గౌతమీ పుత్ర శాతకర్ణి ఆంధ్రుల చరిత్ర ఆలంబనగా తెరకెక్కుతున్న చిత్రం. దర్శకుడు క్రిష్-హీరో బాలయ్య కాంబినేషన్ లో తయారవుతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు ఈ విషయమై క్లారిటీ రాకపోవచ్చు కానీ, సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందుగానో, విడుదలైన తొలి వారంలోనో ఈ విధంగా పన్ను మినహాయింపు ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గౌతమీ పుత్ర శాతకర్ణి తెలుగు పాలకుడు.
అమరావతిని రాజధానిగా ఎంచుకున్న ఆంధ్ర రాష్ట్రం, అలాంటి అమరావతి చరిత్రను, పాలకుడి కథను తెరకెక్కించినపుడు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం పెద్దగా ఎవరికీ అభ్యంతరం కాదు. అయితే ఇందుకు ముందుగా సినిమా యూనిట్ నే ప్రభుత్వాన్ని కోరాల్సి వుంటుంది. ఆ మేరకు సినిమా విడుదలకు ముందు ముఖ్యమంత్రికి, ఆయన మంత్రి వర్గ సహచరులకు స్పెషల్ గా స్క్రీనింగ్ వేసి, పన్ను మినహాయింపు కోరాలని శాతకర్ణి యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే మరి తెలంగాణలో కూడా ఈ విధమైన వెసులుబాటుకు అవకాశం వుంటుందా? ఆ మేరకు యూనిట్ దరఖాస్తు చేస్తుందా? అన్నది ఇంకా తెలియదు. తెలుగు పాలకుడి కథతో తీసిన సినిమాకు వినోదపు పన్ను ఇవ్వడానికి బహుశా రెండో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కు కూడా పెద్దగా అభ్యంతరం వుండదేమో? పైగా కేసిఆర్ తో హీరో బాలకృష్ణ మంచి సంబంధాలే నెరపుతున్నారు కూడా.