ఓ సినిమా సాధించిన విజయం కన్నా తన తదుపరి సినిమా విజయం పెద్దదిగా వుండాలనే ఏ హీరో అయినా అనుకుంటాడు. హీరో మాత్రమే కాదు, దర్శకులైనా, నిర్మాతలైనా, హీరోయిన్లయినాసరే ఇదే ఆలోచనతో వుంటారు. ఇందులో వింతేమీ లేదు. అల్లు అర్జున్ కూడా, తన తదుపరి సినిమా, ఇంతకు ముందు వచ్చిన సినిమా కన్నా పెద్ద విజయం సాధించాలని అనుకోవడం వింతెలా అవుతుంది.?
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు' టాక్‌కి భిన్నంగా మంచి వసూళ్ళనే అందుకుంది. ఈ మధ్యన వస్తోన్న చాలా సినిమాల పరిస్థితి ఇదే. 40 కోట్లు కొన్నాళ్ళ క్రితం వరకూ బిగ్ టాస్క్. చరణ్ నటించిన అన్ని సినిమాలూ (తొలి చిత్రం 'చిరుత', మూడో చిత్రం 'ఆరెంజ్' మినహా) అన్నీ 40 కోట్ల మార్క్ దాటినవే. సక్సెస్ ఫెయిల్యూర్ అన్న తేడా లేకుండా, ఆ సినిమాలు 40 కోట్ల మార్క్‌ని దాటేశాయి. అలా అప్పటికి అదో బెంచ్ మార్క్. ఇప్పుడు పరిస్థితి అది కాదు.. 50 కోట్లు దాటినా, 60 కోట్లు దాటినా.. అది చాలా సాధారణమైన విషయంగా మారింది. 100 కోట్ల లెక్కల్లోనే వుంటున్నారు చాలామంది హీరోలు.
ఇక, తన తాజా చిత్రం 'డిజె' విషయంలోనూ అల్లు అర్జున్ వంద కోట్ల టార్గెట్‌ని పెట్టుకోవడం సహజమే కావొచ్చు. పైగా మలయాళంలో అల్లు అర్జున్‌కి మంచి మార్కెట్ వుంది. తమిళంలోనూ మార్కెట్ సంపాదించేందుకు స్ట్రెయిట్‌గా తమిళంలో ఓ సినిమా చేసేస్తున్నాడు అల్లు అర్జున్. ఇది ద్విభాషా చిత్రమేననుకోండి.. అది వేరే విషయం.
అల్లు అర్జున్ అనే కాదు, టాప్ లీగ్‌లో వున్న హీరోలందరిదీ ఇప్పుడు దాదాపు 100 కోట్ల టార్గెట్టే. మరి, ఆ టార్గెట్‌ని ఎన్ని సినిమాలు అందుకుంటాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. వరుసగా నాలుగైదు సినిమాలు 100 కోట్ల బెంచ్ మార్క్‌ని తాకేస్తే, ఆ తర్వాత టార్గెట్ మళ్ళీ చేంజ్ అయిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.