ఈ మధ్య నిర్మాతలు భలే కొత్త స్ట్రాటజీలు వేస్తున్నారు. అసలే డిస్ట్రిబ్యూటర్లు ముదుర్లు అనుకుంటే, వీళ్లు దేశముదుర్లు అయిపోతున్నారు. చిన్న సినిమా తీయడం దాన్ని కాస్త అబ్ నార్మల్ రేటుకు ఎవరో కొన్నారని వార్తలు వదలడం. దాంతో ఆ సినిమా మీద కాస్త బయ్యర్లలో ఆసక్తి పెరగడం. అక్కడికీ ఇంకా బయ్యర్లు ముందుకు రాకపోతే, ఏదో ఒక ఏరియా మొహమాట పెట్టి, ఎవరో కొన్నట్లు ప్రకటన చేయించడం. ఇలా మార్కెటింగ్ టెక్నిక్ లు వాడేస్తున్నారు. దీంతో బయ్యర్లు బుట్టలో పడిపోతారు అనుకుంటే అనుమానమే. కానీ ఓ రేంజ్ సినిమాలయితే మాత్రం ఈ స్ట్రాటజీకి బుక్కయిపోతున్నారు.
ఆ మధ్య కొంతమంది సినిమా సెలబ్రిటీలు అందరూ కలిసి ఇలాగే ఓ సినిమాను ప్రమోట్ చేసారు. ఎవరో ఏకంగా 12 కోట్లకు కొనేసినట్లు క్రియేట్ చేసారు. దాంతో చకచకా బిజినెస్ నడిచింది. సినిమా ఢమాల్. బయ్యర్లు కుదేల్. ఈ మధ్య మళ్లీ ఇదే స్ట్రాటజీ ఓ చిన్న సినిమాకు కూడా వేసారని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాకు పెద్దగా స్టార్ కాస్ట్ లేకుండానే మీడియం సినిమా రేటుకు ఎవరో కొన్నట్లు ఫిక్స్ చేయగలిగారు. అక్కడితో ఆగకుండా ఓ ఏరియాకు భారీ డిస్ట్రిబ్యూటర్ కొనేసారని మరో మాట.
కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు వేరుగా వున్నాయి. ఇవన్నీ సినిమాకు హైప్ తీసుకువచ్చి, బయ్యర్ల చేత కొనిపించే స్ట్రాటజీ అన్నది ఆ గుసగుసల సారాశం. అయినా మార్కెటింగ్ అంటే అంతేగా..లేనిది ఉందని చెప్పి అమ్మేయడం.