‘వంగవీటి’ ఆగిపోతుందా.!

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'వంగవీటి' సినిమా ఆడియో విడుదల వేడుకను విజయవాడలో ప్లాన్‌ చేసిన విషయం విదితమే. దివంగత కాంగ్రెస్‌ నేత వంగవీటి మోహనరంగా జీవిత చరిత్రను 'వంగవీటి' పేరుతో వర్మ తెరకెక్కిస్తున్న…

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'వంగవీటి' సినిమా ఆడియో విడుదల వేడుకను విజయవాడలో ప్లాన్‌ చేసిన విషయం విదితమే. దివంగత కాంగ్రెస్‌ నేత వంగవీటి మోహనరంగా జీవిత చరిత్రను 'వంగవీటి' పేరుతో వర్మ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. వంగవీటి మోహనరంగా కాంగ్రెస్‌ నేత మాత్రమే కాదు, విజయవాడలో ఒకప్పుడు కులాల కుంపట్లలో కాపు నేతగా ఎదిగిన వ్యక్తి. 

బెజవాడ కులాల కుంపట్లు, రాజకీయ రచ్చ, వీటన్నిటికీ తోడు అక్కడ ఫ్యాక్షన్‌ తరహాలో పెరిగిన అదో టైపు మాఫియా.. ఇవన్నీ ఒకప్పుడు బెజవాడకి కంటిమీద కునకు లేకుండా చేసేశాయి. ఆ గలాటాలోనే వంగవీటి మోహనరంగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచీ ఇప్పటిదాకా వంగవీటి మోహనరంగా పేరుతో అయితే రాజకీయ రచ్చ, లేదంటే కులాల రచ్చ.. ఏదో ఒక రూపంలో.. ఎలాగో ఒకలా జరుగుతూనే వుంది.. తక్కువ, ఎక్కువ.. అన్న తేడా అంతే. 

ఇక, 'వంగవీటి' సినిమాలో వర్మ ఏం చూపిస్తాడు.? అన్నది సస్పెన్స్‌గా మారింది. చరిత్రను దర్శకుడు వర్మ వక్రీకరిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా తనయుడు, వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు. దాంతో, 'వంగవీటి' సినిమా మరోమారు వివాదాల్లోకెక్కింది. అయితే, ఇలాంటి కేసుల్లో ఎలా వాదించి, నెగ్గాలో వర్మకి బాగా తెలుసు. అసలు తానేం చూపించాలనుకుంటున్నానో తెలియకుండా, సినిమా విడుదల కాకుండా, సినిమాలో ఏదో వుందని ఆరోపించడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న వర్మ వైపు నుంచి చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. 

అయితే, అక్కడ కోర్టుకెక్కింది స్వయానా వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ గనుక, 'వంగవీటి' సినిమాకి లీగల్‌ చిక్కులు తప్పకపోవచ్చు. 'రక్తచరిత్ర' సినిమా విషయంలో వర్మ ఏం చేశాడో చూశాం. చరిత్ర పేరుతో వర్మ తనకు నచ్చింది తీసుకుంటూ పోయాడన్న విమర్శలున్నాయి. ఇప్పుడు 'వంగవీటి' సినిమా విషయంలోనూ అదే జరిగేందుకు అవకాశాలెక్కువ.