ఏదన్నా సినిమా సెన్సార్ అయ్యిందంటే, దాంతోపాటుగా 'సెన్సార్ టాక్' బయటకు వచ్చేస్తుంది. అయితే, సెన్సార్ టాక్‌ని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు. సూపర్ హిట్టయ్యే సినిమాలకి సెన్సార్ తర్వాత వచ్చే టాక్ దారుణంగా వుంటుంది. అదే చెత్త సినిమాల్ని తీసుకుంటే, సెన్సార్ టాక్ అద్భుతహ అన్పించేలా వుంటుంది. నిజానికి, సెన్సార్ నుంచి ఏదన్నా సినిమాకి విడుదలకు ముందు అధికారికంగా ఎలాంటి టాక్ స్ప్రెడ్ అవదనుకోండి.. అది వేరే విషయం.
సినిమా ప్రమోషన్ కోసం జరిగే జిమ్మిక్కుల్లో ఇది కూడా ఒకటి. డిసెంబర్ 9న 'ధృవ' సినిమా విడుదల కానుండగా, సినిమాకి అప్పుడే సెన్సార్ అయిపోయింది. యు/ఎ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఇకనేం, సెన్సార్ టాక్ అదిరిపోయిందంటూ గాసిప్స్ చక్కర్లు కొట్టేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా వుంటుందట, సెకెండాఫ్ ఇంకా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుందట.. క్లాస్ టచ్‌తో వుంటూనే, మాస్‌ని అలరించేలా వుంటుందట.. అంటూ ఆ గాసిప్స్‌లో రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 'ధృవ' తమిళ 'తని ఒరువన్'కి రీమేక్. సో, అందులో కంటెంట్ ఏంటి.? అన్నది అందరికీ తెల్సిన విషయమే. కొత్తగా ఏం మార్పులు చేశారు.? అన్నదే ఇక్కడ కీలకం. ఏదిఏమైనా, డిసెంబర్ 9న 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రానున్న దరిమిలా, అప్పటిదాకా ఈ ఊహాగానాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపడం ఖాయం.