ఎవరికో ఎదో అయితే మనకు ఏమన్నా లాభం వుంటుందా అనే వ్యవహారం ఒకటి వుంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వ్యవహారం అలాగే వుంది. జనతా గ్యారేజ్ లాంటి హిట్ తరువాత సినిమా చేద్దాం అంటే డైరక్టర్ లేకుండా వుంది పరిస్థితి. ఎవరికి వారు ఫుల్ బిజీ. పెద్ద హీరోలు దూరం పెట్టిన పూరి జగన్నాధ్ ఒక్కరు మిగిలారు. కానీ ఆయనతో చేయడం అంతగా ఇష్టం లేదు ఎన్టీఆర్. ఇలాంటి టైమ్ లో పవన్ తన సినిమా ఒకటి అనౌన్స్ చేయడం కీలక పరిణామంగా మారింది.
పవన్ కు త్రివిక్రమ్ కాస్త చెడిందనే వార్తలకు తెరతీసినట్లు కనిపిస్తోంది ఎన్టీఆర్ క్యాంప్. ఇదే అదను, అదే అదను అని తమకు వున్న కమిట్ మెంట్ తో ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయమని మైత్రీ మూవీస్ వత్తిడి చేస్తోంది. పోనీ హారిక హాసిని బ్యానర్ లోనైనా తాను రెడీ అని ఎన్టీఆర్ సిగ్నళ్లు ఇస్తున్నాడు. అదీ కాదు అంటే తమ స్వంత బానర్లో నిర్మించేద్దాం అంటున్నాడని వినికిడి.
కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ కు పవన్ కు ఏమాత్రం చెడలేదన్నది. కేవలం నిర్మాత ఎఎమ్ రత్నంకు వున్న సమస్యలు, ఆయన ఆబ్లిగేషన్ల మేరకు పవన్ ఆ సినిమాకు పూజ జరిపించేసారు తప్ప, ఇప్పట్లో ఏమీ ఆ సినిమా వుండదని ఇన్ సైడ్ వర్గాల కథనం. నవంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమానే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అనవసరంగా త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ ను దూరం చేసుకునే అమాయకుడు కాదు పవన్.
కానీ ఈ కొత్త సినిమా ముహుర్తం నేపథ్యంలో వీలయినంత గ్యాప్ ను తీసుకువచ్చి, త్రివిక్రమ్ ను తమ దారికి తెచ్చుకోవాలని ఎన్టీఆర్ వైపు జనాలు కిందా మీదా అవుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదని త్రివిక్రమ్ వైపు జనాలు అంటున్నారు. చూడాలి మరి ఎవరి మాట నెగ్గుతుందో?