ఒక స్టేజి నటుడు ‘అధః పాతాళంబున..’ అంటూ చెయ్యి పైకెత్తి చూపించాడట. పాతాళం పైన ఉంటుందా? అదేమిటా నటన? అని కొందరు వెక్కిరించబోతే శ్రీశ్రీ అతన్ని సమర్థించారట. ‘ఔను తెలుగు నాటకరంగం అంత అధోస్థితిలో ఉంది..’ అని. ఆంధ్ర రాజకీయ పరిభాష పరిస్థితి యిప్పుడు అలాగే ఉంది. పాతాళం కంటె కింద, అధోజీవుల మధ్య తచ్చాడుతోంది. చాలాకాలంగా రోత పుట్టిస్తూ వచ్చి, మొన్నటి జోగి రమేశ్ ఉపన్యాసంతో తారాస్థాయి అనకూడదు, అధమస్థాయికి చేరింది, అతి త్వరలోనే అతని రికార్డు మరొకరు బద్దలు కొట్టవచ్చు. వేదిక మీద ఉన్న జగన్ యిలాటిది ముందుగా ఊహించి ఉండకపోతే వెంటనే మైక్ కట్ చేయించాల్సింది. తర్వాతయినా మైకు తీసుకుని, అవన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అంటూ తనను తాను యిన్సులేట్ చేసుకోవాల్సింది. కానీ జగనే స్వయంగా వ్యక్తిగత దూషణలు పెంచాడీ మధ్య. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఎప్పణ్నుంచో మాట్లాడుతున్నాడు. ఈ మధ్య బాబు, బాలకృష్ణ, లోకేశ్‌లను కూడా తిట్టేశాడు. ఇది చాలా తప్పు.
ముఖ్యంగా పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం పొరపాటు. వివాహబంధం విచ్చిన్నం కావడం ఎవరికైనా విషాదకరం. అది మీ యింట్లోనే జరిగినప్పుడు ఆ దుఃఖం ఎలాటిదో తెలుస్తుంది. దాన్ని ఎన్నికల అంశంగా మార్చాలని చూడడం క్రూరం, హేయం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగత విషయాల ప్రస్తావన అనవసరం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్లే వేదికలపై యివి మాట్లాడితే, యిక సోషల్ మీడియా అజ్ఞాత వీరులు ఊరుకుంటారా? రెచ్చిపోతున్నారు. ఎవరెవరి గురించో ఏమిటేమిటో చెప్పేస్తున్నారు. వివాహాల గురించే కాదు, వివాహేతర సంబంధాల గురించి కూడా! ఫలానా నాయకుడికి, నాయకురాలికి ఫలానా తారతో, ఫలానా తారడితో సంబంధం ఉందిట అంటూ. ఆధారాలతో పని లేదు. ఒకవేళ ఉన్నా, వాటిని ప్రస్తావించి లాభమేమిటి? ఒకవేళ అక్రమ సంబంధం ఉన్నా దానితో ఓటరు కేమిటి పని?
కన్సెన్టింగ్ ఎడల్ట్స్ (పరస్పరం యిష్టపడిన వయస్కులు) ఏం చేసినా తక్కినవాళ్లకు సంబంధించిన విషయం కాదు. ఫలానావారిని బలాత్కరించాడనో, లేక అధికారాన్ని దుర్వినియోగం చేసి, వాళ్లకు మేలు చేకూర్చాడనో నిరూపిస్తేనే పబ్లిక్ యింట్రస్టు (ప్రజాప్రయోజనం) అంశం ముందుకు వస్తుంది. లేకపోతే అది ఆయా వ్యక్తుల కుటుంబాలకు పరిమితమైన విషయమంతే! భార్య ఉండగా మరొకరి ద్వారా పిల్లలు కనడం అనైతికం కావచ్చు, కానీ అది వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. బాధిత వ్యక్తి దానికోసం నష్టపరిహారం కోరవచ్చు. ఓటర్లకు దానితో సంబంధం ఏముంది? అలాటి ప్రవర్తనకూ పరిపాలనా సామర్థ్యానికి, రాజకీయ పరిజ్ఞానానికి సంబంధం ఏముంది? వీటిని ప్రస్తావించి, చర్చించి లాభమేమిటి? అంతకంటె అతని పార్టీ విధానాలను విమర్శించు. రాజకీయ అవగాహన లేదని నిరూపించు. సామాజిక నీతిని రక్షించే పనిని స్వాములకు, ప్రవచనకారులకు వదిలిపెట్టు.
పవన్ భార్యల గురించి జగన్ అనగానే ‘నీ ముత్తాతకు యిద్దరు పెళ్లాలం’టూ టిడిపి ప్రతినిథి చెప్పుకొచ్చారు. అప్పట్లో మహిళలు ప్రసూతిలో చనిపోవడం చాలా ఎక్కువ. దాంతో సాధారణ కుటుంబీకులు కూడా ఒకరు పోతే మరొకర్ని కట్టుకునేవారు. సవతి సోదరులుండడం అప్పట్లో సహజంగా ఉండేది. కొందరు యిద్దర్ని ఒకేసారి కట్టుకునేవారు కూడా. తర్వాత తర్వాత చట్టాలు వచ్చి వాటిని కట్టడి చేశాయి. ఇప్పటికీ వాటిని అతిక్రమించే వారున్నారు. ఇదంతా వేరే చర్చ. రాజకీయాలకు అనవసరమైన చర్చ. ఇలా వంశచరిత్రలు తవ్వుకుంటూ పోతే ఎక్కడ ఆగుతారో తెలియదు. ఈ రోజుల్లో పెళ్లిళ్లు నిలవడం కష్టమై పోయింది. ఈ రోజు మరొకరిపై వ్యాఖ్యానించిన వారి సంగతి రేపు ఏమవుతుందో తెలియదు. వాటి జోలికి పోకపోవడమే మంచిది.
అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేయడం ఎక్కడైనా ఉన్నదే. ముఖ్యమంత్రి అసమర్థుడు, అవినీతిపరుడు, హింసా రాజకీయాలు చేస్తాడు.. యిలాటివి ఎన్నయినా అనవచ్చు. కానీ వ్యక్తిగతంగా వెళ్లి ఉన్మాది, క్రాక్, సైకో, గూండా యిలాటివి అనటం భావ్యం కాదు. ఫలానా చట్టం తేవడం మూర్ఖపు ఆలోచన అనడం వరకు ఓకె. కానీ చట్టం తెచ్చిన నువ్వు మూర్ఖుడివి అనడం సభ్యత కాదు. బాబు దాదాపు 50 ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నారు. గత ఆరేడేళ్లగా మాత్రమే యిలాటి భాష ఉపయోగిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎందరో ప్రత్యర్థులు. మావగారు కూడా ప్రత్యర్థిగా మారాడు. ఎవరిపైనా ఉపయోగించని భాష జగన్‌పై ఉపయోగిస్తున్నారు. ఇది చిత్రంగా ఉంది. తనపై తిరుగుబాటు చేసి వెళ్లిపోయిన కెసియార్, దేవేందర్ గౌడ్, జనార్దన రెడ్డి, రేణుకా చౌదరి వంటి వారెవరిపైనా వాడని భాష జగన్ పైన ఉపయోగించడానికి కారణమేమిటి?
తను బచ్చాగా తీసి పారేసిన వ్యక్తి, 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తనవైపు తిప్పుకున్నా ఏమీ చేయలేని అసమర్థుడిగా తను పరిగణించిన వ్యక్తి, 2019 వచ్చేసరికి తనను ఘోరంగా ఓడించాడన్న కసియా? అయితే కావచ్చు. పరాజితుడికి ఆక్రోశం ఎక్కువ. ఉక్రోషం ఎక్కువ. విజేత చిద్విలాసంగా నవ్వుతూ ఉంటాడు. తన శక్తిని చేతల్లో చూపిస్తాడు. ఓటమికి గురైనవాడు ఏమీ చేయలేక తిట్లకు లంకించుకుంటాడు. ఈ సైకాలజీ గురించి గతంలో కూడా రాశాను. అశక్తులు నోటి ద్వారా తమ ప్రతాపాన్ని చూపిస్తాను. మీ యింట్లో వాళ్లను అది చేస్తా, యిది చేస్తా అని బూతులు కురిపిస్తారు. ఆ పని నిజంగా చేసేవాడు మాటలతో సమయాన్ని వ్యర్థం చేయడు, చేసి చూపిస్తాడు. ఏమీ చేయలేనివాడికే యీ అవస్థ! చిన్న పిల్లల్లో, వృద్ధులలో, బలహీనుల్లో యీ లక్షణాన్ని గమనించవచ్చు. ఓటమిపాలై, ప్రతిపక్షానికి వచ్చి పడ్డవారు పోలీసులకు తర్జని చూపించి బెదిరిస్తూ ‘మేం అధికారంలోకి వచ్చి మీ పనిపడతాం’ అంటూంటారు. పోలీసులు ‘సరే, అలాగే కానీయండి’ అనుకుంటూ తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఏమీ బెదరరు.
ఓటమి చెందాక చంద్రబాబు దుర్భాషలు ఎక్కువ కావడం అర్థం చేసుకోదగినదే. కానీ ఆయన అధికారం చరమదశలోనే మొదలుపెట్టేశారు. జగన్ పాప్యులారిటీ పెరుగుతోందని పసి గట్టారో ఏమో, బెదురు పుట్టి కాబోలు ‘కోడికత్తి’ వంటి పదాలు ధారాళంగా వాడడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాకు తగని మాటలు మాట్లాడారు. బాబేమిటి, యిలా మాట్లాడుతున్నారు అనుకుంటే జగన్ వచ్చి ఆ పదవి పరువు పూర్తిగా తీసేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అప్పటి ఎన్నికల కమిషనర్ కులప్రస్తావన చేశారు. ఇక యిటీవలి కాలంలో శ్రుతి మించింది. పవన్‌ను బాబు దత్తపుత్రుడు అనడం రాజకీయ విమర్శగా అనుకుని ఊరుకోవచ్చు. కానీ తక్కిన విషయాలెందుకు? ఇక మొన్నయితే పరాకాష్టకు వెళ్లిపోయారు. వెకిలితనం ప్రదర్శించిన ముసలాయన, దౌర్భాగ్యుడు, అమ్మాయిలతో డాన్సులు..అంటూ తన ప్రతికక్షులందర్నీ తిట్టిపోశారు. తన పార్టీ మంత్రులందరూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూంటే వారించడేమిట్రా అనుకుంటే, తనే స్వయంగా పాతాళానికి పతనమైతే యిక చెప్పేదేముంది? దేశంలో ఏ ముఖ్యమంత్రయినా యిలాటి భాష వాడుతున్నాడా?
ప్రతిపక్షాల వారు మాట్లాడుతున్నారు కదా, మేం మాట్లాడితే తప్పా? అనే వాదన అధికార పార్టీ సభ్యులు చేయకూడదు. ప్రతికక్షులు పరాజితులు, నిరంతరం పళ్లు నూరుకునేవారు. మీరెందుకు నోరు పారేసుకోవడం? వాళ్లకైతే ఏ పనీ లేదు, మీరు చేసిన నిర్వాకం చాల్లే అని ప్రజలు వాళ్ల కోరలు పీకి మూల కూర్చోబెట్టారు. వాళ్లు విసుక్కుంటూ, కసురుకుంటూ, తిట్టుకుంటూ, తిమ్ముకుంటూ కూర్చున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఉపయెన్నికలలో, స్థానిక ఎన్నికలలో మిమ్మల్నే గెలిపిస్తున్నారు. మీరు మీ చేతలతోనే వాళ్లకు సమాధానం చెప్తే చాలు. అన్యాయపు, అసత్య ఆరోపణలు చేస్తే గణాంకాలతో సహా తిప్పి కొట్టడానికి మీ దగ్గర సమస్త సాధనాలూ ఉన్నాయి. అధికారగణం ఉంది. ప్రెస్ రిలీజు మార్గం ఉంది. అవన్నీ మానేసి, ఎగబడి తిట్టడం దేనికి?
మీరేదో చేస్తారనే ఆశతో ప్రజలు మీకు ఐదేళ్ల ఛాన్సిచ్చారు. మళ్లీ సారి యిస్తారో లేదో తెలియదు. అధికారం చేతిలో ఉన్నంత సేపు ఎంత బాగా చేద్దామా, ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుందామా? మళ్లీ టిక్కెట్టు తెచ్చుకుందామా అని ఆలోచించాలి తప్ప కొత్త తిట్లు ఎలా కనిపెట్టాలా, తిట్లలో ప్రాస ఎలా తేవాలా అన్న దానిపైనే ధ్యాస పెడితే ఎలా? మీరు తిట్టడం వలన మీ నోటి దురద తీరుతోంది తప్ప ప్రజలకు యిసుమంతైనా లాభం కలుగుతోందా? ప్రతిపక్షాల తిట్ల వలన వారు ప్రభావితం అయిపోతున్నారు కాబట్టి, వారి మాయలో పడకుండా మేమూ తిరిగి తిడుతున్నాం అని చెప్పగలరా? వారు చేసే ఆరోపణలను తిప్పి కొడితే చాలు, వారి తిట్లకు మీరు మరింత మసాలా చేర్చి తిట్టనక్కరలేదు.
ప్రజలకు తెలుసు బాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని. 1975లో ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే జగన్ 2009లో అంటే 34 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ రోజు తన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి వదిలిపెట్టాడు. టిడిపి చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ సీట్లు వచ్చేట్లు చేశాడు. నాలుగేళ్ల తర్వాత కూడా టిడిపి ఒంటరిగా బరిలోకి దిగే సాహసం చేయడం లేదు. జనసేన కలిసి వచ్చినా సరిపోదని, బిజెపి కూడా వస్తేనే పోరు ఓ స్థాయిలో జరుగుతుందని అనుకునే స్థితిలోకి టిడిపి నెట్టబడింది. బిజెపి చూస్తే ఎటూ తేల్చకుండా నానుస్తోంది. మొన్న ఎన్డిఏ సమావేశానికి 37 మంది పార్టీలను పిలిచి కూడా టిడిపిని పిలవలేదు. ఆ సమావేశానికి వెళ్లి వచ్చాక పవన్ ‘జగన్ పోవాలి, ఎన్డిఏ పాలన రావాలి’ అని మరింత గందరగోళానికి గురి చేస్తున్నాడు. ఎన్డిఏ పాలన అంటే ప్రస్తుతానికి టిడిపి దానిలో లేనట్లే కదా!
వైసిపి, టిడిపి ముఖాముఖీ తలపడి ఒకరి బలాన్ని మరొకరు తగ్గించుకుంటే ఆ వాక్యూమ్‌లో దూరదామని బిజెపి చూస్తోందని అందరికీ అర్థమైంది. రెండిటిలో టిడిపి బలహీనమైంది కాబట్టి దాన్ని లుప్తం చేయడం సులభమనే ఆలోచన దానిది. బిజెపి మద్దతు ఉందంటే టిడిపి సమర్థకుల్లో హుషారు వచ్చేది. ప్రస్తుతం అది కనబడటం లేదు. వైసిపిని ఓడించడానికి టిడిపి-జనసేన కూటమి బలం చాలదు అనే అభిప్రాయం టిడిపి మద్దతుదారుల్లో బలపడితే నిధుల సమీకరణ కష్టం. ఈసారి సీట్ల సంఖ్య మూడు రెట్లు పెరిగినా సరిపోదు. అధికారం చేతికి రావాలంతే! లేకపోతే పార్టీని నిలబెట్టడం కష్టమౌతుంది. ఇదీ బాబుకున్న బెంగ. ఎన్నికల్లో విజయం వంటి ఏ రుజువులూ చూపించలేక పోయినా, జగన్ పని అయిపోయింది, యింటికెళ్లిపోవడం ఖాయం అని తన క్యాడర్‌ను హుషారు చేస్తూ నెట్టుకు రావడం ఎలా అనే ఆందోళనతో పాటు పవన్ ఫ్యాక్టర్‌ను ఎలా డీల్ చేయాలనే చింత కూడా తోడై ఉండవచ్చు. వారాహి యాత్రానంతరం పవన్ బలం పెరిగిందా, కేవలం వాపేనా? అతను ఏ 50 సీట్లో అడిగితే ఏం చేయాలి? ఇలాటి అనేక సమస్యలున్నాయి ఆయనకు. కూటమికి నాయకత్వం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇలాటి పరిస్థితుల్లో ఉన్న బాబు ఏం మాట్లాడినా జనం పెద్దగా స్పందించటం లేదు. ‘2019లో ఆ సైకో ఏదో ఒక్క ఛాన్సంటే మీరు పిచ్చెక్కినట్లు ఓట్లేసి నన్ను ఓడించి తప్పు చేశారు, అనుభవిస్తున్నారు’ అని మాటిమాటికీ తిట్టినా పడ్డారు. మా ఓటు, మా యిష్టం అని తిరగబడి ఏమీ అనలేదు. ‘నువ్వు చెప్పినది నిజమయ్యా, స్థానిక ఎన్నికల్లో, ఉపయెన్నికల్లో తప్పు దిద్దుకుంటాం’ అనలేదు. దిద్దుకోనూ లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది దగ్గర్నుంచి, ప్రతీ మూణ్నెళ్లకూ ‘ఇవిగో ముందస్తు ఎన్నికలు, అవిగో ముందస్తు ఎన్నికలు’ అని తొందర పెట్టినా వాళ్లేమీ తొందర పడలేదు. నిర్లిప్తంగా కూర్చున్నారు. వాళ్లేదైనా చేసేస్తూంటే, ‘బాబు మాయలో పడిపోతున్నారు, విరుగుడుగా మనం టిడిపి వాళ్లను తిట్టాలి’ అని వైసిపి కంగారు పడినా అర్థముంటుంది. ప్రజలు పట్టించుకోనప్పుడు వీళ్లెందుకు బాధపడడం?
పవన్ విషయమూ అంతే. ప్రజలకు పవన్ కడుపుమంట తెలుసు. 2014లో టిడిపి, బిజెపి తన తోడ్పాటుతోనే గెలిచాయని, తనొక ప్రచండ మారుతాన్నని అనుకున్న పవన్ 2019లో కంగు తిన్నారు. తన పార్టీ నుంచి ఒకే ఒక్కడు గెలిచాడు. తను రెండు చోట్ల ఓడిపోయాడు. డిపాజిట్లు దక్కిన అభ్యర్థులు తక్కువ. అభిమానుల కోలాహలం ఓట్లగా తర్జుమా అవుతుందని వేసుకున్న లెక్కలన్నీ తారుమారయ్యాయి. గతం గతః అని ఆయన ఊరుకోలేక పోతున్నాడు. ఆ బాధను యిప్పటికీ వ్యక్తం చేస్తున్నాడు. మీరు కేకలే తప్ప ఓట్లు వేయరు, నన్ను సిఎం చేయలేకపోతే మానె కనీసం అసెంబ్లీ కైనా పంపండి అని అభ్యర్థిస్తున్నాడు. ఇలాటి ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి తననూ, తన పార్టీని చిత్తుగా ఓడించిన జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉంటాడా? అని ప్రజలు పెదాలు చప్పరించి ఊరుకుంటున్నారు తప్ప రియాక్ట్ కావటం లేదు. అయి ఉంటే జనసేన ఉపయెన్నికలలోనే నిలబడే ధైర్యం చేసేది. ఇప్పటికీ ఎన్ని స్థానాల్లో అభ్యర్థులు దొరుకుతారో క్లారిటీ లేకుండా ఉంది. ఏ ప్రముఖ నాయకుడూ జనసేనలో చేరటం లేదు.
పవన్ తనను చూడడానికి వచ్చే జనాలకు తన పార్టీ విధానాల గురించి కానీ, తన మానిఫెస్టో గురించి కానీ, ఉమ్మడి పౌరస్మృతి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, తెలంగాణతో ఉన్న జలవివాదం గురించి తన పార్టీ కున్న దృక్పథం చెప్పడం లేదని, కేవలం దూషణలకే పరిమితమౌతున్నారని విమర్శిస్తాం. కానీ వార్తల్లోకి ఎక్కాలంటే అలాటి గంభీర విషయాలపై మాట్లాడితే లాభం లేదు. అసెంబ్లీలో, పార్లమెంటులో మైకులు విరక్కొట్టేవారికి వచ్చిన కవరేజి గంభీరోపన్యాసం యిచ్చినవారికి రాదని ఖుశ్వంత్ సింగ్ ఓ సారి వాపోయారు. పవన్ సభలకు వచ్చేదంతా కుర్రవాళ్లే. వాళ్లకు చే గువేరా బొమ్మ ఉన్న టీషర్టులు వేసుకోవడం తప్ప, అతనే దేశస్థుడో కూడా సరిగ్గా తెలియదు. పవన్, చే సిద్ధాంతాల గురించి పాఠాలు చెప్పి, అతని కంటె ప్రస్తుతం సావర్కార్ తనకు ఎందుకు ఆప్తుడయ్యాడో వివరించినా వాళ్లకు అర్థమౌతుందని నాకు తోచదు. ప్రౌఢమైన శేషేంద్ర శర్మ కవిత్వాన్ని వల్లించినా తల కెక్కదు.
జనసేన మీటింగంటేనే విజిల్స్! ఆలోచన రేకెత్తించేలా మాట్లాడితే విజిల్స్ వేసే వీలుండదు. అందుకే పవన్ ఉపన్యాసంలో గణాంకాలుండవు, లాజిక్కులుండవు. ఎంతసేపూ నేను, నేను, నేను! దంచేస్తా, పొడి చేస్తా, తాట తీస్తా, తొక్క లాగుతా, తోలు పీకుతా.. యింతే కదా! అది కాకుండా నేను సినిమాల్లో యింత ఆర్జిస్తానంటూ లెక్కలు చెప్తారు. ఎదురుగా కూర్చున్నవాళ్లు నిరుద్యోగులు, చిరుద్యోగులు. నెలకు పదివేలు తెచ్చుకోవడం గగనమైనవారు. వారి ఎదుట నేను రోజుకి రెండు కోట్లు గడిస్తా అని చెపితే సంతోషిస్తారా? ఏ రాజకీయ నాయకుడైనా నాకింత ఉంది, అంత ఉంది అని చెప్తాడా? ఈయన చెప్పి, చివర్లో ‘…అయినా ఎన్నికల్లో పోరాడడానికి నా దగ్గర డబ్బు లేదు. జగన్ అవినీతిపరుడు కాబట్టి అతని దగ్గర ఉంది.’ అని ముగిస్తాడు. ప్రజలకు యిదంతా ఒక వినోదమై పోయింది.
ఈ మధ్య జగన్‌ని యికపై జగ్గూ అని పిలుస్తా అని పెద్ద డిక్లరేషన్ ఒకటి. జగ్గూ అన్నా, జైల్లో మగ్గూ అన్నా అతని పదవి ఏమీ ఊడిపోదు. ఎన్టీయార్‌ను ‘ఎమ్టీవోడు’, ఎయన్నార్‌ను ‘నాగ్గాడు’ అని జనం పిలుచుకున్నా కలక్షన్లు పెరిగాయి తప్ప తరగలేదు. మోదీ యింటి పేరు గురించి రాహుల్ గాంధీ అప్రాచ్యపు కూతలు కూస్తే, అతని పార్లమెంటు సభ్యత్వమే ఊడింది కానీ, మోదీ ప్రధానిగా విరాజిల్లుతూనే ఉన్నాడు. రెండున్నర గంటల సినిమాలో కూడా పంచ్ డైలాగులు నవ్వులు, చప్పట్లు తెచ్చుకుంటాయి కానీ సినిమాని ఆడించలేవు. ఆడించేది కథ, కథనం మాత్రమే. ‘‘కీర్తిశేషులు’’ నాటకంలో మురారి డైలాగు ఉంటుంది, ‘ఆ చప్పట్లేరా నన్నిలా చేశాయ్’ అంటూ. అవి ఆకాశానికి ఎగరేస్తాయి, మత్తెక్కిస్తాయి, కింద పడేస్తాయి.
సినిమా రంగంలో ఎన్నో వైఫల్యాలు చూసిన పవన్‌కి యిది తెలుసు. రాజకీయాల్లో కూడా ‘మీరు చప్పట్లు కొడతారు కానీ ఓట్లు వేయరు’ అంటూ పలుమార్లు విసుక్కున్నాడు కూడా. అయినా చప్పట్లు పడేటట్లే డైలాగులు చెపుతున్నాడు. రోడ్ల మీద గుంతలున్నాయి అని అంటే ప్చ్, ప్చ్‌లు వినబడటం లేదు. ఈలలు వినబడుతున్నాయి. ప్రసంగం ముగిసేవరకూ మీరు సద్దు చేయకుండా వినండి అని అతను మాట్లాడితే రాష్ట్ర ప్రజల కోసం అతని ఆలోచనలు, ప్రణాళికలు అందరికీ తెలుస్తాయి. వాటిపై ఓటర్లు ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి పవన్ ప్రసంగం అనగానే యివాళ కొత్తగా ఏం తిట్టాడు అని చూడాల్సి వస్తోంది. ఇతనేదో అనగానే తరుముకూత పట్టినట్లు వైసిపి వాళ్లు యింకో రెండు జోడించి అంటున్నారు. ఇదో పెద్ద నాన్‌స్టాప్ నాన్సెన్స్, న్యూసెన్స్ అయిపోయింది.
ప్రజలకు కావలసినది తిట్లు కావు, పనులు. తిట్ల కోసమే అయితే ఓటిటికి వెళితే చాలు. సరిగ్గా పాలించండి అని అధికార పక్షానికి, వాళ్లు చక్కగా పాలిస్తున్నారో లేదో గమనించండి అని ప్రతిపక్షానికి బాధ్యతలు అప్పగిస్తే వాళ్లు అవి మానేసి తిట్లతో కాలక్షేపం చేస్తే ఎలా? బాబు, లోకేశ్, పవన్ ఎవరైనా సరే, వారి ఉపన్యాసాలు చూసి వైసిపి వాళ్లు ‘పాపం నెర్వస్‌నెస్‌కు సూచనలివి’ అనుకుని నవ్వుకుని, తమకు ఓటర్లు అప్పగించిన పనిపై ధ్యాస పెట్టాలి తప్ప తిట్లకు ఉడుక్కోకూడదు, అదే భాషలో తిరిగి మాట్లాడకూడదు. తిరిగి తిడితే దాని అర్థం, మళ్లీ గెలుస్తామో లేదో అని వీళ్లూ వణుకుతున్నారు అని. 2017-18 నుంచి కాబోలు బాబు భాషలో మార్పు వచ్చింది. 2019 నాటికి ఫలితం కనబడింది. ఇన్నాళ్లూ తిట్టే పని కాబినెట్ సహచరులకు అప్పగించిన జగన్ యిప్పుడు తనే రంగంలోకి దిగి తిడుతున్నాడంటే 2019లో బాబుకి జరిగినది 2024లో తనకు జరగబోతోందని జగన్‌కు తోస్తోందా?
ప్రత్యర్థి స్థాయి బట్టి హీరో స్థాయి పెరుగుతుంది. ఎదురు లేకుండా ఏలుతున్న సోనియాను ధిక్కరించినప్పుడు హీరో అంటారు కానీ, రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌ను వెక్కిరిస్తే హీరో అంటారా? ఇప్పుడు చండప్రచండంగా వెలుగుతున్న మోదీని ధిక్కరించిన మమతనో, అరవింద్నో చూసి ఓహో అనుకుంటాం. జగన్‌కు దమ్ముంటే బిజెపి బిల్లులకు రాజ్యసభలో మద్దతివ్వం అని చెప్పాలి. అది చేతకాక, అన్నీ పోగొట్టుకున్న బాబుని, యింకా నిలదొక్కుకోని పవన్‌ను నేరుగా తిట్టి అది నా ప్రజ్ఞ అనుకుంటే జనం హర్షించరు. రాజకీయాల్లో చెణుకులు ఎప్పుడూ ఉన్నాయి. ప్రతిపక్షాల వాళ్లు కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని ‘మా నియోజకవర్గాలకు కాసు విదల్చటం లేదు’ అని, కరుణానిధిని ‘మీకు పేరులోనే కరుణ తప్ప మనసులో లేదు’ అని ఎత్తిపొడిచేవారు. పవన్ పేరులో ‘కళ్యాణ్’ అని ఒత్తి పలికితే చాలు చెప్పదలిచింది, సభలో వారికి అర్థమౌతుంది. అలాగే జగన్మోహిని బంతిలో పాలపక్షం చేసి కొన్ని వర్గాలకే అమృతాన్ని పంచిపెడుతోందన వచ్చు. ఎన్నికల వేళ చంద్రగ్రహణం తప్పదు, గుడి తలుపులతో పాటు పార్టీ ఆఫీసు తలుపులూ మాతపడతాయనవచ్చు. ఇలాటి చతురోక్తులు మానేసి మోటుభాషకు దిగితే ఎలా?
తాజాగా జోగి రమేశ్ విషయానికి వస్తే అతను ఎటెన్షన్ సీకర్. 50 వేల కుటుంబాలకు మేలు చేకూర్చే అతి ముఖ్యమైన కార్యక్రమం తలపెడితే ఫోకస్ అంతా తన ప్రలాపాలపై తిప్పుకున్నందుకు జగన్ అతన్ని శిక్షించాలి. కొడాలి నాని, రోజా వంటి వారు హద్దు మీరి మాట్లాడుతూంటే ‘గతంలో బాబు దగ్గర పని చేశారుగా, అప్పుడు తెలియలేదా’ అని మందలించి నోరు మూయించాలి. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ప్రతిపక్షాల తిట్లకు స్పందించడం మానేస్తే, కొంతకాలానికి వాళ్లే మానేస్తారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల నేరచరిత్రను రికార్డు చేసి ప్రజలకు చెప్పే సామాజిక సంస్థలుంటాయి. ఆంధ్రలో మరో సంస్థ ఉద్భవించి అభ్యర్థుల తిట్లచరిత్రను రికార్డు చేసి, యిలాటి వాళ్లను ఎన్నుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. లేకపోతే యీ సంస్కృతి క్రమేపీ తెలంగాణకు కూడా వ్యాపిస్తుందని భయం వేస్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)