టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అంశంపై ‘ముంబై మిర్రర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రత్యూష మాట్లాడిన చివరి ఫోన్ కాల్స్ కు సంబంధించిన వివరాల ఆధారంగా ఆ పత్రిక సంచలనాత్మక విషయాలను పేర్కొంది. ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆమెను తార్చే యత్నం చేశాడని ఆ ఫోన్ కాల్స్ ద్వారా స్పష్టం అవుతోందట. ఈ విషయంలో రాహుల్ ను ఆమె తీవ్రంగా నిందించిందని ఆ కథనంలో పేర్కొన్నారు.
“నన్ను నేను అమ్ముకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. నేను నటించడానికి వచ్చాను. నేను పని చేసుకోవడానికి వచ్చాను. నువ్వు నన్నుఎక్కడ పెడుతున్నావు.. నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు..’’అంటూ ప్రత్యూష ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
“ఆ ఫోన్ కాల్స్ సంభాషణలు అన్నీ ప్రత్యూష మరణానికి కొంచెం ముందుగా జరిగినవి. వాటి ప్రకారం ప్రత్యూష చేత వ్యభిచారం చేయించాలని రాహుల్ ప్రయత్నించాడని స్పష్టం అవుతోంది.’ అని ప్రత్యూష తరపు న్యాయవాది చెప్పారు. ఆ సంభాషణల్లో ఈ విషయాలను ఆమె స్పష్టంగా పేర్కొన్నదని ఆయన వివరించారు.
అయితే రాహుల్ మాత్రం ఇది వరకూ ప్రత్యూష తల్లిదండ్రులపై ఆరోపణలు చేశాడు. ఆమె ఎలాగైనా డబ్బు సంపాదించాలని వారు కోరుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించాడు. అయితే ఫోన్ కాల్స్ ఆధారంగా మాత్రం అతడే ఆమెను ఈ విధంగా హింసించాడని స్పష్టం అవుతోంది. ఆమెను మానసికంగా చిత్రవధ చేసి.. ఆత్మహత్యకు పురి కొల్పాడని.. తెలుస్తోంది.