర్థిక వ్యవహారాల రాయబారిగా పంపుతానని ప్రకటించడంతో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత కూడా వ్యాపారస్తుడిగానే వుంటున్నాడని ఎత్తి చూపారు కొందరు. వీటన్నిటికి సమాధానమా అన్నట్లు మంగళవారం నాడు మాట్లాడుతూ ట్రంప్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ (టిపిపి) నుండి అమెరికా వైదొలగుతుందని ప్రకటించడంతో బాటు వీసా దురుపయోగాల గురించి కూడా విచారణ జరిపిస్తానన్నాడు. ''వ్యాపారం, ఎనర్జీ, జాతీయ భద్రత, రెగ్యులేషన్, ఇమ్మిగ్రేషన్, ఎథిక్స్ రిఫార్మ్స్ అనే ఆరు అంశాలపైనే తొలిరోజుల్లో నా ప్రభుత్వపు ఫోకస్ వుంటుందని ప్రకటించాడు.
వాణిజ్యంలో చైనాను ఏకాకి చేయడానికై పసిఫిక్ మహా సముద్రపు అంచుల్లో వున్న 11 దేశాలతో (కెనడా, పెరు, మెక్సికో, చిలీ, వియత్నాం, సింగపూర్, బ్రూనీ, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్) కలిసి ఒబామా ఏర్పాటు చేసినదే టిపిపి. ఈ విధంగా ప్రపంచవాణిజ్య రంగాన్ని అమెరికాయే శాసిస్తుంది తప్ప చైనా శాసించటం లేదని అందరికీ తెలిసి వస్తుందని ఒబామా అభిప్రాయం. 'దీనివలన అమెరికన్ కంపెనీలు ఆ యా దేశాలకు నిధులను, ఉద్యోగాలను తరలించుకుపోవడం వలన యిది మన దేశానికి వినాశకరంగా పరిణమించింది. దీనిలోంచి బయటకు వచ్చేసి ప్రతిదేశంతోను విడివిడిగా ఒప్పందాలు చేసుకుంటూ అమెరికా కంపెనీలను, ఉద్యోగాలను వెనక్కి రప్పించడమే నా లక్ష్యం' అంటాడు ట్రంప్. దీన్ని డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి హిల్లరీతో పోటీ చేసి ఓడిపోయిన బెర్నీ శాండర్స్ మద్దతు ప్రకటించాడు. 'ఏ చర్య చేపట్టినా నేను చూసేది ఒక్కటే – ఉక్కు ఉత్పాదన కానీయండి, కార్ల తయారీ కానీయండి, వైద్యం కానీయండి, వస్తూత్పత్తి అయినా, పరిశోధన అయినా అది మన దగ్గర జరగాలి. అంతే!' అని ట్రంప్ ఘంటాపథంగా చెప్తున్నాడు.
'బొగ్గు, షేల్ గ్యాస్ రంగాల్లో చాలా నిబంధనలు పెట్టి యిక్కడ ఉద్యోగాలను నిర్మూలించారు. నేను ఆ నిబంధనలను సాధ్యమైనంతవరకు తగ్గిస్తాను. సైబర్ ఎటాక్స్‌కు గురై మన అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తింటోంది. దేశరక్షణ ముఖ్యం. ఎటాక్స్‌కు గురి కాకుండా దేశాన్ని కాపాడతాను. తొలి 100 రోజుల్లో నేను యివన్నీ చేస్తాను. చేరిన మొదటి రోజే చేపట్టే పని ఎథిక్స్ (నైతికత) గురించి! ప్రభుత్వోద్యోగాల నుండి ఎగ్జిక్యూటివ్ అఫీషియల్స్ బయటకు వచ్చిన ఐదేళ్ల వరకు లాబీయిస్టులుగా మారడంపై నిషేధం విధిస్తాను. (మన దగ్గర ప్రభుత్వం నుంచి రిటైరైన మాజీ అధికారులు కంపెనీల తరఫున లయజనింగ్ వర్క్ పేరుతో వారి పాత పరిచయా లుపయోగించి పలుకుబడితో, లంచాలతో కంపెనీలకు పనులు చేసి పెట్టి డబ్బు సంపాదిస్తారు. అమెరికాలో దాన్ని లాబీయింగ్ అంటారు. అది చట్టబద్ధమైనది కూడా). విదేశీ ప్రభుత్వాల తరఫున లాబీయింగ్ చేయడంపై జీవితకాల నిషేధం పెడతాను.' అంటున్నాడు.
ఇక ఎచ్1బి వీసాల విషయానికి వస్తే – ఏటా నైపుణ్యం కల 85,000 మందిని ఎచ్1బి వీసాల ద్వారా అమెరికా తన దేశంలోకి రానిస్తుంది. వీరిలో 20 వేల మంది ఉన్నత విద్య అభ్యసించే సాంకేతిక నిపుణులు కాగా, తక్కిన 65 వేలు ఉద్యోగులకై యిస్తారు. వీటికై కంపెనీలు లక్షల్లో అప్లయి చేస్తాయి. ఈ ఏడాది యిప్పటికే 2.36 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వారు లాటరీ తీసి 85 వేలు ఎలాట్ చేస్తారు. ఈ వీసాలు కంపెనీల పేర యిస్తారు. ఏ ఉద్యోగానికై యిస్తున్నారో కూడా చెప్తారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు మంచి నైపుణ్యం వున్న ఉద్యోగులను, హెచ్చు జీతాలిచ్చి తీసుకుంటారు. వీసాలిచ్చి తెప్పించుకుంటారు. వారికి గ్రీన్‌కార్డు (పౌరసత్వం) వచ్చేందుకు సాయపడతారు కూడా. ఇన్ఫోసిస్, టిసిఎస్ వంటి ఇండియన్ కంపెనీలు యీ వీసాలను తక్కువ జీతాలకు పనిచేసే ఉద్యోగులను తెప్పించుకోవడానికి ఉపయోగించు కుంటున్నాయి. వారిలో చాలామందికి గ్రీన్‌కార్డు రావటం లేదు కూడా. అమెరికన్ కంపెనీలు తమ పని చేయడానికి యీ కంపెనీలకు కాంట్రాక్టు యిచ్చి ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ఇవి నైపుణ్యం లేని ఉద్యోగులను కూడా యీ ఎచ్1బి వీసాల కింద తెప్పిస్తున్నాయని ఆరోపణలున్నాయి. నైపుణ్యం అనే దాన్ని నిర్వచించడంలో కొంత అస్పష్టత వుంది. దాన్ని వినియోగించుకుని యీ కంపెనీలు తక్కువ జీతాలిచ్చి తమ ఉద్యోగులచే పనిచేయించి లాభాలు సంపాదిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. 2013లో ఇన్ఫోసిస్ యిలాటి కేసులో 34 మిలియన్ డాలర్లు చెల్లించవలసి వచ్చింది. ఇటువంటి దుర్వినియోగంపై లేబరు డిపార్టుమెంటు ద్వారా విచారణ జరిపిస్తానని ట్రంప్ చెప్తున్నాడు. ఈ లాటరీ సిస్టమ్‌కు స్వస్తి చెప్పి, పెద్ద జీతాల ఉద్యోగాలిచ్చే కంపెనీలకు వీసాలు జారీ చేసే పద్ధతి పెట్టాలని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ కోరుతోంది.
ఈ వీసాలకు బద్ధవిరోధి ఐన జెఫ్ సెషన్స్‌ను ట్రంప్ ఎటార్నీ జనరల్‌గా నియమిస్తున్నాడు. జెఫ్ గత ఏడాది సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ కంపెనీ ఎచ్1బి వీసాలను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్‌ను కోరాడు. ఆ లేఖపై డెమోక్రాట్ పార్టీకి చెందిన బెర్నీ శాండర్స్, మరో యిద్దరూ కూడా సంతకం పెట్టారు. న్యూయార్క్‌కు చెందిన డెమోక్రాటిక్ సెనేటరు చుక్ షూమర్ కూడా యీ వీసాలకు వ్యతిరేకి. అతన్ని డెమోక్రాటిక్ పార్టీ సెనేట్‌లో పార్టీ నాయకుడిగా నియమించింది. శాండర్స్ ఎలాగూ వ్యతిరేకిస్తున్నాడు. అందువలన యీ వీసాల విషయంలో ట్రంప్‌కు ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ నుంచి కూడా మద్దతు రావచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2016)