తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి విశాఖ ఇపుడు మంచు కోటలా మారిపోతోంది. సరిగ్గా కార్పొరేషన్ ఎన్నికల వేళ విశాఖలో పసుపు తమ్ముళ్ళు అధికార పార్టీలోకి బిగ్ జంప్ చేస్తున్నారు. బిగ్ షాట్స్ తో పాటు రాజకీయాలను అన్ని రకాలుగా మలుపు తిప్పగలిగే నేతలు ఒక్కసారిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడంతో సైకిల్ కి అన్ని పార్టులూ ఊడిపోతున్న పరిస్థితి.
విశాఖలో బలమైన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత కాశీవిశ్వనాధ్ టీడీపీకి గుడ్ బై కొట్టే వైసీపీ జెండా కప్పుకోవడం సంచలనంగా మారింది. రూరల్ జిల్లాతో పాటు సిటీలో మంచి పట్టున్న నేతగా కాశీని చెబుతారు.
ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు కావడం మరో విశేషం. కాశీ రాకతో వైసీపీ మరింత బలపడగా టీడీపీకి భారీ షాక్ తగిలింది అంటున్నారు. ఇక మరింతమంది నాయకులు కూడా రానున్న రెండు మూడు రోజుల్లో అధికార పార్టీ వైపునకు వస్తారని అంటున్నారు.
ఈ పరిణామాలు చూస్తూంటే ఢీ అంటే ఢీ అన్నట్లుగా విశాఖ మేయర్ సీటుకు పోటీ ఉంటుంది అనుకున్న చోట వైసీపీకి ఏకపక్షంగా విజయం దక్కుతుందా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా మారుతున్న రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి.