రానా సినిమాకు 15 కోట్ల బడ్జెట్ నా?

రానా..బాహుబలికి ముందు..వెనుక పెద్ద స్టార్ డమ్  వున్న హీరో అయితే కాదు. తెరపైన కన్నా, సోషల్ మీడియాలోనో, సినీ మీడియాలోనో పాపులారిటీ ఎక్కువ. గళ్లా పెట్టిలో కన్నా గ్యాసిప్ కాలమ్స్ లోనే హడావుడి ఎక్కువ.…

రానా..బాహుబలికి ముందు..వెనుక పెద్ద స్టార్ డమ్  వున్న హీరో అయితే కాదు. తెరపైన కన్నా, సోషల్ మీడియాలోనో, సినీ మీడియాలోనో పాపులారిటీ ఎక్కువ. గళ్లా పెట్టిలో కన్నా గ్యాసిప్ కాలమ్స్ లోనే హడావుడి ఎక్కువ. బాహుబలి సినిమాతో నేషనల్ మూవీ గోయర్స్ కు పరిచయం అయితే అయి వుండొచ్చు. 

కానీ, సోలోగా సినిమాను గట్టెక్కించేంత విషయం వుందా అన్నది ఇప్పటి దాకా క్లారిటీగా తేలలేదు. అలాంటి నేపథ్యంలో రానాతో కలిసి తేజ డైరక్షన్ లో సినిమా తయారవుతోంది. దీనికి దాదాపు 15 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. శాటిలైట్ తో కలుపుకుని అన్నా కనీసం 16 నుంచి 17 కోట్ల బిజినెస్ చేయాలి. మరి ఈ రేంజ్ బిజినెస్ చేస్తుందా ఆ సినిమా అన్నది అనుమానం. 

ఎందుకంటే దీనికి డైరక్టర్ సపోర్ట్ కూడా తక్కువ. తేజకు సరైన హిట్ అన్నది వచ్చి ఏళ్లు దాటింది. ఆ మధ్య కోటిన్నర, రెండు కోట్లతో సినిమా తీస్తేనే నిర్మాతల చేతులు కాలాయి.  మరి ఏ ధైర్యంతో సినిమాను చేస్తున్నారో కొత్త నిర్మాతలు ప్లస్ సురేష్ బాబు కలిసి. 

అయితే యూనిట్ వర్గాల వెర్షన్ వేరుగా వుంది. బాహుబలి క్రేజ్ తో హిందీ డబ్బింగ్ రైట్స్, అదర్ లాంగ్వేజెస్ రైట్స్, అన్ని లాంగ్వేజ్ ల శాటిలైట్ రైట్స్ నే చాలా వరకు ఖర్చు కవర్ చేసేస్తాయని అంచనా వేస్తున్నారట.

ఇక థియేటర్ రైట్స్ ను చూసుకుంటే లాభాలే కానీ రిస్క్ వుండదంటున్నారు. సురేష్ బాబు కూడా నిర్మాతల్లో ఒకరు కాబట్టి, స్క్రిప్ట్ మీద గట్టి నమ్మకమే వుందటున్నారు. ఏదైనా రానా సోలో హీరోగా సెటిల్ కావడం అన్నది ఈ సినిమాతో కానీ, లేదా పివిపి కూడా భారీగా కోట్లు ఖర్చు చేసి తీస్తున్న ఘాజీతో కానీ తేలిపోతుంది.