బోయపాటి శ్రీను సినిమాలు చాలా రిచ్‌గా వుంటాయి. ఆ గ్రాండియర్ కోసం ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడడు బోయపాటి. హీరో బిజినెస్ రేంజ్ ఏంటి.? అని ఆలోచించకుండా సినిమాకి డబ్బులు ఖర్చు చేయించేస్తాడనే విమర్శ బోయపాటి మీద వుంది. ఎలాగైతేనేం, పక్కా మాస్ డైరెక్టర్ కావడం, లక్కు తోడవడం.. వెరసి బోయపాటి హవా కొనసాగుతోంది.
ఇక, ఇప్పుడు బోయపాటి – బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ ఎంతట.? అంటే, సింపుల్‌గా 50 లెక్క చెబుతున్నారు టాలీవుడ్ సినీ జనాలు. ఆ స్థాయిలో ఖర్చు లేకపోతే, బోయపాటి శ్రీను సినిమా చేయడం జరగదన్న ప్రచారం జరుగుతోంది. నిజమేనా.? బెల్లంకొండ శ్రీనివాస్‌తో అంత బడ్జెట్ వర్కవుటయ్యేనా.? అనంటే, 'ఏమో గుర్రం ఎగరావచ్చు..' అనే సెటైర్లు విన్పిస్తున్నాయి.
నిజానికి బెల్లంకొండ – బోయపాటి కాంబినేషన్ ఎప్పుడో ఫిక్సయ్యింది. కానీ, అలా అలా ఈ కాంబినేషన్ లేటవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోతోంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్, ఐటమ్ సాంగ్‌లో ఓ టాప్ హీరోయిన్:.. విదేశాల్లోనూ, కళ్ళు చెదిరే సెట్స్‌లోనూ ఫైట్స్, హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్స్.. ఇలా సినిమా గురించి చాలా చాలానే చెబుతున్నారు.
తొలి సినిమా 'అల్లుడు శీను' నిర్మాణం కోసం చేసిన ఖర్చు సంగతెలా వున్నా, పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చు అందర్నీ విస్మయానికి గురిచేసింది. వంద కోట్లయినాసరే 'మా అబ్బాయి కోసం' ఖర్చుచేయడానికి సిద్ధంగా వున్నానని అప్పట్లో బెల్లంకొండ సురేష్ పుత్రోత్సాహం చాటుకున్న విషయం విదితమే. కానీ, ఆ సినిమా నిర్మాతకి చేదు ఫలితాన్నే ఇచ్చింది.. బడ్జెట్ తడిసి మోపెడయిపోయింది మరి. ఇప్పుడు 50 ప్లస్సూ.. అంటే, అదీ బోయపాటితో అంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.