ఎంత ముద్దుగా వున్నా, పందిని పందే అంటారు. అలాంటి ఓ సీమ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమా స్టార్ట్ చేయడమే కాకుండా పూర్తి చేసానని ఆ మధ్య తెగ హడావుడి చేసారు నటుడు, దర్శకుడు రవిబాబు. కానీ మరి ఆ తరువాత దాని ఊసులేదు. వీలయినంత తక్కువ బడ్జెట్ తో, చాలా వెల్ ప్లాన్డ్ గా సినిమా తీయడంలో ప్రస్తుతానికి ఇండస్ట్రీలో రవిబాబును మించిన వారు లేరు.
అందువల్ల ఈ సినిమాను కూడా వీలయినంత తక్కువలోనే ఫినిష్ చేసి వుంటాడు. మరి ఎక్కడ బ్లాక్ పడినట్లు? సిజి వర్క్ లేటవుతోందా? లేక సరైన డేట్ కోసం చూస్తున్నారా? అవన్నీ కాక, పంది హీరోగా సినిమా అంటే కొనేవాళ్లు రావడం లేదా? నిజానికి సురేష్ బాబుతో మంచి సంబంధాలున్న రవిబాబు అమ్మకుండా నేరుగా విడుదల చేయచ్చు. కానీ అలా అయితే చేతికి మట్టేం ఖర్మ ఏకంగా బురదే అంటుకునే ప్రమాదం వుంది. అందుకే లేటవుతోందేమో?