మొత్తానికి అల్లు అరవింద్ అనుకున్నంతా సాధించారు.తన ధృవ సినిమా కోసం సింగం 3 సినిమాను ఒక వారం వెనక్కు జరిపించారు. అల్లు అరవింద్ గత రెండు మూడు వారాలు గా ధృవ సినిమా విషయంలో చాలా సైలెంట్ గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు చాలా వదంతులు వినిపించాయి. సింగం 3 నిర్మాత జ్ఞాన్ వేల్ రాజాతో అరవింద్ గారికి అన్ని రకాల బంధాలు వున్నాయి.
పైగా నైజాంలో గీతా, దిల్ రాజు, సీడెడ్ లో ఎన్ వి ప్రసాద్, ఆంధ్రలో దిల్ రాజు, గీతా ల దగ్గర వున్న థియేటర్లు సింగం 3 కి కావాలి అనుకుంటే కాస్త ఇబ్బంది తప్పదు. అందువల్లే ముందుగానే సింగం 3 విడుదల వాయిదా ను డిసైడ్ చేసుకునే, ధృవ డేట్ ప్రకటించారు. ఇప్పుడు వారం దగ్గరకు వచ్చాక, సింగం విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.
అంతకు ముందుగా దిల్ రాజుతో కూడా అరవింద్ తన సంబంధాలు వాడి, నాని నటించిన నేను లోకల్ ను వాయిదా వేయించారు. దాంతో సింగం 3 కి డేట్ 23 ఫిక్సయింది.అక్కడి నుంచి మూడు వారాల పాటు పెద్ద సినిమా ఏదీ వుండదు. కానీ ఎటొచ్చీ పాపం, 23 డేట్ ను నమ్ముకున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్, మీలో ఎవరు కోటీశ్వరుడు, మెట్రొ లాంటి మీడియం సినిమాల పరిస్థితి ఏమిటో? పెద్ద నిర్మాతలు సిండికేట్ అయి, తమ తమ సినిమా ల డేట్ల ను తమ చిత్తానికి మార్చేస్తుంటే, ఇలా మీడియం, చిన్న సినిమాలు అగచాట్లు పడాల్సిందేనేమో?